Suryaa.co.in

Editorial

టీడీపీనా.. అయితే ఏంటిట?

  • తమ్ముళ్లను దెబ్బేస్తున్న ఎమ్మెల్యేలు

  • నిర్మొహమాటంగా తమ్బుళ్ల వద్దే వసూలు

  • ఎన్నికల్లో పార్టీ కోసం లక్షలు ఖర్చుపెట్టుకున్న తమ్ముళ్లు

  • జగన్ జమానాలో లెక్కలేనన్ని కేసులు

  • అభ్యర్ధులను కాకుండా పార్టీని చూసి గెలిపించిన పార్టీ అభిమానం

  • తీరా గెలిచాక సొంత పార్టీ నాయకులకే టెండర్లు పెడుతున్న
    ఎమ్మెల్యేలు

  • తమ్ఫుళ్ల వ్యాపారాలు మూసివేయించి బేరాలకు దిగుతున్న వైచిత్రి

  • విధిలేక ఎంతో కొంత చదివించుకుంటున్న తెలుగు తమ్లుళ్లు

  • అగ్రనేతలంతా బిజీనే.. ఎవరూ దొరకని దుస్థితి

  • ఎవరికి చెప్పాలో తెలియని అయోమయం

  • ‘నిఘా’ నిద్రపోతోందంటున్న టీడీపీ నేతలు

( మార్తి సుబ్రహ్మణ్యం)

అది రాష్ట్ర రాజధాని కొలువై ఉన్న జిల్లా. దాని ప్రధాన కేంద్రంలో రెండు నియోజకవర్గాలుంటాయి. రెండు నియోజకవర్గాల్లోనూ ఉన్నది టీడీపీ ఎమ్మెల్యేలే. పార్టీ అంటే చెవికోసుకుని, ప్రాణం పెట్టే కమ్మ వర్గమే అక్కడ అధికం. గత ఐదేళ్లలో పార్టీపై పిచ్చి అభిమానంతో తమ్ముళ్లు లక్షలు, కోట్లు ఖర్చు చేశారు. ఒక్కముక్కలో చెప్పాలంటే.. టీడీపీకి మహరాజపోషకులు వాళ్లే. కానీ ఎమ్మెల్యేలు మాత్రం కమ్మేతరులు. అదృష్టం కలసి వచ్చి, అనుకోకుండా ఎమ్మెల్యేలయిన వాళ్లే.

ఐదేళ్లలో జగనేయులు తమ్ముళ్ల వ్యాపారాలు దెబ్బతీశారు. బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. సరే ఇప్పుడు సదరు తమ్బుళ్లు మళ్లీ వ్యాపారాలు ప్రారంభించారు. కానీ విచిత్రంగా సొంత పార్టీ ఎమ్మెల్యేనే తమ్ముళ్లను పిలిచి ‘మీ మీద కంప్లెంట్లు వస్తున్నాయి. మా సంగతేంటి తమ్ముడూ’ అని బేరాలకు దిగుతున్నారు. ‘అదేంటి? మేము పుట్టు టీడీపీ వాళ్లం కదా’ అని తమ్భుళ్లు అమాయకంగా బదులిస్తే.. ‘టీడీపీ అయితే ఏంటిట’ అని సదరు ఎమ్మెల్యే, పేకాట పేకాటే తమ్ముడు తమ్ముడేనని నిర్మొహమాటంగా చెబుతుంటే తమ్బుళ్లు ఖంగుతింటున్నారు. ఇది ఒక రాజధాని జిల్లా కేంద్రంలోనే కాదు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే సీన్లు.

అయితే.. ఈ సమస్యలన్నీ కొత్తగా పార్టీ ఎమ్మెల్యేలయిన నియోజకవర్గాల్లోనే ఉన్నాయన్నది తమ్భుళ్ల వేదన. మరి ఈ విషయం ఎవరికి చెప్పాలి? పెద్దసార్లంతా బిజీ. ఎవరికీ టైమ్ ఇవ్వరు. ఇక మా గోడు వినేదెవరు? దీనికోసమేనా లక్షలు తగలేసుకుని, కేసులు పెట్టించుకుని పార్టీని గెలిపించుకుంది? రాష్ట్ర విభజన తర్వాత అధికారంలో వచ్చినప్పుడూ ఇంతే ఉంది. పాము తన గుడ్లను తానే తిన్నట్లు.. మా పార్టీ ఎమ్మెల్యేలే మా నుంచి వసూళ్లు చేస్తున్నారు. ఇవన్నీ ఎవరికి చెప్పాలి? ఎలా చెప్పాలి?.. ఇదీ తెలుగుతమ్ముళ్ల గోస.

అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు విపక్షాలకు చెందిన నేతలను బెదిరించడం చూస్తుంటాం. కానీ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలే సొంత పార్టీ నేతలను బెదిరించి వ్యాపారాల్లో వాటాలు అడుగుతున్న వైచిత్రి ఇది. గుంటూరు జిల్లా కేంద్రంలో కొత్తగా, ఎన్నికైన ఓ ఎమ్మెల్యే అల్లుడుగారి దెబ్బకు తమ్ముళ్లు హడలిపోతున్నారట.

సొంత పార్టీ నేతలకు చెందిన క్లబ్బు, బార్లు, రియల్ ఎస్టేట్, క్రషర్ వ్యాపారాలను మూయించి, మిగిలిన వారికి హెచ్చరిక సంకేతం ఇస్తున్నారట. చివరకు సెలూన్లపై జీవనం సాగించే వారు ఇల్లు కడుతున్నా విడిచి పెట్టడం లేదన్నది తమ్ముళ్ల ఫిర్యాదు. ‘మీ మీద చాలా ఫిర్యాదులొస్తున్నాయి. మరేంటి సంగతి’ అని బేరాలు మొదలుపెడుతున్నారట. చివరకు అంతకాదు. ఇంత తీసుకోండి అని గతిలేక డబ్బులు చదివించుకుంటున్నామని తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

‘ఐదేళ్లు పార్టీకి ఖర్చు పెట్టి, మళ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం లక్షలు ఖర్చుపెడితే మాకు ఇచ్చిన బహుమతి ఇదా’ అన్నది తమ్ముళ్ల ఆవేదన. మేం పార్టీ వాళ్లమే. మీ కోసం పనిచేశాం కదా అని గుర్తు చేస్తే, దేని దారి దానిదే అంటున్న వైచిత్రి. కొత్తగా ఎన్నికయిన ఎమ్మెల్యేలున్న దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి.

పార్టీ ఐదేళ్లు విపక్షంలో ఉన్న సమయంలో, అంతకుముందు పదవులు అనుభవించిన నేతలంతా.. జగన్ సర్కారు పెట్టే కేసులకు తాళలేక హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు చెక్కేసి, అప్పుడప్పుడు నియోజకర్గాల్లో కనిపించేవారు. పార్టీ ఆఫీసుపై దాడి జరగకముందు వరకూ, వారెవరూ భూతద్దం పెట్టి వెతికినా కనిపించలేదు. ఆ క్లిష్ట సమయంలో పార్టీని మోసింది ద్వితీయ స్థాయి నేతలే. కేసులు, వేధింపులకు గురయి, వ్యాపారాలు కూడా వదలుకున్నది కూడా వారే. ఇటీవలి ఎన్నికల్లో స్థానికంగా చందాలు వేసుకుని మరీ పనిచేసింది కూడా వారే.

అలాంటి తమ్ముళ్ల త్యాగాలకు, అధికారం వచ్చిన తర్వాత కూడా విలువలేకపోవడం వారిని అసంతృప్తికి గురిచేస్తోంది. పార్టీలో కొత్తగా ఎమ్మెల్యేలయిన వారే తమను వేధించడం, తమ వ్యాపారాలకు అడ్డంకులు కల్పించడాన్ని తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా, దాదాపు ఇదే పరిస్థితి ఉండేదని గుర్తుచేస్తున్నారు.

అప్పుడు సీనియర్ ఎమ్మెల్యేలు తమను వేధిస్తే, ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు వేధిస్తున్నారని తమ్ముళ్లు వాపోతున్నారు. ఎన్నికల్లో చేసిన ఖర్చు రాబట్టుకోవాలన్న తొందరలో, చివరకు సొంత పార్టీ వారిని కూడా విడిచిపెట్టకపోవడమే వారిని వేదనకు గురిచేస్తోంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచో వచ్చినా గెలిపించినా, వారికి ఆ విశ్వాసం లేకుండా తమ వ్యాపారాల్లోనే వాటాలు అడుగుతున్నారని, ఇది తాము ఊహించని పరిణామమంటున్నారు.

