Suryaa.co.in

Andhra Pradesh

దర్శి మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ విజయం

– జిల్లా తెదేపా ఊపిరి అందించిన దర్శి విజయం
దర్శి నగర పంచాయతీ గా ఆవిర్భవించిన తరువాత జరిగిన మొట్టమొదటి నగర పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 20 వార్డులకు గాను ఎన్నికలు జరిగిన 19 వార్డులలో 13 వార్డులను తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. 6 వార్డులను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. గతంలోనే 1 వార్డులో వైసిపి అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి విధితమే.
దర్శి నగర పంచాయతీ ఎన్నికలను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అధికారాన్ని, జిల్లా ఇన్చార్జ్ మంత్రి, మంత్రులను, మాజీ మంత్రులను, శాసనసభ్యులను, ఇతర జిల్లాల శాసన సభ్యులను,ఏ వార్డులో ఏ సామాజిక వర్గ ఓటర్లు అత్యధికంగా ఉన్నారో ఆ సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర స్థాయి వైసిపి నేతలను మోహరించి హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఫలితాలలో విజయం దక్కలేదు. దర్శి నగర పంచాయతీ లో గెలిచిన అధికార పార్టీ అభ్యర్థులు ప్రతిపక్షానికి పరిమితమయ్యారు.
మాట నెగ్గించుకున్న పమిడి రమేష్
దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించిన పమిడి రమేష్ నాటి నుండి, దర్శి నియోజకవర్గంలో వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. కార్యకర్త నుండి జిల్లా నాయకుడి వరకు ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతూ వివాదాలకు, విభేదాలకు తావివ్వకుండా ప్రతి ఒక్కరి మాటను ఆలకిస్తూ స్వీయ వ్యూహంతో దర్శి నియోజవర్గం లో పార్టీని పటిష్ట పరచడం లో తనదైన శైలిలో ముందుకు వెళ్లారు.
అందులో భాగంగానే దర్శి నగర పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత అభ్యర్థుల ఎంపిక నుండి ప్రచార శైలి వరకు తనదైన శైలిలో గెలుపు గుర్రాలను ఎంపిక చేసుకున్నారు. ప్రచారంలో సైతం ఐదేళ్ల చంద్రబాబు పరిపాలన రెండున్నర సంవత్సరాల అవినీతి పరిపాలన బేరీజు వేసుకుని నగర పంచాయతీ ఓట్లు వేయాలని అభ్యర్థించారు. నాడు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ నేడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన లో జరుగుతున్న అవినీతి అంటూ ఆరోపణలు సంధించారు.
ప్రతి అభ్యర్థికి వెన్నంటి ఉండి నైతిక బలాన్ని ఇచ్చారు. జిల్లాలోని తెదేపా శాసనసభ్యులను, మాజీ శాసనసభ్యులను ముఖ్య నాయకులను ప్రచారంలో దించి ఐకమత్యంతో అధికార పార్టీని ఢీ కొన్నారు. దాని ఫలితమే నేడు దర్శి నగర పంచాయతీ ఎన్నికలలో తేదేపా ఘన విజయం సాధించిందని తెదేపా శ్రేణులు అంటున్నారు. అందుకే దర్శి మున్సిపల్ ఎన్నికల విజయంలో పమిడి రమేష్ తో పాటు గా జిల్లా టీడీపీ నేతలు కూడా పాలుపంచుకున్నారు.
అధికార పార్టీకి తప్పని పరాభవం…. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రులు, శాసనసభ్యులు, మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్, డైరెక్టర్ల వరకు ప్రచారంలో ఊదరగొట్టిన, సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించిన ఫలితం నిరాశాజనకం కావడం వైకాపా శ్రేణులకు ఆశ్చర్యానికి గురిచేసిందంటున్నారు.
దర్శి నగర పంచాయతీ ప్రజలు ఏడు స్థానాలతో సరిపెట్టడం అధికార పార్టీ అమాత్యుల కు మింగుడు పడటం లేదని, ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా చేస్తామని గతంలో అనేక సార్లు బహిరంగంగానే పత్రికా సమావేశంలో చెప్పిన మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, దర్శి నగర పంచాయతీ ఎన్నికలలో అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి విస్తృత ప్రచారం చేపట్టిన ఫలితం రాలేదు.
గత అసెంబ్లీ ఎన్నికల నుండి ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల వరకు విజయాలను చవి చూడని టిడిపి కి దర్శి నగర పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం పార్టీకి, క్యాడర్ కు మంచి కిక్ ఇచ్చిందని చెప్పక తప్పదని అంటున్నారు.

LEAVE A RESPONSE