Suryaa.co.in

Andhra Pradesh

రంగాని చంపిన వారే ఆయన వర్థంతులు జరపడం శోచనీయం

– రంగాను భౌతికంగా లేకుండా చేసింది టీడీపీనే
– చంద్రబాబు వెన్నుపోటు రాజకీయంలో భాగమే రంగా హత్య కూడా..
– రంగా హంతకులు వెలగపూడి, దేవినేని ఏ పార్టీలో ఉన్నారు..?
– రంగా పేరును అడ్డుపెట్టుకుని గుడివాడలో టీడీపీ ఘర్షణలు సృష్టిస్తోంది
– మాజీమంత్రి , గుడివాడ ఎమ్మెల్యే, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని)

టీడీపీ రాజకీయశక్తులు రంగాను పొట్టనపెట్టుకున్నాయి..
రాజకీయ నేతలకు, ప్రజలకు సేవ చేయాలనుకునే వారికి ఆదర్శనీయులైన ప్రజా నాయకుడు వంగావీటి మోహనరంగా. ఆయన చనిపోయి 34 సంవత్సరాలు పూర్తయినా.. ప్రజల గుండెల్లో చెరగని స్థానం ఏర్పరచుకున్న వ్యక్తి. నేను ఎమ్మెల్యేగా వచ్చినప్పట్నుంచి క్రమం తప్పకుండా 18 ఏళ్లుగా ఆయన జయంతి, వర్ధంతి సభలను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున జరుపుకుంటూ.. ప్రజా ఉద్యమ నాయకుడిగా ఆయన చేసిన సేవల్ని స్మరించుకుంటున్నాం. ఈ సందర్భంగా రంగా గురించి మాట్లాడుకోవాలనుకుంటే.. ఆయనను టీడీపీకి చెందిన కొన్ని కుట్రపూరిత రాజకీయశక్తులు పొట్టనబెట్టుకున్నాయి. ఆయన్ను హత్య చేసిన కిరాతక వ్యక్తులు, కిరాతక పార్టీలు ఈరోజు ఎంత అథమస్థాయిలో ఉన్నాయో అందరూ చూస్తున్నారు.

వంగవీటి రంగా చేసిన తప్పేంటి..? ఆయన అప్పటి తెలుగు దేశం ప్రభుత్వాన్ని విభేదించి ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అహరహం ఉద్యమించేందుకు, ఒక వ్యక్తి శక్తిగా మారి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మరువలేని వ్యక్తిగా.. ప్రజల ఆదరణతో ఎదిగారు. అప్పట్లో రంగాకు లభిస్తున్న ఆదరణను చూసి కన్నుకుట్టి, ఓర్వలేని గుణంతో ఆయన్ను అడుగడుగునా ఇబ్బందులు పెడితే.. రాజకీయంగా పాతాళానికి తొక్కేయాలని చూస్తే ‘నాకు ఈ ప్రభుత్వంలో రక్షణ లేదు. నన్ను అడుగు కూడా కదలనీయకుండా కట్టడి చేస్తున్నారు. నన్ను నిర్బంధించి చంపాలని చూస్తున్నారు. నా ప్రాణానికి ముప్పు ఉంది..’ అని ఆరోజు వంగవీటి మోహన్‌రంగా నిరసన దీక్షలో కూర్చొని బహిరంగంగా చెబితే.. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అతి కిరాతకంగా ఆయన్ను చంపించింది. ఆయనను భౌతికంగా మనందరి మధ్య లేకుండా చేసినప్పటికీ, 34 ఏళ్లుగా ఆయన్ను ప్రజల గుండెల్లో నుంచి దూరం చేయలేకపోయారు. రంగాని చంపిన వ్యక్తులే ఈరోజు ఆయన వర్ధంతులు జరుపుతూ.. రాజకీయాలకు వారి పేరును వాడుకుంటూ ఆయన బూట్లు నాకుతున్నారు. శత్రువులు సైతం అనివార్యంగా వంగవీటిని తలచుకుంటున్నారంటే.. ఆయన ప్రజల కోసం చేసిన సేవా కార్యక్రమాలు, శ్రమను రాజకీయనాయకులందరూ ఆదర్శంగా తీసుకోవాలి.

చంద్రబాబు వెన్నుపోటు రాజకీయంలో భాగమే రంగా హత్య కూడా
చంద్రబాబు వెన్నుపోటు రాజకీయంతో మానసికంగా వేధింపులకు గురై.. అధికారం కోల్పోయిన పరిస్థితిలో ఎన్టీరామారావు కూడా మరణించడం మనందరం చూశాం. అలాగే అశేష జనాదరణతో బలమైన శక్తిగా ఎదుగుతున్న వంగవీటి మోహనరంగాను ముమ్మాటికీ చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హత్య చేసింది. అందుకే, రంగా హత్యను కూడా చంద్రబాబు వెన్నుపోటు రాజకీయంగానే చూడాలని ప్రజలంతా అనుకుంటున్నారు.