‘అప్పుడు విభజనకు ముందు పదేళ్లు, ఇప్పుడు ఐదేళ్లు విపక్షంలో ఉండి ఆకలితో ఉన్న ఎమ్మెల్యేలు నష్టపోయిన సంపాదనను ఒకేసారి త్వరగా సాంపాదించుకోవాలన్న ఆత్రుతతో, చివరకు సొంత పార్టీ నేతలనూ విడిచిపెట్టడం లేదు. ఇది పార్టీ భవిష్యత్తుకే నష్టం. అయినా ఇవన్నీ సేకరించి, సమాచారం ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ఇంటలిజన్స్ ఏం చేస్తుందో అర్ధం కావడం లేద’ని తమ్ముళ్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సొంత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, గతంలో వైసీపీ నేతల
బెదిరింపులతో ఆపేసిన పాత వ్యాపారాలను, టీడీపీ నేతలు గ్రూపుగా ఏర్పడి మళ్లీ ప్రారంభించారు. అయితే అందులో కొత్త ఎమ్మెల్యేలు-వారి బంధువులు వచ్చి తమను వాటాలు అడుగుతున్నారని, మీపై ఫిర్యాదులొస్తున్నాయని బెదిరిస్తుంటే ఏం చేయాలో.. ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి ఉందంటున్నారు. గ్రామ స్థాయిలో చేసుకునే వ్యాపారాల్లో కూడా, ఎమ్మెల్యేలు వాటాలు అడగటం దారుణమంటున్నారు.

ఇదిలాఉండగా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు రాష్ట్ర స్థాయి కూటమి ప్రముఖులు.. జిల్లా నేతల వ్యాపారాల్లో వాటాలు అడుగుతున్నారన్న చర్చ కూటమిలో బహిరంగంగానే జరుగుతోంది. పేకాట క్లబ్బుల్లో తనకూ  వాటాకావాలని తాజాగా రాజానగరం ప్రముఖుడు కూడా డిమాండ్ చేస్తున్నారని పార్టీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. పేకాట క్లబ్బులకు వచ్చే జూదరులంతా తమ నియోజకవర్గం నుంచి వస్తున్న వారే కాబట్టి, తనకూ వాటా కావాలన్నది రాజానగరం ప్రముఖుడి వాదనట. ఈ ఇద్దరు ప్రముఖులకు కొత్తగా టికెట్లు వచ్చి గెలిచిన నేపథ్యంలో, టీడీపీ నేతల వ్యాపారాల్లో వాటాలకు ఒత్తిడి చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక విశాఖ జిల్లాలో సెజ్ పరిథి ఉన్న రెండు నియోజకవర్గ జనసేన ప్రముఖులు.. గత ఎన్నికల్లో టీడీపీకి ఆర్ధికంగా దన్నుగా నిలిచిన పారిశ్రామికవేత్తలను వేధిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. సెజ్ నుంచి బయటకు వచ్చే ప్రతి లారీ నుంచి, వారు వెయ్యి రూపాయలు వసూలుచేస్తున్నారన్న ఆరోపణలు టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో సెజ్లోని పారిశ్రామికవేత్తల నుంచి, పార్టీకి అన్ని రకాల మద్దతు కూటగట్టేందుకు టీడీపీ నేతలు చాలా కష్టపడ్డారట. అయితే తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత, వారి వ్యాపారాలకే జనసేన ప్రముఖులు అడ్డంకులు సృష్టించడంతో.. వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక తమ్ముళ్లు తలపట్టుకుంటున్నారట.

ఇక కొత్తగా పార్టీలోకొచ్చి ఎమ్మెల్యేలయిన వారు.. గతంలో తాము వచ్చిన పార్టీ నేతలకే ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఫిర్యాదులు లేకపోలేదు. వారి ముందు తాము శీలపరీక్ష నిరూపించుకోవలసి వస్తోందని వాపోతున్నారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో అయితే, తాము వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితి ఉందంటున్నారు.

ఈ పరిస్థితులను నాయకత్వం దృష్టికి తీసుకువెళదామంటే, ఎవరూ అపాయింట్మెంట్లు ఇవ్వడం లేదని తమ్ముళ్లు వాపోతున్నారు. అధినేత  చంద్రబాబునాయుడు-యువనేత లోకేష్ ఇద్దరూ బిజీ అయిపోయినందున, వారిని కలవడం కష్టమవుతోందంటున్నారు. ఇక పార్టీ ఆఫీసులో ఎవరిని కలిసి చెప్పాలో, వారితో తమ ఎమ్మెల్యేలకు ఎలాంటి సంబంధాలున్నాయో అర్ధం కావడం లేదంటున్నారు.

గతంలో చంద్రబాబునాయడు దృష్టికి ఇలాంటి అంశాలు తీసుకువెళ్లే అవకాశం ఉండేదని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం మారిన అపాయింట్మెంట్ వ్యవస్థ గందరగోళంగా ఉందంటున్నారు. సొంత పార్టీ నేతలనే వేధిస్తున్న ఎమ్మెల్యేలను నియంత్రించకపోతే, అది భవిష్యత్తులో వేరే పరిణామాలకు దారితీసే ప్రమాదం లేకపోలేదంటున్నారు.

LEAVE A RESPONSE