Suryaa.co.in

Andhra Pradesh

టీచర్లను సస్పెండ్ చేయడం కక్ష సాధింపుకు నిదర్శనం

– మీ చేతకాని తనాన్ని ఉద్యోగుల మీద చూపించడం తగదు
– విద్యా వ్యవస్థని మార్చడం వల్ల నష్ట పోయేది ప్రజలు
– ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు
– శ్రీకాకుళంలో 625 మంది హెడ్మాష్టర్లకి మెమోలివ్వడం, అనకాపల్లిలో 2నిమిషాలు ఆలస్యంగా వచ్చారని ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేయడం కక్ష సాధింపుకు నిదర్శనం

శ్రీకాకుళంలో 625 మంది హెడ్మాష్టర్లకి మెమోలివ్వడం, అనకాపల్లిలో 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చారని ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేయడం కక్ష సాధింపుకు నిదర్శనమని ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు పేర్కొన్నారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఒకపక్క విద్యావ్యవస్థలో మార్పులు, చేర్పులు తీసుకొస్తానని చెబుతూ మరోపక్క డిజిటల్ క్లాసులు, రేషనైజేషన్ ఆఫ్ స్కూల్స్ అంటున్నారు. వీటి వల్ల జరిగిన నష్టం అధికం. ఆ స్కూళ్ల దగ్గర, గ్రామాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేయడం ప్రజలు చూస్తున్నారు.

ఏం చేస్తే విద్యావ్యవస్థ బాగుపడుతుందనేది ముఖ్యమంత్రి అర్థం చేసుకోలేకున్నారు. విద్యా వ్యవస్థని నాశనం చేస్తున్నారని ప్రజలు అర్థం చేసుకున్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో తమ ప్రభుత్వం అనుబంధంగా మారుస్తోందని అన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ దేశంలో ఏ రాష్ట్రము అమలు చేయడంలేదు. కేవలం ఏపీ మాత్రమే అమలు చేసింది. అంగన్ వాడీ స్కూళ్లను పీ స్కూళ్లుగా మార్చి 3 నుంచి 10వ తరగతి వరకు స్కూల్స్ గా కలుపుతారు. ఈ మెర్జింగ్ వల్ల కొన్ని స్కూళ్లు మూతపడుతున్నాయి.

తద్వారా టీచర్ పోస్టులు పోతున్నాయి. 3 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సీ కూడా ఇవ్వలేదు. తెలుగుదేశం ప్రభుత్వం రెండు డీఎస్సీలు ఇచ్చింది. విజయవాడలో పీఆర్సీపై జరిగిన ఆందోళనలో లక్షలాది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అంత పెద్ద ఎత్తున ఆందోళన జరగడం జీర్ణించుకోలేని సీఎం ఉపాధ్యాయులను వేధిస్తున్నారు. నాయకులను పిలిచి భయపెట్టో, బ్రతిమలాడో పీఆర్సీ ఘట్టాన్ని ముగించారు. ఉపాధ్యాయులు మరుగుదొడ్ల ఫొటోలు పెట్టలేదని మెమోలిచ్చి వారిని ఇబ్బందులపాలు చేస్తున్నారు.

ముఖ్యమంత్రి దృష్టిలో టీచర్లు పనిచేయడంలేదనే ఉద్దేశం ఏదైనా ఉంటే దాన్ని సీఎం మార్చుకోవాలి. ఖాళీగా ఉండి ప్రభుత్వంతో జీతం తీసుకుంటున్నవారు ఎవరైనా ఉంటే అది పెన్షనర్స్ తరువాత ముఖ్యమంత్రే. బటన్ నొక్కుతుంటాను.. ఫీల్డ్ పై వెళ్లి పనిచేయాలనే సీఎం అసలు బటన్ నొక్కడానికి సీఎం ఎందుకు కంప్యూటర్ ఆపరేటర్ చాలు అంటున్నారు, కాని విద్యావ్యవస్థ అలాంటిది కాదు. అమ్మఒడి ఇచ్చాము.

నాడు-నేడు ద్వారా రంగులేసి స్కూళ్లను పెళ్లికూతురిలా చేశామంటే ప్రజలు నమ్మరు. కరోనాలో కొందరిని స్కూళ్ల దగ్గర పెట్టి కొంతమంది చావులకు ప్రభుత్వమే కారణమైంది. ఈ సంఘాలు మొత్తుకుంటున్నాయి. ప్రజలు పోరాడుతుంటే ఆ పోరాటాన్ని అణచివేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా అత్యంత దయనీయ పరిస్థితుల్లో నేడు ఏపీలో టీచర్లు ఉన్నారు. టీచర్లను ఏ విధంగా వాడుతున్నారో చెప్పడానికి కూడా ఇబ్బందిగా ఉంది. బ్రాందీషాపుల వద్ద జనాన్ని కంట్రోల్ చేయడానికి టీచర్లని వాడారు. బాత్రూమ్ ల వద్ద ఫొటోలు తీయడానికి టీచర్లను పెట్టమంటున్నారు. రెండు నిమిషాలు ఆలస్యంగా వస్తే ఉపాధ్యాయులని సస్పెండ్ చేయడం బాధాకరం. ఉపాధ్యాయులు వస్తున్న బస్సులు, రోడ్ల మార్గాలు అధ్వాన్నంగా ఉన్నాయి. ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ కూడ అధ్వాన్నంగా పనిచేస్తున్నాయి.

