అమరావతి: కేంద్ర మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజుకు హైకోర్టులో ఊరట లభించింది. రామతీర్థం ఘటన ఎఫ్ఐఆర్పై తదుపరి చర్యలు వద్దని హైకోర్టు ఆదేశించింది.
ఇటీవల నెల్లిమర్ల మండలం రామతీర్థం బోడికొండపై కోదండరాముని ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఘటన నేపథ్యంలో రామతీర్థం ఆలయ ఈవో ప్రసాద్‌రావు అశోక్‌పై నెల్లిమర్ల పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆలయ ధర్మకర్త అశోక్‌పై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ప్రభుత్వ విధులకు ఆటంకం, ఆస్తి ధ్వంసం, గందరగోళం సృష్టించారని కేసు నమోదు చేశారు. దీనిపై అశోక్ గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్లో కోరారు. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం ఎఫ్ఐఆర్లో తదుపరి చర్యలు నిలిపివేయాలని ఆదేశించింది.