Suryaa.co.in

Andhra Pradesh

ఏపీ ప్రజల సేవ కోసమే ప్రధాని పదవిని ఎప్పుడో బాబు వదులుకున్నాడంటున్న టీడీపీ

– అమరావతి ఊబిలో కూరుకుపోయిన టీడీపీ అగ్రనేత ‘గ్రాఫ్‌’ను అబద్ధాలతో లేపలేరు!
– ఎంపీ విజయసాయి రెడ్డి

మళ్లీ అధికారం కోసం అర్రులు చాస్తున్న తెలుగుదేశం– సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారం ప్రజలను మభ్యపెట్టలేకపోతోంది. అక్షరాల రూపంలో ఈ పార్టీ వదులుతున్న అబద్ధాలకు అంతులేకుండాపోతోంది. ‘ప్రధాని అయ్యే అవకాశాలు వచ్చినా ఎన్‌.టి.రామారావు, నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కోసం ఢిల్లీ పోకుండా ముఖ్యమంత్రులుగానే కొనసాగారు,’ అని ఇటీవల టీడీపీ ప్రకటించింది. వాస్తవానికి 1989లో డిసెంబర్‌ ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం ఓడిపోయినప్పుడు ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫ్రంట్‌ అధ్యక్షుడు.

అప్పుడు జనతాదళ్‌ నేత వీపీ సింగ్‌ ను ప్రధాని పదవికి ఎంపిక చేశారు. ఏ దశలోనూ రామారావు గారి పేరు ఈ పదవికి పరిశీలించలేదు. అదీగాక, సీఎం పదవి కోల్పోయిన ఎన్టీఆర్‌ పరాజయ భారంతో ఉన్నారేగాని ప్రధాని పదవి కోసం ప్రయత్నించనే లేదు. అయితే, చంద్రబాబుకు అవకాశమొచ్చినాగాని– సీఎం పదవి కోసం (అది కూడా ఏపీ ప్రజలకు సేవ చేయడానికట) ప్రధాని పదవినే వద్దునుకున్నారనే రెండో అబద్ధానికి బలం జోడించడానికి దివంగత నేత రామారావు గారి పేరును టీడీపీ తెరమీదకు తీసుకొచ్చింది.

1996 లోక్‌సభ ఎన్నికల్లో పీపీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్‌ కేంద్రంలో అధికారం కోల్పోయింది. అప్పుడు జనతాదళ్‌ నాయకత్వంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ సర్కారుకు ప్రధానిగా అసలు చంద్రబాబు పేరును ఎవరూ ప్రతిపాదించలేదు. ప్రధాని పదవికి నాయకుడి వెతుకులాటలో మాత్రం అప్పటి ఏపీ సీఎం ‘సేవలు’ వాడుకున్నారు. ఇప్పటికి పాతికేళ్లు దాటాయి కదా అని చరిత్రను తెలుగుదేశం ఇంత దర్జాగా వక్రీకరిస్తోంది. అప్పట్లో కర్ణాటక సీఎంగా ఉన్న జనతాదళ్‌ నేత హెచ్‌ డీ దేవెగౌడ ప్రధాని అయ్యారు.

అంటే, ఆయనకు కన్నడిగులకు సేవచేయాలనే అంకితభావం లేక హస్తినకు పోయారని టీడీపీ వాదన ప్రకారం అనుకోవాల్సి ఉంటుంది. రాజకీయ గందరగోళంలో పడిన చంద్రబాబు తాను సృష్టించుకున్న అమరావతి అనే ఊబిలో చిక్కుకుని మొదట సీఎం పదవిని, తర్వాత పరువును పోగొట్టుకున్నారు. తన కలల రాజధాని భూముల బురదలో రోజురోజుకూ దిగబడిపోతున్న చంద్రబాబును పైకి లేపడానికి పైన చెప్పిన కట్టుకథలను క్రేన్లు, జేసీబీలుగా వాడుతున్నారు టీడీపీ నేతలు. గొప్ప చారిత్రక దృక్పథం ఉన్న తెలుగువారిని అబద్ధాలతో మభ్యపెట్టి బాబు గారి ‘గ్రాఫ్‌’ పెంచే ప్రయత్నాలు ఫలించవు.

LEAVE A RESPONSE