– రాష్ట్ర వ్యాప్తంగా వినూత్నరీతిలో నిరసనలు
అమరావతి: న్యాయమైన వేతన సవరణ కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కదంతొక్కారు. పిఆర్‌సి సాధన సమితి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోన్న ఈ ఆందోళనల్లో ప్రతీ జిల్లాలోనూ ఉపాధ్యాయ, ఉద్యోగుల నిరసన గళాలు హోరెత్తాయి.ప్రభుత్వం మోసం చేసిందని.. తమకు నష్టం కలిగించే పిఆర్‌సి జిఒ లను రద్దు చేయాల్సిందేనని ఉద్యోగులు డిమాండ్ చేశారు.
పిఆర్‌సి జిఒ లకు వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం సోమవారం సమ్మె నోటీసునిచ్చింది. మంగళవారం నుంచి ఉధృత ఉద్యమాలను ప్రారంభించింది. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాలు కొనసాగుతున్నాయి.
వినూత్న రీతుల్లో నిరసనలు..
నిరసనకారులు వినూత్న రీతుల్లో తమ ఆందోళనను వ్యక్తపరుస్తున్నారు. అర్థనగ్న ప్రదర్శనలతో, బైక్ ర్యాలీలతో, మోకాళ్లపై.. వినూత్న ప్రదర్శనలతో పిఆర్‌సి జిఒ లకు వ్యతిరేకంగా ఉపాధ్యాయ, ఉద్యోగ
సంఘాలు ఆందోళనను తీవ్రతరం చేశాయి.న్యాయమైన వేతన సవరణ కోసం రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయులంతా చేస్తున్న ఈ ఉద్యమానికి భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) మద్దతు తెలిపింది.
విజయవాడ : విజయవాడలోని పాతబస్టాండ్ నుంచి గాంధీనగర్ ధర్నాచౌక్ వరకు ఉద్యోగ సంఘాలు భారీ ప్రదర్శన చేపట్టాయి.
విజయనగరం: రివర్స్ పిఆర్‌సి ని రద్దు చేయాలంటూ.. ఉద్యోగ సంఘాలు జెఎసి ల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం విజయనగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జెడ్పి నుంచి ర్యాలీ ప్రారంభమయింది. విజయనగరం వీధులన్నీ నిరసనకారులతో కిక్కిరిశాయి. నినాదాలతో దద్దరిల్లాయి.
గుంటూరు: న్యాయమైన వేత సవరణ కోసం… ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఉద్యమాలు కొనసాగుతున్నాయి. మంగళవారం పిఆర్‌సి సాధన సమితి ఆధ్వర్యంలో గుంటూరులో భారీ ర్యాలీ
ప్రారంభమయింది. వెంకటేశ్వరా విజ్ఞాన మందిరం నుండి గుంటూరు కలెక్టరేట్ వరకూ ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు, జెఎసి లు, నాయకులు పాల్గొన్నారు.
విజయనగరం టౌన్ : విజయనగరం టౌన్‌లో వేలాదిమంది భారీ ప్రదర్శన చేపట్టారు. పిఆర్‌సి జిఒ ను రద్దు చేయాలని నినాదాలు చేశారు. మంగళవారం స్థానిక జెడ్పి కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభించారు. ఎత్తు బ్రిడ్జి, ఆర్ అండ్ బి,పోలీసు బ్యారెక్స్ మీదుగా కలెక్టరేట్ కు ర్యాలీ చేరుకుంది. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో సాధన సమితి నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పాల్గొన్నారు. ఉద్యోగుల పోరాటానికి సిఐటియు, సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు.
అనంతపురం: పిఆర్‌సి ని వ్యతిరేకిస్తూ అనంతపురం నగరంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. టవర్ క్లాక్ నుంచి సప్తగిరి సర్కిల్ మీదుగా కలెక్టర్ కార్యాలయం.వరకు ర్యాలీ జరిగింది. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ మద్దతు తెలిపారు.