Suryaa.co.in

Editorial

తవ్వుకో..తోలుకో.. తమ్ముళ్ల పైసా వసూల్!

– ప్రకాశం టు తెలంగాణ బోర్డరుకు జీరో బిల్లులతో మైనింగ్ తరలింపు
– చీమకుర్తి, బల్లికురువ, గురిజేపల్లి, మార్టూరు, వేమవరం నుంచి బిల్లులు లేకుండానే తరలుతున్న గ్రానైట్ రాళ్లు
– ఇటు తెలంగాణ- అటు చెన్నై సరిహద్దులో అన్‌స్టాపబుల్ ట్రాన్స్‌పోర్టు
– సగానికి పైగా బిల్లులు లేకుండానే తరలింపు
– వేబిల్లులు-మైనింగ్ వేబిల్లుల్లో గోల్‌మాల్
– ప్రజాప్రతినిధులకు నెలవారీ వాటాలు
– ఏ నియోజకవర్గం గుండా వెళితే అక్కడ నేతలకు కప్పం కట్టాల్సిందే
– ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఓ టీడీపీ ఎమ్మెల్యే హవా
– సర్కారు ఖజానాకు ఏడాది వెయ్యి కోట్ల కన్నం
– అన్నీ డమ్మీ బిల్లులే.. అడిగితే చూపించేది ఆ బిల్లులే
– చీమకుర్తిలో అన్ని పార్టీల నేతలకూ క్వారీలు, మైనింగ్ వ్యాపారం
– మైనింగ్, పోలీసులు, కమిర్షియల్ టాక్స్ అధికారులకూ వాటాలు
– గతంలో మాచర్లలో పిన్నెల్లి అనధికార చెక్‌పోస్ట్
– ‘చెల్లింపు చీటీ’ చూపిస్తేనే లారీ దాటనిస్తారు
– కూటమి వచ్చిన తర్వాత రేటు పెంచి మరీ ప్రజాప్రతినిధుల దందా
– సరిహద్దుల్లో నిద్రపోతున్న ‘నిఘా’
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న కూటమి నేతల ఆకలి మరీ ఎక్కువగా ఉన్నట్లుంది. అధికారం వచ్చిన వెంటనే అందుబాటులో ఉన్న అన్ని వనరులనూ చెరబడుతున్నారు. అందినకాడికి దండుకుంటున్నారు. అదేమంటే ఎన్నికల్లో పెట్టిన ఖర్చు ఎవరిస్తారన్న ఎదురుప్రశ్న. అందుకే.. ఇప్పటికే దారులువేసిన పాత మార్గాలలో పయనిస్తున్నారు.

అంటే గత వైసీపీ విధానాలే అనుసరిస్తున్నారు. దానిని వైసీపీ కూడా ప్రశ్నించలేదు. ఎందుకంటే ‘నీవు నేర్పిన విద్యనే నీరజాక్ష’ అంటారు కాబట్టి. ఇది కూటమి నేతలకు బాగా కలసివస్తోంది. కొత్తగా అక్రమమార్గం పట్టాల్సిన పనిలేదు. ఉన్న పాత పద్ధతే పాటిస్తున్నారు. అందులో ఉత్తి పుణ్యానికి బాగా ఆదాయం వచ్చే మైనింగ్-క్వారీరాళ్ల తరలింపు.. ఇప్పుడు కూటమి ప్రజాప్రతినిధులకు, కాసులు కురిపిస్తోంది.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, నె ల్లూరు జిల్లాల్లో మైనింగ్ వ్యాపారం.. కూటమి ఎమ్మెల్యేలకు వరంగా మారింది. గోదావరి జిల్లాల్లో ఇప్పుడు మైనింగ్ వ్యాపారాలను ఓ నాయకుడు బాగా ‘సాన’పడుతున్నారట. సీనరేజీ కాంట్రాక్టు దక్కించుకున్న వైసీపీ కాంట్రాక్టరు పేరుతో, ఆ యువ వ్యాపారే ‘సాన’బెడుతున్నారన్న ప్రచారం పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది.

ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లా మైనింగ్ యవ్వారం సెప‘రేటు’. నిజానికి ప్రకాశం జిల్లా పేదది. కానీ అక్కడున్న మైనింగ్ ఆదాయంతో, జిల్లాలో పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించవచ్చు. ప్రధానంగా చీమకుర్తి మైనింగ్‌లలోకి తొంగిచూస్తే.. అక్కడ ఆ వ్యాపారం చేసేదంతా బిగ్‌షాట్సే. వందలు, వేల కోట్ల ఆస్తిపరులే. ఈ కోటీశ్వరులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. అందుకే మైనింగ్ అధికారులకు ఆ జిల్లా అంటే మహా ఇష్టం. ఏరికోరి మరీ ఆ జిల్లాలో పోస్టింగ్ వేయించుకుంటారు. ఒక్క మైనింగ్ శాఖ మాత్రమే కాదు. కమర్షియల్ టాక్స్, లేబర్, పోలీసు శాఖ అధికారులకు ఆ జిల్లాలో ఒకసారి పనిచేయాలన్న జీవిత కోరిక. కారణం.. ‘మామూలే’.

అన్ని రాజకీయపార్టీలకు కామధేనువు ఇది. ఎన్నికల చందాల నుంచి..జిల్లాలో జరిగే రాజకీయ పార్టీల మీటింగుల వరకూ వీళ్ల నిధులే శ్రీరామరక్ష. ఇటీవలి ఎన్నికల్లో ఓ జాతీయ పార్టీ కీలక నేత, ఒంగోలులో మైనింగ్ వ్యాపారులతో మీటింగ్ పెట్టి, చందాలు తీసుకున్నారట.

అటు మీడియాకూ ఈ మైనింగ్ వ్యాపారం ‘నెలవారీ’ కాసుల వర్షం కురిపిస్తుంది. రాళ్ల తవ్వకాలు, పేలుళ్ల సందర్భంగా లెక్కలేనంతమంది కార్మికులు చనిపోతుంటారు. ఎంతోమందికి గాయాలవుతుంటాయి. కార్మిక చట్టాల ప్రకారం వారికి భారీగా నష్టపరిహారం చెల్పించాల్సి ఉంటుంది. కార్మిక సంఘాలు అక్కడ ధర్నాలు చేస్తుంటారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తుంటారు. అవేమీ బయటకు పొక్కకుండా ఉండేందుకు అదో చిన్న గురుదక్షణ.

మీడియా సంస్థలు ఏడాదికోసారి ముద్రించే క్యాలెండర్లు, పండగలప్పుడు వేసే స్పెషల్స్‌కు, ఈ మైనింగ్ వ్యాపారులే కామధేనువు. ఇక ఆ జిల్లాలో జరిగే జర్నలిస్టు యూనియన్ల జనరల్‌బాడీ మీటింగులకు, వారిచ్చే గిఫ్టులకు సింహభాగం స్పాన్సర్లు మైనింగ్ వ్యాపారులే.
మరి అంత ఘనమైన ఆదాయం అక్కడ ఏముంటుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది? అన్నదే కదా అందరి అనుమానం. కమాన్ రండి.. అక్కిడికే వెళదాం..

చీమకుర్తి, బల్లికురువ, గురిజేపల్లి, మార్టూరు, వేమవరం, మర్రిచెట్లపాలెం, బూదవాడ ప్రాంతాలు మైనింగ్, క్వారీలకు ప్రసిద్ధి అన్నది కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడి నుంచి ప్రతిరోజూ సుమారు 500 లారీలు.. 150 వరకూ కంటైనర్లు పాలిష్ చేసిన గ్రానైట్ రాళ్లను హైదరాబాద్, చెన్నైకు తీసుకువెళుతుంటాయి. వీటికి మహారాష్ట్రలో కూడా బాగా గిరాకీ.

మామూలుగా అయితే వీటికి కమర్షియల్ టాక్సు నుంచి వేబిల్లు, మైనింగ్ శాఖ నుంచి మైనింగ్ బిల్లు ఉండి తీరాలి. దీనికి సంబంధించి ఒక అడుగుకు 5 నుంచి 10 రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఆ ప్రకారంగా ఒక్కో లారీకి నాణ్యత బట్టి, 60 నుంచి లక్ష రూపాయల వరకూ పన్నుల రూపంలో చెల్లించాలి. అంటే కమర్షియల్ టాక్సుకు జీఎస్టీ 18 శాతం, మైనింగ్ శాఖకు 5-10 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ అక్కడ జరిగేదంతా జీరో బిల్లుల దందానే.