రంగా హంతకులు వెలగపూడి, దేవినేని ఏ పార్టీలో ఉన్నారు..?
రంగా హత్యలో ఆరోపణలు ఎదుర్కొన్న వైజాగ్‌ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు..? అలానే దేవినేని ఉమ ఎక్కడున్నాడు..? మొన్నటిదాకా చలసాని పండు ఏ పార్టీలో ఉండేవాడు..? వీళ్లంతా తెలుగుదేశం పార్టీలోనే కదా ఉంది. మా వైఎస్ఆర్సీపీలో లేరు కదా..! 1989లో శోభనాద్రి ఎన్నికల్లో ఓడిపోయారంటే.. ఆరోజు రంగా అభిమానులు బూటుకాలితో తంతేనే కదా.. మరి, అప్పట్లో ఎందుకు శోభనాద్రిని ఓడించాల్సి వచ్చింది. టీడీపీపై ఉన్న వ్యతిరేకతతోనే కదా.. అప్పటి కాంగ్రెస్‌ నాయకుడు కటారి ఈశ్వరకుమార్‌ను రంగా అభిమానులే గెలిపించారు. రంగా హత్య కేసులో ఉన్న ముద్దాయిలంతా టీడీపీలోనే ఉన్నారు. ఈరోజు నేను కొత్తగా చెప్పడం లేదు. ఇదే విషయాన్ని కాపునాయకులైన హరిరామజోగయ్య కూడా చెప్పారు.దేవినేని నెహ్రూ అనే వ్యక్తి వంగవీటి మోహన్‌రంగాను చంపలేడు. ఆరోజు వంగవీటి వ్యక్తికాదు. అతనొక పెద్ద వ్యవస్థ. ఈ వ్యవస్థను చంపగలిగిన వ్యక్తులు లేరు. దేవినేని నెహ్రూకు రంగాని చంపేంత సామర్ధ్యం లేదు. ఆరోజు టీడీపీ ప్రభుత్వం చేసిన కుట్ర మూలంగానే రంగా లాంటి వ్యవస్థను మట్టుబెట్టారు. ఆయన హత్య వెనుక ఈనాడులాంటి పచ్చమీడియా కూడా భాగస్వామే.

మేం రంగాకు వ్యతిరేకం కాదు
మా గౌరవ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో కులపరంగా, మతపరంగా కొన్ని స్థానాల్లో మార్పులు, చేర్పులు చేసే పరిస్థితి ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రాజ్యాధికారం కల్పించేక్రమంలో జరిగిన మార్పులను, చేర్పులను, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్ని అర్ధం చేసుకుని మమ్మల్ని కూడా సర్దుబాటుతో నడవాలన్నారు. మేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, మా నాయకుడు జగన్‌ మాట వింటాం. నేనైతే మంత్రి పదవిని వదులుకున్నాను. అంతమాత్రాన నాకు వైఎస్ఆర్సీపీ పట్ల, జగన్‌ పై అసంతృప్తి ఉందని మీ ఎల్లో మీడియా ఎలా చెబుతుంది..? ఇదేవిధంగా వంగవీటి మోహనరంగా కొడుకు రాధాబాబుకు వైఎస్ ఆర్సీపీలో అన్యాయం జరిగిందని అతను భావిస్తే, అది పూర్తిగా అతని వ్యక్తిగతం. అంతేగాని, రంగా హత్యకు.. రాధాబాబు వైఎస్ఆర్సీపీని వీడిపోవడానికి ముడిపెట్టడమనేది మోకాలికి, బోడిగుండుకు లింకు పెట్టడంలాంటిదే. ఇక్కడ ప్రజలు గానీ, మీడియా గాని తెలుసుకోవాల్సిందేంటంటే.. వంగవీటిని రాజకీయంగా ఎదుర్కొనలేక భౌతికంగానే భూమ్మీదే లేకుండా చేసిన పార్టీ టీడీపీనే అని..

నాడు రంగా హత్య జరగ్గానే.. ‘రావి’ బట్టలకొట్టు కాల్చేశారెందుకు..?
గుడివాడలో రంగా పేరును అడ్డంపెట్టుకుని రాజకీయం చేస్తూ టీడీపీ ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తోంది. గుడివాడలో రాజకీయ ఉద్రికత్తలకు కారణం ముమ్మాటికీ టీడీపీయే. నిన్న జరిగిన దాడి వాతావరణం చిన్నపాటి కామెడీగానే చూస్తాను. గుడివాడలో రంగా అభిమానులంతా టీడీపీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగానే ఉన్నారు. రంగా చనిపోగానే ఆయన అభిమానులు ఎవరి మీద దాడి చేశారు..? నా మీద, నా ఇంటిమీద దాడి చేయలేదు కదా..? గుడివాడలో రావి వెంకటేశ్వరరావు బట్టల కొట్టును తగలబెట్టారు కదా.. అప్పట్లో వారంతా ఇళ్లు, ఊళ్లు వదిలి పారిపోయారు కదా.. అందరూ చూశారు కదా.. దీన్నిబట్టి రంగా హత్యకు కారణమైన వారు ఎవరో ప్రజలు తెలుసుకున్నారు కదా.. అప్పట్లో కాపు యువకులపై గుడివాడలో కేసులు పెట్టించిన నీచమైన వ్యక్తులు టీడీపీ నాయకులే కదా..

రాజకీయాలకు అతీతంగా రంగా కుటుంబంతో..
రాజకీయాలకతీతంగా రంగా కుటుంబంతో, రంగాతో కలిసి తిరిగిన అభిమానులతో కలిసి ఉన్న వ్యక్తిని నేను. వారి కొడుకు రాధాబాబు, నేను ఏ రాజకీయ పార్టీల్లో ఉన్నప్పటికీ మేమిద్దరం ఆత్మీయ స్నేహితుల్లానే ఉంటాం. రాధాబాబు మా కుటుంబ సభ్యుడు. రంగా పేరును ఏ రోజూ రాజకీయాలకు వాడుకునే నీచమైన సంప్రదాయం నాకు లేదు. రంగా ఆశయాన్ని నిలబె ట్టేందుకు చివరి రక్తపుబొట్టు వరకు పార్టీలకతీతంగా ఆయన దారిలో పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నాను.

LEAVE A RESPONSE