– రోజురోజుకీ పతనమవుతున్న చంద్రబాబు గ్రాఫ్..
– అందుకే పులివెందులలో ఖాకీ యూనిఫాం సాయంతో అరాచకం..
– చంద్రబాబు డైరెక్షన్ లో వైయస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు..
– గీత దాటిన అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు..
– మాజీ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరిక
తాడేపల్లి: వైయస్ఆర్ కడప జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ అరాచకానికి పాల్పడుతోందని మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ 14 నెలల పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు పతనం కనిపిస్తోందని అన్నారు. ప్రజల విశ్వాసానికి దూరం అవ్వడం వల్లే పోలీసుల సాయంతో ఉప ఎన్నికల్లో గెలిచి పరువు కాపాడుకునేందుకు చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గూండాలను ఉసిగొల్పడం, పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించి వైయస్ఆర్సీపీని నిలువరించాలని కలలు కంటున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతూ లోకేష్ చెప్పినట్లు చేస్తూ వైయస్సార్సీపీ నేతలపై కేసులు బనాయిస్తున్న ఐపీఎస్ అధికారులతో సహా ఎవరూ చట్టానికి అతీతులు కారన్న విషయం మర్చిపోవద్దని హెచ్చరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
విశాఖపట్నం గ్రేటర్ మున్సిపాల్టీ స్టాంటింగ్ కమిటీ ఎన్నికల్లో గరిష్ఠంగా 50 ఓట్లతో వైయస్సార్సీపీ ఒక స్థానాన్ని గెల్చుకుంది. గతంలో వైయస్సార్సీపీకి వైజాగ్ కార్పొరేషన్ లో 59 మంది సభ్యులుంటే కూటమి ప్రభుత్వం వారిలో 27 మందిని కొనుగోలు చేయగా.. వైయస్సార్సీపీ బలం 32 కు చేరింది. అయినా కూడా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మా అభ్యర్ధి గెలిచారు. చంద్రబాబును నమ్మి వెళితే ఆయన దగ్గర ఏం లేదని తెలుసుకుని తిరిగి వైయస్సార్సీపీని గెలిపించాలన్న ఉద్దేశ్యంతో ప్రజలు ఉన్నారని చెప్పడానికి ఈ గెలుపు ఓ సంకేతం. పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక జరుగుతుంది. ఏ ఎన్నిక జరిగినా ఏదో ఒక అక్రమాలు చేసి… ఎలాగైనా గెలచి తన గ్రాఫ్ పడిపోవడం లేదు, తన పతనం ప్రారంభమవ్వలేదు అని నిరూపించుకోవాలన్న తాపత్రయంలో చంద్రబాబు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.