-రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ కొవ్వొత్తి-అగ్గిపెట్టెల పంపిణీ!
-వారంరోజులపాటు గ్రామగ్రామాన నిరసన
-జగన్ రెడ్డి ఉగాది కానుక – విద్యుత్ ఛార్జీల బాదుడే బాదుడు
-పండుగనాడు రాష్ట్రప్రజల జీవితాల్లో చీకట్లు నింపిన జగన్ రెడ్డి
-టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజం
రాష్ట్ర ప్రజల్ని ఉగాది పండుగ చేసుకోనీయకుండా జగన్ రెడ్డి వారి జీవితాల్లో చీకట్లు నింపారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుదలకు నిరసనగా ఈనెల 2వతేదీ ఉగాది నుంచి వారంరోజులపాటు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యాన కొవ్వొత్తులతో నిరసన చేపట్టాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి కొవ్వొత్తి-అగ్గిపెట్టెలను పంపిణీ చేస్తారు.
తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన విద్యుత్ ఛార్జీల పెంపుతో జగన్ రెడ్డి రాష్ట్రప్రజల జీవితాల్లో చీకట్లు నింపుతారని ఎవరూ ఊహించి ఉండరు. కొత్త సంవత్సరం రోజున ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాల్సిన తరుణంలో ప్రజలు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితిని జగన్ రెడ్డి కల్పించారు. కోతలు, వాతలతో జగన్ రెడ్డి ప్రజల జీవితాలను దుర్భరం చేస్తున్నారు. జగన్ రెడ్డి మోపిన విద్యుత్ ఛార్జీల పెనుభారంతో ప్రజలు ఇళ్లలో కరెంటు స్వీచ్ వేయాలంటేనే వణికిపోతున్నారు.
ప్రజల్ని చీకట్లోకి నెట్టిన జగన్ రెడ్డి, జే-గ్యాంగ్ కుటుంబాలు మాత్రం అవినీతి సొమ్ముతో కళకళలాడుతున్నాయి. చీకట్లలో ఉన్న ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వారి తరపున ప్రజాక్షేత్రంలో పోరాడాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. జగన్ రెడ్డి మెడలు వంచి పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించేవరకు వివిధ రూపాల్లో ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నాం. ఇందులో భాగంగా తొలిదశలో కొవ్వొత్తుల-అగ్గిపెట్టె పంపిణీ నిర్వహించి నిరసన తెలియజేయాలని నిర్ణయించాం. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులంతా ఈ కార్యక్రమాలకు హాజరై విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిస్తున్నాం.