Suryaa.co.in

Editorial

వైసీపీకి షాకిచ్చిన విభీషణులు!

– ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అనూహ్య విజయం
– 23 ఓట్లతో అనురాధ గెలుపు
– నలుగురు వైసీపీ ఎమ్మెల్యేల క్రాస్‌ ఓటింగ్‌
-టీడీపీకి చేయెత్తి జైకొట్టిన ఆనం, కోటంరెడ్డి
– మిగిలిన ఎవరా ఇద్దరు ఎమ్మెల్యేలు?
– మేకపాటి, ఉండవల్లి శ్రీదేవిపై వైసీపీ ఎమ్మెల్యేల అనుమానం?
– ఫలించిన చంద్రబాబు చాణక్యం
– స్టార్‌ హోటళ్లలో పనిచేయని వైసీపీ మాక్‌ పోలింగ్‌
– 16 మందిపై నిఘా పెట్టినా ఫలించని వైసీపీ వ్యూహం
– ఎన్నికల ముందు వైసీపీకి బిగ్‌ షాక్‌
– ఇప్పటికే మూడు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ సీట్లు గెలిచిన టీడీపీ
– టీడీపీలో సమరోత్సాహం
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచిందా? వైసీపీలోని విభీషణులు టీడీపీని గెలిపించారా? వైసీపీ ఓటమికి కారణం టీడీపీనా? సొంత పార్టీలోని విభీషణులా? 16 మంది అనుమానితులపై పెట్టిన నిఘా ఏమైంది? ఆ ఇద్దరినీ ఎలా గుర్తించారు? వారి అసంతృప్తికి కారణమేమిటి? ఎన్నికల ముందు మోగిన ప్రమాద ఘంటిక వైసీపీ గుండెల్లో డేంజర్‌ బెల్స్‌కు సంకేతమా? .. ఇదీ ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక అనూహ్య ఫలితంపై హాట్‌ టాపిక్‌.

ఎన్నికలకు ఏడాది ముందు ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి కాలం కలసివస్తోంది. ఇటీవల జరిగిన మూడు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో .. రాయలసీమ సహా విజయభేరి మ్రోగించిన టీడీపీ.. ఇప్పుడు అనూహ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటులో విజయం సాధించి, అధికార వైసీపీకి షాక్‌ ఇచ్చింది. అలా అసాధ్యమైన ఎమ్మెల్సీ విజయాన్ని, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాణక్యం సుసాధ్యం చేసింది. చాపకింద నీరులా అమలు చేసిన చంద్రబాబు పోలింగ్‌ వ్యూహం, ఫలితాల్లో మెరిసింది.

తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీకి జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి అనురాధ అనూహ్య విజయం సాథించడం, వైసీపీ నాయకత్వాన్ని ఖంగుతినిపించింది. ఏకంగా నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడాన్ని వైసీపీ నాయకత్వం జీర్ణించుకోలేకపోతోంది. ఆ నలుగురిలో ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సీఎం జగన్‌పై, చాలారోజుల నుంచే తిరుగుబాటు బావుటా ఎగరవేసి, ధిక్కారస్వరం వినిపిస్తూనే ఉన్నారు. తాను అంతరాత్మ ప్రబోధం మేరకే ఓటు వేశానని కోటంరెడ్డి మీడియాకు వెల్లడించారు. అయితే మిగిలిన ఆ ఇద్దరు ఎవరన్న ప్రశ్న వైసీపీ వర్గాల మెదళ్లు తొలిచేస్తోంది.

అయితే టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి అనురాధ, ఎట్టి పరిస్థితిలోనూ గెలవకూడదన్న లక్ష్యంతో రంగంలోకి దిగిన వైసీపీ వ్యూహబృందం..విజయవాడ మురళీఫార్చూన్‌ హోటల్‌లో మాక్‌ పోలింగ్‌ నిర్వహించింది. ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేసింది. అయినప్పటికీ, రెండు ఓట్లు క్రాస్‌ అవడం వైసీపీ వర్గాలను ఖంగుతినిపించింది. కోలా గురువులుకు కేటాయించిన తాడికొండ శ్రీదేవి, జయమంగళ వెంకట రమణకు కేటాయించిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తమకు ఓట్లు వేయలేదని, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలో మీడియా వద్ద అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం.

