Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డిని ఉతికి ఆరేయండి

-ఏ కులానికి ఎంత ఖర్చు చేశారో చెప్పే ధైర్యం ఈ జగన్ రెడ్డికి ఉందా?
-జీవోలు కూడా ఇవ్వకుండా అంతా చీకటి పాలన
-సిగ్గుమాలిన ముఖ్యమంత్రి.. ఆడపిల్లల చున్నీలు కూడా తీసేయించిన పిరికి ముఖ్యమంత్రి
-ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో ‘‘ఇదేం ఖర్మ – మన రాష్ట్రానికి’’ కార్యక్రమంలో భాగంగా బీసీ -వర్గాల ప్రజలతో నారా చంద్రబాబు నాయుడు

టీడీపీ అంటే బీసీలు.. బీసీ అంటే టీడీపీ. స్వాతంత్ర్యానంతరం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లతో కొంత న్యాయం జరిగింది. కానీ.. 50 శాతానికి పైగా జనాభా కలిగిన బీసీలు తొలి నుండి నష్టపోయారు. చేతి వృత్తులు, కుల వృత్తులపై ఆధారపడిన బీసీలు ఆధునిక కాలంలో అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. అందుకే నాడు ఎన్టీఆర్ బీసీలను ఆదుకోవడమే ధ్యేయంగా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారు. వేలాది మంది బీసీలను నాయకులుగా తీర్చిదిద్దిన పార్టీ తెలుగుదేశం పార్టీ. యనమల రామకృష్ణుడు, కె.ఇ.కృష్ణమూర్తి, అయ్యన్న పాత్రుడు, ఎర్రన్నాయుడు.. లాంటి ఉద్దండుల ఖార్ఖానా మన తెలుగుదేశం పార్టీ.

బీసీలు రాజకీయాల్లో రాణించాలి. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగేలా చేయడమే తెలుగుదేశం పార్టీ ధ్యేయం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 24 శాతం ఉన్న రిజర్వేషన్లను 34 శాతానికి పెంచాం. కానీ ఈ జగన్ రెడ్డి ఆ రిజర్వేషన్లను 24 శాతానికి కుదించాడు. 16,800 మందికి పదవులు దూరం చేశాడు. ఈ రోజు జగన్ రెడ్డి బీసీలకు పదవులిచ్చాం. ఉద్దరించాం అంటున్నాడు. ఏం ఉద్దరించాడు? ఒకరికి పదవి ఇచ్చి వారి నెత్తిపై సొంత వ్యక్తిని ఇంఛార్జిగా పెట్టి పెత్తనం చెలాయిస్తున్నాడు. బీసీలు ఐక్యంగా ఉండడం ఇష్టం లేక వారి మధ్య విధ్వేషాలు సృష్టిస్తున్నాడు. ఉద్దేశ్యపూర్వకంగా కులాల మధ్య చిచ్చు పెట్టి, బీసీలను అణగదొక్కి రాజకీయంగా లబ్ది పొందాలనుకుంటున్నాడు.

మరోవైపు బీసీలను ఆర్ధికంగా పురోభివృద్ధి సాధించేలా చర్యలు తీసుకున్నాం. కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కోసం రుణాలిచ్చాం. ఆదరణ పరికరాలతో చేతి వృత్తుల వారు మరింత ఆదాయం పొందేలా చేశాం. 140 కులాలను ఆర్ధికంగా బలోపేతం చేసేలా నాడు చర్యలు తీసుకుంటే.. జగన్ రెడ్డి అన్నింటినీ నాశనం చేసి బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాడు.

