-
మంత్రి నారాయణ తీరుపై తమ్ముళ్ల నారాజ్
-
మంత్రుల శాఖలను డిప్యూటీ సీఎం కామెంట్ చేయవచ్చన్న నారాయణ
-
మరి గతంలో కెఇ, చినరాజప్ప ఉన్నప్పుడు ఇదే మాట ఎందుకు చెప్పలేదంటున్న తమ్ముళ్లు
-
డిప్యూటీ సీఎం ఇతర శాఖలపై ఎలా కామెంట్ చేస్తారన్న ప్రశ్నలు
-
మున్సిపల్ శాఖను సమీక్షిస్తే నారాయణ సహిస్తారా?
-
కులాభిమానం కుదరదంటున్న టీడీపీ సీనియర్లు
-
అంత కులాభిమానం ఉంటే తన శాఖను రివ్యూ చేయించుకోవాలని తమ్ముళ్ల సలహా
-
ఆర్ధిక శాఖ సత్యనారాయణ ఇన్నాళ్లు కొనసాగడానికి కారణమెవరన్న చర్చ
-
ఆయనపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఫిర్యాదు
-
సత్యనారాయణ సోదరుడిని కదిలించలేది ‘మంచి ప్రభుత్వం’
-
కులాభిమానంతోనే సత్యనారాయణకు కొందరి మద్దతంటూ సీనియర్ల అసంతృప్తి
( మార్తి సుబ్రహ్మణ్యం)
మంత్రుల శాఖలను సీఎం, డిప్యూటీ సీఎం సమీక్షించవచ్చంటూ మున్సిపల్ శాఖమంత్రి పి.నారాయణ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘సీఎం, డిప్యూటీ సీఎంకు ఏ శాఖ సరిగా పనిచేయకపోయినా కామెంట్ చేసే అధికారం ఉంటుంది. పవన్ వ్యాఖ్యలు అలర్ట్ కావడానికే కానీ వివాదం కోసం కాద’’ంటూ మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలు, పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది.
ప్రధానంగా సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల స్థాయి నేతలు నారాయణ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పవన్ వ్యాఖ్యలు ప్రమాదంలో పడి.. అది కూటమిలో రగడ కాకుండా ఉండేందుకు, నారాయణ చేసిన దిద్దుబాటు ప్రయత్నమైనప్పటికీ, ఆయన ఆరకంగా సీఎం-డిప్యూటీ సీఎంలను ఒకేస్థాయి, ఒకే హోదా ఉన్న వ్యక్తులుగా చెప్పడమే సరైంది కాదంటున్నారు.
ఇక పార్టీ సీనియర్లు మాత్రం నారాయణకు స్వతహాగా కులాభిమానం ఎక్కువ కాబట్టి, ఆ ప్రేమతోనే పవన్‌ను సమర్ధిస్తున్నట్లుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల ముందు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన ఒక టీవీని స్వయంగా పార్టీ నిషేధిస్తే, ఆ చానెల్ ప్రతినిధిని.. అదే కులాభిమానంతో తన శాఖలో నియమించుకున్న విషయాన్ని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.
పార్టీలో ఉన్న చాలామందితో పోలిస్తే, నారాయణకు పార్టీపై కమిట్‌మెంట్-చంద్రబాబుపై విశ్వాసం-అభిమానం చాలా ఎక్కువే అయినప్పటికీ.. కులాభిమానం కూడా అంతకుమించి ఉంటుందంటున్నారు.
సీఎం-డిప్యూటీ సీఎం స్థాయి-హోదా ఒకటే ఎలా అవుతాయని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. పవన్ వివాదం మరింత అగ్గిరాజేయకు ండా ఉండేందుకు, నష్టనివారణ కోసం నారాయణ మాట్లాడటం మంచి పనే అయినప్పటికీ.. సీఎం-డిప్యూటీ సీఎంలను ఒకేస్థాయి అంటూ మాట్లాడటం సరైంది కాదని స్పష్టం చేస్తున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత కాపు నేత నిమ్మకాయల చినరాజప్ప, బీసీ నేత కెఇ కృష్ణమూర్తికి డిప్యూటీ సీఎంలు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. వారిద్దరూ ఏ శాఖలోనూ జోక్యం చేసుకోవటం గానీ, ఇతర శాఖల మంత్రులు సరిగ్గా పనిచేయడం లేదని చెప్పిన దాఖలాలు లేవని గుర్తు చేస్తున్నారు.
పైగా అసలు వారిద్దరి ఫొటోలు.. ఏ ప్రభుత్వ శాఖ కార్యాలయాల్లోనూ సీఎంతో సమానంగా పెట్టలేదని గుర్తు చేస్తున్నారు. అంత అదృష్టం-అవకాశం ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే దక్కిందని.. ఆ గౌరవం కాపాడుకోవలసిన బాధ్యత పవన్‌పైనే ఉందని సీనియర్లు విశ్లేషిస్తున్నారు. మరి ఆనాడు మంత్రిగా పనిచే సిన నారాయణ.. కెఇ,రాజప్పకు సైతం సీఎంతో సమానంగా ఇతర శాఖలను సమీక్షించే అధికారం, కామెంట్లు చేసే అవకాశం ఉందని ఇప్పటిమాదిరగానే ఎందుకు చెప్పలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఎవరూ బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని, ఏమైనా ఉంటే క్యాబినెట్‌లో అంతర్గతంగా చర్చించుకోవాలని, ఎవరైనా కూటమి కార్యకర్తల మనోభావాల ప్రకారం నడుచుకోవాలని చెప్పి ఉంటే, నారాయణకు హుందాతనంగా ఉండేదంటున్నారు. ఆవిధంగా హితవు పలికిఉంటే, ఆయనను పార్టీ వర్గాలు అభినందించి ఉండేవని వ్యాఖ్యానిస్తున్నారు. అందుకు భిన్నంగా సీఎం చంద్రబాబునాయుడు స్థాయితో పవన్‌ను పోల్చడంతోపాటు, మిగిలిన మంత్రుల స్థాయి తగ్గించడం వల్ల నారాయణ లేనిపోని తలనొప్పి తెచ్చుకున్నారని, మరికొందరు సీనియర్ ఎమ్మెల్యేలు విశ్లేషిస్తున్నారు.