ఈ మొత్తం పరిణామాలు, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీలో సమరోత్సాహం కలిగించగా.. అధికార వైసీపీని కుంగదీశాయి. ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాయి. పంచుమర్తి అనురాధ వంటి ధాటిగా మాట్లాడే నేత, కౌన్సిల్‌లో అడుగుపెట్టడం తమకు అదనపు బలమని టీడీపీ నేతలు సంబర పడుతున్నారు. నిజానికి 16 మంది అనుమానిత అసంతృప్త ఎమ్మెల్యేలపై, వైసీపీ నాయకత్వం నిఘా పెట్టింది. వారికోసం ప్రత్యేకంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు కేటాయించింది. చివరకు ఇద్దరు అనుమానిత- అసంతృప్త ఎమ్మెల్యేలతో, సీఎం జగన్‌ కొద్దిరోజుల క్రితం స్వయంగా మాట్లాడారు. ఎమ్మెల్యే టికెట్లు తప్ప, ఏం కావాలన్నా ఇస్తామని ఆఫర్‌ ఇచ్చినప్పటికీ, వారిద్దరూ సంతృప్తి చెందలేదని వైసీపీ వర్గాల సమాచారం.

స్వయంగా సీఎం జగన్‌ రంగంలోకి దిగినప్పటికీ, ఊహించని పరాజయం ఎదురుకావడం వైసీపీకి శరాఘాతంగా పరిణమించింది. అసలే మూడు గ్రాడ్యుయేట్ల స్ధానాలు పోగొట్టుకున్న మూడు, నాలుగు రోజులకే.. మరో సీటు కోల్పోవడం తమకు నైతికంగా దెబ్బేనని వైసీపీ వర్గాలు అంగీకరిస్తున్నాయి. ఇది వైసీపీలో అసంతృప్తి ఎమ్మెల్యేలకు దారి చూపే కొత్త పరిణామమని వైసీపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
మరోవైపు ఎమ్యేల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. అభ్యర్ధిని నిలబెట్టాలని అనూహ్య నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి.. పోలింగ్‌ వరకూ చంద్రబాబునాయుడు వ్యూహాత్మకంగా పావులు కదిపారు. నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి వెళ్లిపోవడంతో, టీడీపీ బలం 19కే పరిమితం అయింది. ఇక విజయానికి కావలసిన 23 ఓట్లపై దృష్టి సారించిన టీడీపీకి, ఆనం- కోటంరెడ్డి ఓట్లు రెండు అదనంగా లభించాయి. దానితో మరో ఇద్దరి ఓట్లు అవసరమయ్యాయి.

ఈ క్రమంలో దాదాపు 8 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తొలిదశలో.. చంద్రబాబును హైదరాబాద్‌లో రహస్యంగా కలవడం, ఆ మేరకు వారు తమ ప్రతిపాదనలు వినిపించడం, చంద్రబాబు వారికి తగిన హామీ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. అయితే చంద్రబాబును కొందరు ఎమ్మెల్యేలు నేరుగా కలిశారన్న వార్తలు గుప్పుమనడంతో.. మరికొందరు ఎమ్మెల్యేలు, ఆయనకు సన్నిహితంగా ఉండే మరికొందరితో టచ్‌లోకి వెళ్లారు. ఆవిధంగా మొత్తం 16 మంది ఎమ్మెల్యేలు టీడీపీకి టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. కానీ, ఎన్నికల్లో కావలసిన రెండు ఓట్లనే దృష్టి పెట్టుకుని, ఓటింగ్‌లో మద్దతును వారిద్దరికే పరిమితం చేసినట్లు స్పష్టమవుతోంది.

అందుకే టీడీపీ నేతలు మొదటి నుంచి, ఎమ్మెల్సీ ఎన్నిక విజయంపై పూర్తి ధీమాతో ఉన్నారు. మధ్యలో గంటా శ్రీనివాసరావు గతంలో చేసిన రాజీనామాను, స్పీకర్‌ ఆమోదించారంటూ సోషల్‌మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. అయినప్పటికీ.. టీడీపీ వద్ద వైసీపీ అసమ్మతి ఎమ్మెల్యేల అస్త్రాలు ఇంకా మిగిలిపోవడంతో, ఆ ప్రచారానికి టీడీపీ నాయకత్వం పెద్దగా భయపడలేదు. పైగా అప్పటికే గంటా శ్రీనివాసరావు పేరు ఓటరు లిస్టులో నమోదయింది.

LEAVE A RESPONSE