తెలుగుదేశం పార్టీ తరఫున 54 బీసీ సాధికార కమిటీలు ఏర్పాటు చేశాం. ఈ కమిటీలన్నీ ప్రజల్లో తిరిగి ఆయా కులాల్లోని ప్రజల అవసరాలు తెలుసుకోండి. రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా మెరుగైన స్థానంలో నిలిచేందుకు ఏం చేయాలో తెలుసుకుని చెప్తే.. భవిష్యత్తులో అండగా ఉంటాను. టీడీపీ ఐదేళ్లncb2 పాలనలో సబ్ ప్లాన్ ద్వారా రూ.36వేల కోట్లు కేటాయించి.. రూ.30 వేల కోట్లు ఖర్చు చేశాం. కానీ.. ఈ జగన్ రెడ్డి ఇంత వరకు ఏం ఖర్చు చేశాడో చెప్పే ధైర్యం ఉందా? అందరికీ ఖర్చు చేసిన నిదుల్ని బీసీలకు చేసినట్లు చెబుతున్నాడు. సబ్ ప్లాన్ నిధుల్ని బీసీల కోసం మాత్రమే ఖర్చు చేశాం. కానీ నేడు.. అమ్మఒడి, రేషన్, పెన్షన్, చివరికి ఇంటికి ఇచ్చే తాగునీటికి, వీధిలో వేసే రోడ్డుకు అయ్యే ఖర్చును కూడా అందులోనే చూపిస్తున్నాడు.

గతంలో వైఎస్ఆర్ బీసీల కోసం ఫెడరేషన్లు పెట్టాడు. నిధులివ్వలేదు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ఆదరణ ద్వారా 124 కులాలకు పరికరాలు అందించాం. 50 శాతం జనాభా లో 142 కులాలున్నాయి. అందులో ఏ కులానికి ఎంత ఖర్చు చేశారో చెప్పే ధైర్యం ఈ జగన్ రెడ్డికి ఉందా? జీవోలు కూడా ఇవ్వకుండా అంతా చీకటి పాలన పాలిస్తున్నారు.

నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ అన్న జగన్ రెడ్డి.. టీటీడీలో 37 మంది సభ్యులుంటే.. ఇచ్చింది ముగ్గురికి. ఇదేనా 50 శాతం రిజర్వేషన్? 12 యూనివర్శిటీలుంటే.. టీడీపీ హయాంలో 9 వర్శిటీలకు వీసీలుగా బీసీలను నియమిస్తే.. ప్రస్తుతం 10 యూనివర్శిటీల వీసీలు రెడ్లే, చివరికి వీసీలతో పాటు రిజిస్ట్రార్లుగా కూడా సొంత వర్గంతో నింపుకున్నారు. అసలు ఏమాత్రం సంబంధం లేని ఎన్టీఆర్ వర్శిటీకి కూడా రెడ్డి పేరు పెట్టుకున్నారు. బీసీలకు ఇబ్బందులకు గురిచేస్తే.. ఊరుకునేది లేదని జగన్ రెడ్డి గుర్తించాలి.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా.. ముఖ్యమంత్రి, డీజీపీ, సీఎస్ ఇలా మొత్తం వ్యవస్థను ఒక వర్గమే ఉంది. సలహాదారుల్లోనూ మొత్తం వారే. రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల్లోనూ మొత్తం వారే. రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చేసి నలుగురు రెడ్లకు రాసిచ్చేసి.. వారిని రాష్ట్రంపై పెత్తనం చేయిస్తున్నారు. ఇష్టానుసారం వ్యవహరిస్తే తెలుగుదేశం పార్టీ నేతలు చూస్తూ ఊరుకోరు అని తెలుసుకోవాలి.

పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనే విషయం జగన్ రెడ్డికి తెలుసు. 2014 నాటి సీన్ 2024లో రిపీట్ అవుతుందని తెలిసి జగన్ వణుకుతున్నాడు. బీసీలను ఉద్దరించానంటున్న జగన్ రెడ్డీ… ఆయా సామాజికవర్గాల్లో ఉన్న జనాభా ఎంత, ఇస్తున్న సాయం ఎంతమందికి? చెప్పాలి. సిగ్గుమాలిన ముఖ్యమంత్రి.. ఆడపిల్లల చున్నీలు కూడా తీసేయించిన ఈ పిరికి ముఖ్యమంత్రికి తెలుగుదేశం పార్టీ చుక్కలు చూపించడం తధ్యం. బెదిరించి, భయపెట్టి రాజకీయం చేస్తామంటే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

