– గతంలో టీఆర్ఎస్ అభ్యర్ధికి చెమటలు పట్టించిన మల్లన్న
– ఆ తర్వాత బీజేపీ.. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్‌లో
-అప్పుడు రేవంత్, ఇతర రెడ్డి నేతలపై విమర్శలు
– ఇప్పుడు ఆ పాత వీడియోలతో బీఆర్ఎస్ మైండ్‌గేమ్
– అప్పట్లో ఒంటరి సైనికుడన్న సానుభూతి
– అందుకే పార్టీ లేకపోయినా దన్నుగా నిలిచిన పట్టభద్రులు
– ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్ధి ముద్ర
– ఆ మూడు జిల్లాల కాంగ్రెస్ నేతలు సహకరిస్తారా?
– రెడ్డి వర్గం సహకరిస్తుందా?
– ఏకపక్ష ఎంపికపై సీనియర్ల అసంతృప్తి
– ఐదోసారి గెలుపుపై బీఆర్ఎస్ గురి
– గెలవకపోతే క్యాడర్ జారిపోవడం ఖాయం
– బీజేపీ ప్రభావం ఎంత?
– పట్టభద్రులలో కాంగ్రెస్ పలుకుబడి ఎంత?
– రేవంత్‌రెడ్డి ప్రతిభకు పట్టభద్రుల పరీక్ష
(మార్తి సుబ్రహ్మణ్యం)
యూట్యూబర్‌గా తెలుగు ప్రజలకు.. ప్రధానంగా తెలంగాణ ప్రజలకు సుపరిచితుడైన తీన్మార్ మల్లన్న ఈసారైనా ఎన్నికల్లో ఏక్మార్ కొడతారా? అప్పటి సానుభూతి ఇంకా కొనసాగుతోందా? అసలు మల్లన్నకు కాంగ్రెస్ సీనియర్లు చేయి అందిస్తారా? చేయిస్తారా? ప్రధానంగా ఆయన గతంలో రెడ్లకు వ్యతిరేకంగా బీసీల తరఫున చేసిన పోరాటం ఫలితంగా, ఇప్పుడు రెడ్లు మల్లన్నకు సహకరిస్తారా? అసెంబ్లీలో విజయం తర్వాత సీఎం రేవంత్‌రెడ్డికి పట్టభద్రులు పెట్టనున్న తొలి పరీక్షలో ఆయన పాసయి, పట్టు కొనసాగిస్తారా? ఐదోసారి గెలుపుపై కన్నేసిన కారు గెలవకపోతే క్యాడర్ కారు దిగే ప్రమాదం ఉందా? ఈ ఎన్నికల్లో కమలం ఖాతా తెరుస్తుందా?.. ఇవీ నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై నడుస్తున్న హాట్ టాపిక్.
రేవంత్ సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం, కాంగ్రెస్ పార్టీకి పరీక్షగా మారింది. సాధారణ ఎన్నికల్లో సామాన్యుల దన్నుతో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. ఈ ఎన్నికల్లో విద్యావంతులును మెప్పిస్తుందా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఇదే నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు విజయపతాకం ఎగరవేసిన బీఆర్ఎస్.. ఐదోసారి జండా ఎగరేసేందుకు పోరాడుతోంది. ఆ మేరకు ఆ పార్టీ బలమైన అభ్యర్ధి ఏనుగుల రాకేష్‌రెడ్డిని బరిలోకి దింపింది. ఇక మీడియా ద్వారా.. ప్రజలకు తెలిసిన ప్రేమేందర్‌రెడ్డిని బరిలోకి దించిన బీజేపీ, తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బిట్స్ పిలానీలో చదివిన రాకేష్‌రెడ్డి గోల్డ్‌మెడలిస్ట్. అమెరికాలో అధిక వేతనం వచ్చే ఉద్యోగాన్ని వదిలి, రాజకీయాల్లోకి వచ్చిన యువకుడు. పూర్వాశ్రమంలో ఏబీవీపీ నాయకుడు. బీఆర్ఎస్ ఇప్పుడు ఇదే ప్రచారం చేస్తోంది. మరి మల్లన్న ఏం చదివారన్న ప్రచారాన్ని క్షేత్రస్ధాయికి చేర్చింది. స్వయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం.. ‘’బిట్స్ పిలానీ కావాలా? పల్లీబఠానీ కావాలా?’’ అన్న ఆసక్తికరమైన నినాదానికి తెరలేపి, విద్యావంతులలో కొత్త ఆలోచనకు బీజం వేశారు.