ఉపాధ్యాయులు మండలానికి దాదాపు 6కి.మీ ల నుంచి ప్రయాణం చేసి వస్తున్న వారు అనేకమంది ఉన్నారు. నేడు రాష్ట్ర రోడ్లు ఉన్న దుస్థితిలో 10నిమిషాలలో గమ్యానికి చేరుకోవాల్సిన వారు అరగంటకు కూడ చేరుకోలేని పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితులలో 2నిమిషాలు ఆలస్యంగా వచ్చారని టీచర్ల్ ని అనాకాపల్లిలో సస్పెండ్ చేయడం బాధాకరం. పనులు సరిగా చేయలేదని హెచ్.యమ్ లు 600మందికి మేమోలు ఇవ్వడం అన్యాయం. ప్రభుత్వం తన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఉపాధ్యాయులు ఉద్యమం చేయడం, ప్రశ్నించడం ఇష్టం లేదు కాబట్టి కక్ష్య సాధింపుగా అటెండెన్స్ రిజిష్టర్ పెట్టి వాళ్లని బాధ పెడుతున్నారు.

నిన్న ముఖ్యమంత్రి విద్యావ్యవస్థ, ఆ శాఖపై రివ్యూ చేస్తూ రాష్ట్రంలో విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు చేస్తూ మార్పులు, చేర్పుులు తీసుకొస్తున్నామని ఎన్నడూ లేనివిధంగా మార్పులు తీసుకొస్తామన్నారు. సంస్కరణలు, మార్పులు ఇవేనా? కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్ టైజ్ మెంట్ లు ఇవ్వడం తప్ప ప్రజలకు లబ్ధి శూన్యం. ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నారు కాబట్టి ఏం చేసినా ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు భరిస్తాయి అనే భ్రమలో ఉండకూడదు. చేస్తున్న పర్యావసనాల ఫలితం ఎన్నికలలో కనపడుతుంది.

రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ తర్వాత నాశనమైన వ్యవస్థ ఏదైనా ఉందంటే అది విద్యా వ్యవస్థ. స్కూళ్ల మెర్జింగ్ లు పెట్టారు, ఉపాధ్యాయ ఉద్యోగ భర్తీలు లేవు. స్కూళ్ల మెర్జింగ్ లలో డ్రాప్ అవుట్స్ పెరిగాయి. స్కూళ్ల స్టాండర్స్ తగ్గాయి. పిల్లల చదువులలో నాణ్యత తగ్గింది. పిల్లలకి స్కూళ్ల యూనిఫామ్ లు ఇస్తాం, ఏవేవో ఇస్తాం అని పెద్ద పెద్ద పత్రికా ప్రకటనలు కోట్లు ఖర్చు పెట్టి వేసుకోవడమే కాని వాస్తవానికి ఆ బెనిఫిట్ అందుకునే వారి సంఖ్య ప్రతి సంవత్సరానికి తగ్గుతోంది. ఇది మేము చెప్తుంది కాదు మీ గణాంకాలు చెప్తున్నాయి.

నేడు విద్యా వ్యవస్థ బాగుంది, ఆంధ్రప్రదేశ్ లో చదువుకోవడం అదృష్టంగా భావించే పరిస్థితి ఉందని మీరు, మీ సాక్షి పత్రిక ప్రచురించినంత మాత్రాన నిజాలు అయిపోవు. దేశంలో 4 సంవత్సరాలకొకసారి చేసే సర్వేలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా దిగజారిపోయింది, ఉపాధ్యాయ సంఘాలని అణగదొక్కుతున్నారు. టీచర్లని అటెండన్స్ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఉపాధ్యాయులని సస్పెండ్ లు, ట్రాన్స్ ఫర్ల్ తో కక్ష్య పూరిత చర్యలు చేస్తున్నారు.

ఆలస్యం చేయమని ఎవరు చెప్పరు, సమయ పాలన అందరూ పాటించాల్సిందే, కాని రెండు నిమిషాల ఆలస్యానికే సస్పెండ్ చేయడం దుర్మార్గం. ఎగ్జామ్ లో ఆలస్యం అయితే పరీక్ష పూర్తి చేయడానికి తగిన సమయం సరిపోదు కనుక ముందే రావాలి, రాకపోతే అనుమతించం అని కఠిన నిర్ణయం అమలు చేశారు. కాని ఉపాధ్యాయులని కూడ అదే రీతిలో రెండు నిమిషాల ఆలస్యానికే సస్పెండ్ చేసి, ఉపాధ్యాయులని భయపెట్టే రీతిని ఖండిస్తున్నాం.

మీ చేతకాని తనాన్ని ఉద్యోగుల మీద చూపించడం తగదు. ఇప్పటికైనా ఉపాధ్యాయ సంఘాల వాళ్లతో సంప్రదింపులు జరిపి వారి సలహాలు తీసుకొని అవి అమలు చేస్తే విద్యా వ్యవస్థ బాగుపడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అప్పుల కోసం రైతులకి మీటర్లు పెట్టిన తీరులో విద్యా వ్యవస్థని మార్చడం వల్ల నష్ట పోయేది ప్రజలు. మీరు నష్ట పోయేది ఏమి లేదు. పదవి ఉంటే బటన్ నొక్కుతారు పదవి లేక పోతే ఏమిలేదు. విద్య వ్యవస్థ కుంటు పడితే దాన్ని సరిచేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. మీరు చేయదలచిన నూతన విద్యా వ్యవస్థ మార్పులని ఉపాధ్యాయ సంఘాలు, మేధావులని సంప్రదించి చేస్తే విద్యా వ్యవస్థ మెరుగుపడటానికి అవకాశాలుంటాయని ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు సూచించారు.

LEAVE A RESPONSE