రాష్ట్రంలోని చెరువులు, రిజర్వాయర్లపై హక్కుల్ని మత్స్యకారులకు కల్పిస్తూ.. నాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. జగన్ రెడ్డి జీవో నెం.217 ఇచ్చి ఆ హక్కుల్ని కూడా వారి నుండి లాక్కున్నారు. వాటిని కూడా తన బినామీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. గీత కార్మికుల పొట్ట కొట్టి తన కల్తీ మద్యాన్ని ప్రజల నెత్తిన రుద్ది ప్రాణాలు తీస్తున్నారు. తరతరాలుగా కల్లు వృత్తిపై ఆధారపడిన వారికి ఎందుకు షాపులివ్వలేదు. అధికారంలోకి వచ్చాక.. రాష్ట్రంలోని 10-20 శాతం మద్యం షాపుల్ని గీత కార్మికులకు ఇస్తూ పాలసీ మారుస్తాం. టీడీపీ హయాంలో 1187 బీసీ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి శ్రీకారం చుడితే.. జగన్ రెడ్డి మొత్తాన్ని నాశనం చేయడం వాస్తవం కాదా?

జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు చేస్తున్న ద్రోహాన్ని ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా ‘‘ఇదేం ఖర్మ – మన రాష్ట్రానికి’’ అనే కార్యక్రమం ఇచ్చాం. ప్రతి ఒక్కరూ జనాల్లోకి వెళ్లండి. రాష్ట్రానికి పట్టిన ఈ దరిద్రాన్ని వదిలించేలా ప్రజల్ని చైతన్యం చేద్దాం. తెలుగుదేశం ప్రభుత్వం రూ.200 ఉన్న పెన్షన్ రూ.2000 చేసింది. ప్రమాద వశాత్తు చనిపోయిన వారికి రూ.5 లక్షల చొప్పున బీమా కల్పించాం. కానీ ఇప్పుడేం చేస్తున్నాడు.. బటన్ నొక్కుతున్నా అంటున్నాడు. ఏం బటన్ నొక్కుతున్నాడో ఏంటో.. అన్ని సంక్షేమ పథకాలు నాశనం చేశాడు. అభివృద్ధి దెబ్బతీశాడు. విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణా కేంద్రాలు, పెళ్లి కానుకలు రద్దు చేశారు.

26 మంది బీసీ నాయకులను హత్య చేశారు. వందలాది మందిపై దాడులు చేశారు, తప్పుడు కేసులు పెట్టారు. ఇదేనా బీసీ సంక్షేమం? ఎవరో ఇద్దరి మధ్య గొడవలో హత్య జరిగితే కొల్లు రవీంద్రను జైల్లో పెట్టారు. ఫిర్యాదులో పేరు లేకపోయినా అయ్యన్నపై కేసు పెట్టారు. పెళ్లికి వెళ్లినందుకు యనమల రామకృష్ణుడిపై అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టారు. ఫోటో తీయడాన్ని ప్రశ్నించినందుకు 70 ఏళ్ల వయసున్న అయ్యన్నపై రేప్ కేసు పెట్టారు.

56 కార్పొరేషన్లు పెట్టాను అంటున్న జగన్ రెడ్డి.. ఏ కార్పొరేషన్ ద్వారా ఎంత ఖర్చు చేశాడో సమాధానం చెప్పగలడా? జగన్ రెడ్డి చేసిన ద్రోహాన్ని గుర్తించే కొంత మంది ఛైర్మన్లు రాజీనామాలు చేసి వెళ్లిపోతున్నారు. ఈ దుర్మార్గపు జగన్ రెడ్డిని గద్దె దించేందుకు.. బీసీలంతా ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. 54 సాధికార కమిటీ సభ్యులు ప్రజల్లోకి వెళ్లి.. జగన్ రెడ్డిని ఉతికి ఆరేయండి. జగన్ రెడ్డి చేస్తున్న దగా, దుర్మార్గాన్ని ప్రజలకు వివరించి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం. రాష్ట్ర భవిష్యత్తును పునర్నిర్మించుకుందాం.

LEAVE A RESPONSE