కాగా ఇటీవల బీఆర్ఎస్ సోషల్‌మీడియా సైన్యం చేస్తున్న ప్రచారంపై చర్చ జరుగుతోంది. ఎంబీఏ పరీక్షల్లో కాపీ కొడుతూ పట్టుబడి బార్ అయిన వ్యక్తికి ఎలా ఓటు వేస్తారన్న చర్చతోపాటు.. ‘‘పరీక్షలో పట్టుబడ్డ అభ్యర్ధి కావాలా? బిట్స్‌పిలానీ
గోల్డ్‌మెడలిస్టు కావాలా? విద్యావంతులే తేల్చుకోవాల’’న్న పిలుపుతో, బీఆర్ఎస్ సోషల్‌మీడియా సైన్యం ప్రచారాన్ని పదునెక్కిస్తోంది. అయితే తనపై సోషల్‌మీడియాలో చేస్తున్న దుష్ప్రచారంపై మల్లన్న.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జదీష్రెడ్డి పీఏపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది వేరే విషయం.
దానితోపాటు గతంలో మల్లన్న తన యూట్యూబ్ చానెల్లో సీఎం రేవంత్‌రెడ్డి, జానారెడ్డి, ఉత్పమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, దామోదర్‌రెడ్డి, ప్రొఫెసర్ కోదండరామ్‌పై చేసిన విమర్శల వీడియోలను, బీఆర్ఎస్ సోషల్‌మీడియా సైన్యం జనక్షేత్రంలోకి వ దలడం ఆసక్తికరంగా మారింది.
అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించకపోతే, క్యాడర్ జారిపోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాకేష్‌రెడ్డి విజయం కోసం ఆ పార్టీ ప్రతి 30 మంది ఓటర్లకు ఒకరిని ఇన్చార్జిగా నియమించింది. వారంతా ఎక్కడున్నా స్వయంగా కలిసే ప్రణాళిక రూపొందించింది. స్వయంగా కేటీఆర్ ఈ ఎన్నికను సవాలుగా తీసుకున్నారు. మల్లన్నను ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు. అంతా బాగానే ఉన్నప్పటికీ.. ఒకవేళ రాకేష్‌రెడ్డి ఓడిపోతే, బీఆర్ఎస్ నుంచి వలసలు ప్రారంభం అవుతాయన్న చర్చ కూడా వినిపిస్తోంది.
యూట్యూబర్‌గా జనాలకు సుపరిచితమైన తీన్మార్ మల్లన్న, గత ఎన్నికల్లోనే విజయం అంచులదాకా వెళ్లారు. అప్పుడు ఆయన ఒంటరి సేనాని. తన యూట్యూబ్ చానెలే అండ. అయినా సరే అధికార టీఆర్ఎస్ అభ్యర్ధి రాజేశ్వర్‌రెడ్డిని ఢీకొని, చెమటలు పట్టించారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ మల్లన్న వ్యవహారశైలిని ప్రజల్లోకి తీసుకువెళ్లింది. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు. కానీ అక్కడ ఎక్కువకాలం ఉండలేకపోయారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో ఉన్నందున.. గతంలో ఆయనకు ఓటేసిన వారిలో ఎంతమంది మొగ్గుచూపుతారో చూడాలి.
తొలుత మేడ్చెల్ ఎమ్మెల్యే సీటు ఆశించి, రేవంత్ వద్ద కొన్ని షరతులు విధించారన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భువనగిరి కాంగ్రెస్ ఎంపీ సీటు ఆశించిన తీన్మార్ కృషి ఫలించలేదు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క తదితరుల సహకారంతో ఎమ్మెల్సీ సీటు సాధించారు. మంత్రి పొంగులేటి ఆయనకు దన్నుగా ఉన్నారన్నది పార్టీ వర్గాల వ్యాఖ్య.
