Suryaa.co.in

Andhra Pradesh Telangana

సీఎం రేవంత్‌రెడ్డికి టి.డి.జనార్ధన్‌ కృతజ్ఞతలు

– ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో 100 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహ ప్రతిష్టాపనకు స్థలం మంజూరు

విజయవాడ: హైదరాబాద్‌లో, ప్రత్యేకించి ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌములు నందమూరి తారక రామారావు 100 అడుగుల విగ్రహం ప్రతిష్టాపనకు మరియు ఎన్టీఆర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ ఏర్పాటు కోసం ప్రభుత్వపరంగా స్థలం కేటాయించడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంగీకరించడం ఎంతో సంతోషం.

ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ ఛైర్మన్‌, మాజీ ఎమ్మెల్సీ టి.డి.జనార్ధన్‌, ఎన్టీఆర్‌ కుమారుడు నందమూరి మోహనకృష్ణ, ఎన్టీఆర్‌ లిటరేచర్‌ సభ్యులు మధుసూదనరాజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ని కలవడం జరిగింది. ఈ సందర్భంగా గత ఏడాదిన్నరకాలంగా ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ చేపట్టిన కార్యక్రమాలను టి.డి. జనార్ధన్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వివరించారు.

హైదరాబాద్‌లో 100 అడుగుల ఎత్తుతో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని నెలకొల్పాలన్న తమ సంకల్పాన్ని వివరించి, దానితోపాటు ఎన్టీఆర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని, ఓ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనుకొంటున్నామని, ఇందుకు గాను తెలంగాణ ప్రభుత్వం తరపున స్థలాన్ని కేటాయించి సహకరించాలని టి.డి.జనార్ధన్‌, నందమూరి మోహనకృష్ణలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు.

ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ చేస్తున్న కార్యక్రమాలను తెలుసుకొని సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. ఎన్టీఆర్‌ తెలుగు ప్రజలందరికీ ఇష్టమైన నటుడు, నాయకుడని.. ఆయన 100 అడుగుల విగ్రహం హైదరాబాద్‌లో ప్రతిష్టించాలన్న ప్రతిపాదనకు తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సానుకూల స్పందనకు ఎన్టీఆర్‌ అభిమానులందరూ సంతోషిస్తారని పేర్కొంటూ ..ఆయనకి ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ తరపున తమ కృతజ్ఞతలను, ధన్యవాదాలను టి.డి. జనార్ధన్‌ తెలియజేశారు.

LEAVE A RESPONSE