ఒకే బిల్లుతో.. అది కూడా ఎవరైనా అడిగితే చూపించి, ట్రాన్సుపోర్టు దందా చేస్తున్న సంస్కృతి, కొన్నేళ్ల నుంచి విజయవంతంగా జరుగుతోంది. దీనితో సర్కారు నష్టపోతున్న ఆదాయం రోజుకు 2 కోట్లరూపాయలు. అంటే నెలకు 60 కోట్లు. ఏడాదికి 720 కోట్లు. ఇక రాయి తవ్వి తరలించే లారీలు ఈ ఆదాయానికి అదనం. అంటే మొత్తంగా సర్కారు బొక్కసానికి, మైనింగ్ వ్యాపారులు పెడుతున్న కన్నం, వెయ్యికోట్ల రూపాయలన్నమాట. ఒక్కో కంటైనర్, ఒక్కో లారీ ద్వారా యజమానులకు 40 నుంచి 60 వేల రూపాయలు మిగులుతుందని చెబుతున్నారు.

ఒక్కో కంటైనర్‌కు అయితే సర్కారుకు 54 వేలు రాయల్టీ, జీఎస్టీకింద చె ల్లించాల్సి ఉంది. అసలు ఇవేమీ చెల్లించకుండానే ఎమ్మెల్యేలు, అధికారుల సాయంతో మైనింగ్ వ్యాపారాలు కోట్లకు పడగలెత్తుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

టీడీపీ, బీజేపీ, వైసీపీకి చెందిన నాయకులు ఈ వ్యాపారాల్లో ఉన్నందున, ఏ పార్టీ అధికారంలో ఉన్నా వీరి వ్యాపారాలు నిక్షేపంగా జరిగిపోతుంటాయి. వైసీపీ జమానాలో నాటి మంత్రి బాలినేని కనుసన్నలలోనే మైనింగ్ వ్యాపారం నడించింన్నది బహిరంగ రహస్యమే.

గత వైసీపీ పాలనలో లారీల్లో సరుకు రవాణా దందా విచిత్రంగా జరిగేది. వారికి వే బిల్లులు ఉన్నప్పటికీ, ఆ లారీలను ఆపి పక్కన ఉంచేవారు. బిల్లులు లేని వాటిని మాత్రం పంపించేసి, బిల్లులున్న వారిని రోజుల తరబడి చెక్‌పోస్టుల దగ్గరే వేచి ఉండేలా చూసేవారు. మైనింగ్‌శాఖతో రాళ్లు కొలిచేందుకు తనిఖీలు నిర్వహించేవారు. దీనితో లారీని బుక్ చేసిన వారికి, వెయిటింగ్ చార్జీల భారం పడేది.

ఫలితంగా విషయం అర్ధం చేసుకున్న’ వారు, బిల్లు చెల్లించాలన్న ఆలోచన విరమించుకుని తాము కూడా బిల్లులులేకుండానే.. వారికి ముడుపులు చెల్లించి, వ్యాపారం చేసుకోవడం ప్రారంభించారు. ఈ దందాకు మాచర్ల-పొందుగల సరిహద్దులోని చెక్‌పోస్టులే అడ్డా. అక్కడ లారీ దాటితే ఇక అది తెలంగాణలోకి ఎంటరయిపోతుందన్నమాట.

ముందు లారీ ప్రారంభమయ్యే పాయింట్ లోనే డ్రైవర్లకు ఒక చీటీ ఇస్తారు. ఒక రకంగా అదే వారి దందాకు లైసెన్స్ అన్నమాట. దాన్ని చూపిస్తేనే ఆ లారీ సరిహద్దు దాటేది. చేతిలో ఆ చీటీ ఉంటే దేవుడు కూడా వారిని ఆపలేరు. ఒకవేళ లారీని అధికారులు ఆపారంటే, ఆ డ్రైవర్ దగ్గర చీటీ లేనట్లు అర్ధమన్నమాట.

మామూళ్లు ముందుగా చెల్లించిన వారికే ఈ చీటీలు ఇచ్చి పంపిస్తుంటారు. దానికో మేనేజర్‌ను నియమిస్తారు. ఆయనే ఆ లారీలు వెళ్లే నియోజకవర్గాల ప్రజాప్రతినిధులకు, ఏ రోజు ముడుపులు ఆరోజు చెల్లిస్తుంటారు. ఈ దందాలో ఆ మేనేజర్ పాత్రనే కీలకం.