అయితే అంతమంది సీనియర్ల దన్నుతో సీటు తెచ్చుకున్న మల్లన్నకు.. నల్లగొండ-వరంగల్ జిల్లా కాంగ్రెస్ సీనియర్లు పెద్దగా సహకరించడం లేదన్నది, ఇప్పుడు పార్టీలో జరుగుతున్న చర్చ. రెండు జిల్లాలను శాసిస్తున్న రెడ్డి సామాజికవర్గం, మల్లన్నపై ఆగ్రహంతో ఉండటమే దానికి కారణమన్నది పార్టీ నేతల విశ్లేషణ. మల్లన్న గతంలో జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, ప్రొఫెసర్ కోదండరెడ్డిపై తన యూట్యూబ్ చానెల్లో చేసిన వ్యాఖ్యలే దానికి కారణమంటున్నారు. రెడ్లకు వ్యతిరేకంగా బీసీల పక్షం వహించిన మల్లన్నకు, ఇప్పుడు రెడ్డి వర్గ నేతలెవరూ మనస్ఫూర్తిగా పనిచేయడం లేదన్నది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ.
వైశ్యులపై గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా ఆయనకు ప్రతికూలంగా మారాయంటున్నారు. అంటే రెడ్డి-వైశ్య-బ్రాహ్మణ-వెలమ వంటి అగ్రకులాలన్నీ మల్లన్నకు వ్యతిరేకంగానే ఉన్నటు,్ల తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే గతంలో మల్లన్న తనపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసినప్పటికీ, సీనియర్ నేత జానారెడ్డి పట్టించుకోకుండా పెద్ద మనసుతో ఆయన విజయం కోసం, ఇటీవల మంత్రి తుమ్మలతో కలసి సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్ధి రఘువీర్‌రెడ్డి, సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి పార్టీ కోసం పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి-ఆయన భార్య పద్మావతి కూడా ఒకసారి సమావేశం నిర్వహించారు.
కానీ నల్లగొండ-వరంగల్ జిల్లాల్లో పట్టున్న రెడ్డివర్గ నేతలంతా, మొక్కుబడిగా పనిచేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. దానికితోడు మల్లన్న ఎంపికకు సంబంధించి, తమతో చర్చించకపోవడంపై సీనియర్లు అసంతృప్తితో ఉన్నారంటున్నారు. నల్లగొండ-వరంగల్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్లు, ప్రధానంగా రెడ్డి వర్గ నేతలు మల్లన్న ఎంపికపై అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది.
ఇటీవల మిర్యాలగూడ డివిజన్ పిఆర్టియు కార్యదర్శి ఒక అంతర్గత సమావేశంలో మల్లన్న గురించి చేసిన వ్యాఖ్యలు, సోషల్‌మీడియాలో వైరల్ అయింది. దానితో ఆయనపై కేసు పెట్టిన వైనం, ఎక్కువ ఓటర్లున్న పిఆర్టియు టీచర్ల ఆగ్రహానికి గురయింది. తమకు చెబితే ఆ వీడియోను తొలగించేవారమని, అలా కాకుండా పోలీసు కేసు పెడితే తామెందుకు ఓట్లేస్తామని, ఇప్పుడు దానిని పీఆర్టియు ప్రతిష్ఠగా తీసుకుంది.
ఇదిలాఉండగా, గతంలో ఏబీవీపీ నేతగా పనిచేసిన బీఆర్ఎస్ అభ్యర్ధి రాకేష్‌రెడ్డికి ఏబీవీపీ కార్యకర్తలు అంతర్గతంగా పనిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ అభ్యర్ధి ప్రేమేందర్‌రెడ్డి ఎలాగూ గెలిచే అవకాశం లేని వాతావరణం ఉన్నందున, తమ పూర్వ పరిషత్ నేత రాకేష్‌ను గెలిపించాలన్న భావన ఏబీవీపీ క్యాడర్లో ఉన్నట్లు చెబుతున్నారు. బీజేపీ అభ్యర్ధి ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉంటారన్న భావన కనిపిస్తోంది.