Suryaa.co.in

Andhra Pradesh

ఓటీఎస్ గూర్చి మాట్లాడే అర్హత తెలుగుదేశానికి లేదు

-పేదలకు లబ్ధి కలగకుండా అడ్డుకోవాలన్నదే చంద్రబాబు కుట్ర
-సెంట్రల్ లో రూ. 1.83 కోట్ల విలువైన రోడ్ల నిర్మాణ పనులకు భూమిపూజ
-ప్రగతి పథంలో దూసుకెళుతోన్న విజయవాడ నగరం: మేయర్ రాయన భాగ్యలక్ష్మి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా 60, 61, 64 డివిజన్లలో రూ. 1.83 కోట్ల విలువైన రహదారుల నిర్మాణ పనులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజారెడ్డిలతో కలిసి గౌరవ శాసనసభ్యులు శంకుస్థాపన చేశారు. కండ్రిక జంక్షన్
1నుండి 1వ ఫ్లై ఓవర్ మధ్య ఇన్నర్ రింగ్ రోడ్డుకు రూ. 19.77 లక్షలతో BT ప్యాచ్ పనులు., APCRDA బ్రిడ్జి నుండి రామవరప్పాడు రింగ్ రోడ్డు జంక్షన్ వరకు రూ. 28.77 లక్షలతో BT రోడ్డు ప్యాచ్‌ పనులు., వాంబే కాలనీ H బ్లాక్ వద్ద రూ. 69 లక్షలతో నూతన రోడ్ల పనులు., రూ. 18 లక్షలతో G బ్లాక్‌ కల్యాణ మండపం రోడ్డు పునరుద్ధరణ పనులతో పాటు రూ. 47.42 లక్షలతో వాంబే కాలనీ స్కూల్ సెంటర్ వద్ద BT రోడ్డు మరమ్మతులు మరియు పునరుద్ధరణ పనులకు భూమిపూజ నిర్వహించారు. రాష్ట్రంలో రహదారులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు.

ప్రయాణికులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇటీవలే రహదారుల పునర్‌నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకుందని తెలిపారు. ముఖ్యమంత్రి దిశానిర్దేశంతో నియోజకవర్గంలో రహదారుల నిర్మాణాలు, మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయనడానికి రూ. 2.5 కోట్ల నిధులతో పనులు పూర్తై అందుబాటులోకి వచ్చిన విజయవాడ-నూజివీడు ప్రధాన రహదారే చక్కని ఉదాహరణ అని ఈ సందర్భంగా వెల్లడించారు.

గత తెలుగుదేశం ప్రభుత్వం రోడ్ల నిర్వహణను కనీసం పట్టించుకోలేదని మల్లాది విష్ణు విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రోడ్ల నిర్మాణానికి తీసుకొచ్చిన రూ.3 వేల కోట్లను ఇతర అవసరాలకు మళ్లించారన్నారు. రూ. 450 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లిందని ఆరోపించారు. దాంతో రోడ్ల నిర్వహణ అధ్వానంగా తయారైందన్నారు. కానీ ఈ ప్రభుత్వంలో రోడ్ల పునరుద్ధరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఒకసారి నిర్మించిన రహదారులు కనీసం ఐదు నుంచి ఏడేళ్ల వరకు ఉండేలా నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నట్లు తెలిపారు. నాడు-నేడు తరహాలో రోడ్లు మరమ్మతులు చేసిన తర్వాత ఆ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. రాత్రివేళల్లో ప్రమాదాలను నివారించేందుకు ప్రధాన రహదారులు, జంక్షన్ల వద్ద 5 హైమాస్ట్ లైట్ల ఏర్పాటుకు కూడా ఇటీవల శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు.

లక్షలాది మంది పేదలకు లబ్ధి చేకూర్చే ఓటీఎస్ పథకంపై టీడీపీ నేతలు విషప్రచారం చేయడం సరికాదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు హయాంలో వాంబే కాలనీకి సంబంధించి 105 మంది లబ్ధిదారులు అసలు వడ్డీ కలిపి రూ. 60 వేల వరకు చెల్లించినప్పటికీ పూర్తి హక్కులు కల్పించలేకపోయారన్నారు. కానీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలం రూ. 20 వేలకే క్రయవిక్రయాలతో కూడిన సంపూర్ణ హక్కులు పొందగలుగుతున్నారన్నారు. వీరందరికీ రుణాలను మాఫీ
6 చేయడంతో పాటు క్లియర్‌ టైటిల్‌తో ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఒక్క వాంబే కాలనీలోనే 450 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుందని వెల్లడించారు. ఇటువంటి ఆలోచన ఎందుకు చేయాలేకపోయారనే దానిపై చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలని మల్లాది విష్ణు అన్నారు. పైగా ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పేరుతో ఒక్కొక్కరి వద్ద రూ. 60 వేలు ఎందుకు కట్టించుకున్నానే దానిపై ముందుగా తెలుగుదేశం నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వీరందరికీ న్యాయం జరిగేలా చూస్తామని మల్లాది విష్ణు తెలిపారు. వారం రోజుల్లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామాత్యుల చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.

నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. సెంట్రల్ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలియజేశారు. నియోజకవర్గంలో ఇటీవల ప్రారంభించుకున్న రహదారులు, కమ్యూనిటీ హాల్స్, పార్కులే ఇందుకు నిదర్శనమన్నారు. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలన్నీ.. గడిచిన రెండున్నరేళ్లగా ప్రగతి పథంలో పయనిస్తున్నాయన్నారు.

డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా మాట్లాడుతూ.. ప్రజావసరాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వాటి పరిష్కార దిశగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. జగనన్న పాలనలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలంతా గమనించాలని కోరారు. డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడుతూ.. గత చంద్రబాబు ఐదేళ్ల పాలనలో నియోజకవర్గంలో ఏ ఒక్క ప్రాంతం కూడా అభివృద్ధికి నోచుకోలేదన్నారు. తెలుగుదేశం పాలనంతా శిలాఫలకాలతోనే సరిపోయిందన్నారు. కానీ ఈ ప్రభుత్వంలో శంకుస్థాపనలు చేసిన కొద్ది రోజుల్లో ప్రారంభోత్సవాలు కూడా చేసి చూపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు యరగొర్ల తిరుపతమ్మ శ్రీరాములు, ఉమ్మడి రమాదేవి వెంకట్రావు, అలంపూర్ విజయలక్ష్మి, జానారెడ్డి, నాయకులు బెవర నారాయణ, అలంపూర్ విజయ్, మోదుగుల గణేష్, జిల్లేల శివ, ఇస్మాయిల్, బత్తుల దుర్గారావు, సుభాని, నాగరాజు, వియ్యపు మురళి, ఇంజనీరింగ్ ఈఈ శ్రీనివాస్, డీఈ గురునాథం, వీఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A RESPONSE