పరుచూరు, అద్దంకి, సంతనూతలపాడు, చిలకలూరిపేట, నర్సరావుపేట, గుర జాల, మాచర్ల నియోజకవర్గాల నుంచి ఈ మైనింగ్ రాళ్లు తెలంగాణ వెళ్లాల్సి ఉంటుంది. ఇవి ఆ నియోజకవర్గాలు దాటాలంటే, అక్కడి సామంతరాజులయిన ప్రజాప్రతినిధుల అనుమతి అవసరం. కప్పం కడితేనే ఆ లారీలు వారి నియోజకవర్గం దాటేది.

ఈ మొత్తం వ్యవహారంలో లారీలు ప్రారంభమయ్యే పరుచూరు- చివరి పాయింటయిన మాచర్ల నియోజకవర్గ టీడీపీ నేతలకు ఎక్కువ ముడుపులు చెల్లించాల్సి ఉంటుంది. పరుచూరులో అయితే ఓ కీలక నేత గత వైసీపీ సర్కారులో ఇచ్చిన ముడుపుల రేటును బాగా పెంచారన్న ప్రచారం జరుగుతోంది. సదరు ప్రజాప్రతినిధి విపక్షంలో ఉన్న ఐదేళ్లలో చేసిన ఖర్చును, చక్రవడ్డీతో రాబట్టుకునే పనిలో ఉన్నారని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి.

కాగా ప్రస్తుత మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు, కొన్ని దశాబ్దాల నుంచి మైనింగ్ వ్యాపారంలో ఉన్న విషయం తెలిసిందే. జగన్ జమానాలో గొట్టిపాటి మైనింగ్ వ్యాపారాలు నిలిపివేయడం ద్వారా, ఆయనను ఆర్ధికంగా దెబ్బతీశారు.

ఇక క్వారీల్లో రాయిని తవ్వితీసి, దానిని తరలించే వ్యాపారంలో వచ్చే ఆదాయం మరో కథ. క్వారీల్లో 10 మీటర్ల రాయి తవ్వి తీస్తే, అందులో 5 మీటర్లకే బిల్లు తీసుకుని బిల్లులు ఎగ వేసే దందా కూటమి సర్కారులోనూ స్వేచ్ఛగా జరుగుతుండటమే ఆశ్చర్యం. బల్లికురవ-గురిజేపల్లి ప్రాంతాల్లో క్వారీల నుంచి ప్రతినెల సుమారు 20 వేల మీటర్ల వరకూ రాయిని తవ్వితీస్తారని ఓ అంచనా.

వీటిలో 5 వేల మీటర్ల వరకే మైనింగ్ బిల్లు తీసుకుంటారు. అంటే ఒకటే బిల్లు మీద 3 నుంచి 5 లారీలు ఫ్యాక్టరీలకు ముడిరాయిని తరలిస్తుంటారు. చీమకుర్తిలో కూడా మరికొన్ని వేల మీటర్ల ముడిరాయి వెలికితీసి, ఇదేపద్ధతిలో తరలిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో సుమారు 80 క్వారీలుంటాయిని చెబుతున్నారు. ఈ రకంగా ప్రభుత్వ ఖజానాకు నెలకు 2 కోట్లు సున్నం పెడుతున్నారు.

మొత్తంగా ముడిసరుకు అక్రమ రవాణాతో ఏడాదికి 60 నుంచి 80 కోట్లు ఖజానాకు కన్నం పెడుతున్న పరిస్థితి. అటు పాలిష్‌పట్టిన గ్రానైట్ రాళ్లు.. ఇటు రాయిని వెలికితీసి తరలించే ప్రక్రియలో ప్రభుత్వానికి దాదాపు వెయ్యి కోట్ల నష్టం వస్తోందని స్పష్టమవుతోంది. ఇందులో సింహభాగం వాటా ప్రజాప్రతినిధులకు పోగా.. మిగిలినవి కమర్షియల్ టాక్స్, మైనింగ్ శాఖ, స్థానిక పోలీసు అధికారులకు మామూళ్ల రూపంలో వెళుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

LEAVE A RESPONSE