-అత్యున్నత డ్రోన్ చిత్రాల అధారంగా భారీ స్ధాయి రీసర్వే మ్యాప్ లు
-సర్వే సెటిల్‌మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమీషనర్ సిద్ధార్థ జైన్
అత్యున్నత ప్రమాణాలతో కూడిన డ్రోన్ చిత్రాల అధారంగా భారీ స్ధాయి రీసర్వే చిత్ర పటాలు తయారు చేస్తున్నట్టు సర్వే సెటిల్‌మెంట్స్ , ల్యాండ్ రికార్డ్స్ కమీషనర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. రీసర్వే ప్రక్రియలో భాగంగా కొనసాగుతున్న డ్రోన్ సర్వే నుండి గుణాత్మక, పరిమాణాత్మక ఆర్థో రెక్టిఫైడ్ (ఓఆర్ఐ) చిత్రాలను రూపొందించే మార్గాలపై కార్యాచరణను వేగవంతం చేసామన్నారు. రాష్ట్రంలో “వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షా పథకం” పేరిట సమగ్ర భూ సర్వే ప్రాజెక్టు నిర్వహిస్తుండగా, గుంటూరు జిల్లా తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంచాలకుల కార్యాలయంలో ప్రత్యేక కార్యశాలను నిర్వహించారు.
రీ-సర్వే ప్రాజెక్ట్‌లో భాగస్వాములుగా ఉన్న ప్రవేటు సంస్ధల ప్రతినిధులు సైతం ఈ వర్క్ షాపులో పాల్గొనగా డ్రోన్ చిత్రాలను ఉపయోగించి భారీ స్థాయి మ్యాప్‌లను రూపొందించే క్రమంలో ఎదురవుతున్న సాంకేతిక అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. ఫ్లైట్ ప్లానింగ్, డ్రోన్ ఫ్లై, ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్ , గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లు, చెక్ పాయింట్‌ల అధారంగా తరచుగా ఉత్పన్నం అయ్యే ప్రశ్నలు, వాటికి సమాధానాలు, విభిన్న అంశాలకు సంబంధించిన ప్రమాణాలు, పారామితులు, పరిశీలన విధానం, నాణ్యతతో కూడిన చిత్రాలు, వేగవంతమైన క్యాప్చర్, ప్రాసెసింగ్‌పై ఈ వివరణాత్మక వర్క్‌షాప్ కొనసాగింది.
కార్యశాలలో పాల్గొన్నసర్వే ఆఫ్ ఇండియా (హైదరాబాద్) అధికారులు పరిమాణాత్మక ఆర్థో రెక్టిఫైడ్ (ఓఆర్ఐ) యొక్క దృశ్య నాణ్యత, స్థాన ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడం, మంచి ఫలితాల కోసం నిరంతర నాణ్యత తనిఖీ పద్దతి మొదలైన అంశాలలో విలువైన సూచనలను అందించారు. ఈనేపధ్యంలో సర్వే సెటిల్‌మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమీషనర్ సిద్ధార్థ జైన్ మాట్లాడుతూ గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లు, చెక్ పాయింట్ల ఏర్పాటులో మంచి ఫలితాలను సాధించేందుకు వాంఛనీయ ఖచ్చితత్వంతో డ్రోన్ చిత్రాలను రూపొందించేందుకు సర్వే ఆఫ్ ఇండియా తీసుకున్న ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయన్నారు.
వర్క్ షాపులో సర్వే సెటిల్‌మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అదనపు సంచాలకులు శ్రీనివాసులు, కర్నూలు రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, కాకినాడ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ కెజియా కుమారి, సర్వే ట్రైనింగ్ అకాడమీ వైస్ ప్రిన్సిపాల్ సిహెచ్.వి.ఎస్.ఎన్.కుమార్ , ఇతర అధికారులు పాల్గొన్నారు. సర్వే ఆఫ్ ఇండియా నుండి సర్వేయర్లు రవిబాబు, శ్రద్ధా ప్రధాన్, రశీల పాల్గొన్నారు. ఇన్ డ్రోన్ సొల్యూషన్స్ (ముంబై), ఆస్టెరియా ఏరోస్పేస్ (ముంబై), క్లియర్ వాటర్ డైనమిక్స్ (బెంగళూరు), యుక్రా (హైదరాబాద్), జియోమాట్రిక్స్ (హైదరాబాద్), జెనెసిస్ ఇంటర్నేషనల్ (ముంబై), ఆర్వీ అసోసియేట్స్ (హైదరాబాద్) అగ్రి ఇన్‌ఫ్రా , ఆరవ్ యుఎం సర్వీసెస్ , ఐపేజ్ యుఎం సర్వీసెస్ , కాంబ్లి సిస్టమ్స్, ఓమ్మి రోబోటిక్స్, సార్ ఐటి రిసోర్సెస్ పాల్గొన్నారు.