‘అనిత అంటే కొత్తగా వచ్చిన మంత్రి కాబట్టి సర్దుకుపోవచ్చు. కానీ ఫరూఖ్, అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణరెడ్డి, కొల్లు రవీంద్ర, పార్ధసారథి, సీనియర్ మంత్రులు. పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, నిమ్మలరామానాయుడు, బాలవీరాంజనేయస్వామి, బీసీ జనార్దన్‌రెడ్డి పార్టీలో సీనియర్లు. మరి నారాయణ లెక్క ప్రకారం వారి శాఖల గురించి కూడా పవన్ ప్రశ్నించవచ్చా’’ అని ఓ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.
సత్యనారాయణకు సహకరిస్తుందెవరు?
ఇదిలాఉండగా.. పులివెందులలో వైసీపీ కాంట్రాక్టర్లకు పూర్తిస్థాయిలో బిల్లులు ఇచ్చిన నాటి ఆర్ధికశాఖ కార్యదర్శి, ఇప్పటి ఆ శాఖ ముఖ్యకారదర్శి ఓఎస్డీ సత్యనారాయణ ఇంకా అక్కడే కొనసాగేందుకు, పార్టీ-ప్రభుత్వంలో ఎవరు సహకరిస్తున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.
అసలు కులాభిమానంతో ఆయనను రైల్వే నుంచి తీసుకువచ్చింది ఎవరు? ఆయన తాను తన శాఖకు వెళ్లిపోతానన్నా ఇక్కడే ఉండనిస్తున్న మంత్రి ఎవరు? ఆయనపై అంత ప్రత్యేకాభిమానం ఎందుకు? పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే సత్యనారాయణపై అన్నేసి ఆరోపణలు చేసి, ఇప్పుడు కూడా ఆయననే కొనసాగిస్తున్నారంటే ఏం సంకేతాలు ఇస్తున్నారంటూ, పార్టీ సీనియర్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఒకవైపు అదే సత్యనారాయణ తీరుపై బీజేపీ ఎంపి సీఎం రమేష్ డిఓపీటీకి ఫిర్యాదు చేస్తే.. అదే కూటమిలోని ఓ మంత్రి ఆయనను కాపాడటం ఏమిటన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆయన అక్రమాలపై జీఏడీ ఇప్పటిదాకా నివేదిక ఇవ్వకపోవడం వెనుక మంత్రివర్గంలో ఎవరి ప్రమేయం ఉందన్న దానిపై పార్టీ-ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సత్యనారాయణ వైసీపీ కార్యకర్తలా పనిచేసి, వారికి మాత్రమే బిల్లులు చెల్లించారని, కోర్టు ఆదేశించిన వారికి బిల్లులు చెల్లించకుండా, గత ప్రభుత్వం మేలు కోరే స్కీములకు మళ్లించిన ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ ఎంపీ, రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ కొద్దిరోజుల క్రితమే డీఓపీటీకి ఫిర్యాదు చేశారు.
దానికి స్పందించిన డిఓపిటీ.. రమేష్ ఫిర్యాదుకు సంబంధించి నివేదిక ఇవ్వాలని జీఏడీని ఆదేశించింది. దానితో కదిలిన జీఏడీ, వెంటనే నివేదిక సమర్పించాలని ఆర్ధిక శాఖను ఆదేశించింది. నిజానికి కూటమి సైతం అప్పటి ఆర్ధి శాఖ కార్యదర్శి సత్యనారాయణ అవినీతిపై విమర్శలు చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటుందని భావించగా.. విచిత్రంగా ఆయనను ముఖ్య కార్యదర్శికి ఓఎస్డీగా తీసుకుని, మళ్లీ ఆయననే అప్పుల కోసం ముంబయికి పంపించటంపై విస్మయం వ్యక్తమవుతోంది.
కాగా సత్యనారయణ సోదరుడు కీలకమైన సీఎఫ్‌ఎంఎస్‌లో పనిచేస్తున్న నేపథ్యంలో, ఆయనను అక్కడి నుంచి తొలగించాలని చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికీ ఫలించకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. గత ఐదేళ్ల జగన్ జమానా అవకతవకలకు సాక్షి అయిన సత్యనారాయణ సోదరుడి పట్ల, ఉదారంగా వ్యవహరిస్తున్న ‘మంచి ప్రభుత్వం’పై తమ్ముళ్లలో సందేహం వ్యక్తమవుతోంది. కేవలం కులం కారణంగానే సత్యనారాయణ సోదరులు స్వేచ్ఛగా ఉన్నారని, దీన్నిబట్టి ఆర్ధికమంత్రి కేశవ్‌కు తన శాఖపై పెద్దగా పట్టులేదన్న వ్యాఖ్యలు వ్యక్తమవుతున్నాయి.