Suryaa.co.in

Telangana

దేశానికి ఆదర్శంగా తెలంగాణ‌!

-విశేషంగా నియోజకవర్గ అభివృద్ధి!!
-ఇక మ‌హిళ‌లు, యువ‌త ప్ర‌గ‌తిపై ప్ర‌త్యేక దృష్టి
-నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి కెసిఆర్ ఆశీస్సులు
-కొత్తగా ఏర్పడ్డ ఒక్కో గ్రామానికి రూ.కోటికి పైగా నిధులు
-మహిళలు, యువత కోసం ఉచిత‌ కుట్టు శిక్షణ, మిషన్లు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు
-కార్యకర్తలల‌తో క‌లిసి ఆత్మీయ భోజ‌నాలు చేసిన మంత్రి ఎర్ర‌బెల్లి, ఉషాద‌యాక‌ర్ రావు

గ‌తంలో గ్రామ పంచాయ‌తీల చ‌రిత్ర‌లో లేనంత‌గా ఈ రోజు తెలంగాణ గ్రామాలు దేశానికి ఆద‌ర్శంగా నిలిచాయి. పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల ఆశీస్సుల‌తో నేను ఎమ్మెల్యే అయ్యాను. సిఎం కెసిఆర్ ద‌య వ‌ల్ల మంత్రిన‌య్యాను. గ్రామాల‌ను అభివృద్ధి చేసే అరుదైన అదృష్టం నాకు క‌లిగింది. ఒక్కో గ్రామానికి కోటి రూపాయ‌ల‌కు పైగా నిధులు పెట్టి స‌మ‌గ్ర అభివృద్ధి చేయ‌డం జ‌రిగింది. ఇక మ‌హిళ‌లు, యువ‌త ప్ర‌గ‌తిపై ప్ర‌త్యేక దృష్టి సారించాలి. మ‌హిళ‌లు, యువ‌త ప్ర‌గ‌తి కోసం పాటుప‌డ‌తాను. అభివృద్ధి ఎంత చేసినా, చేయాల్సింది ఇంకా మిగిలే ఉంటుంది. అంతా అయిపోయింద‌ని నేను అన‌డం లేదు. అర్హులైన పేద‌లంద‌రికీ ఆత్మ‌గౌర‌వంతో బ‌తికే విధంగా ఇండ్లు ఇచ్చే కార్య‌క్ర‌మాన్ని చేప‌డ‌తాను. న‌న్ను గెలిపించిన ప్ర‌జ‌ల రుణం తీర్చుకుంటాను అని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు.

పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం చిన్న మడూరు, కోలుకొండ, రాంభోజి గూడెం, రామచంద్ర పురం గ్రామాలను కలిపి చిన్న మడూరులో, దేవరుప్పుల, కామారెడ్డి గూడెం, గొల్లపల్లి, మన్ పహాడ్ గ్రామాలను కలిపి దేవరుప్పుల లో మంగళ వారం ఏర్పాటు చేసిన బి అర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనాల‌లో ఆయా గ్రామాల బి అర్ ఎస్ నాయకులు, అనుబంధ సంఘాల బాధ్యులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్ పర్సన్ ఎర్ర‌బెల్లి ఉషా దయాకర్ రావు ఆత్మీయ సమ్మేళ‌నంలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గ్రామాల వారీగా పార్టీ ముఖ్యులు, నాయకులు, కార్యకర్తల పేర్లు చదువుతూ వాళ్ళందరికీ ఆత్మీయ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. వారితో క‌లిసి ఫోటోలు దిగుతూ, వారితో త‌మ ఆత్మీయ‌త‌ను చాటుకున్నారు.

గౌడ సోదరుల కోరిక మేరకు వారు కల్లు పోయగా, కల్లు తాగి వారి వారి ముచ్చట తీర్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసిఆర్ గారి సందేశాన్ని ఆత్మీయ స‌మ్మేళ‌నాల్లో ముందుగా చదివి వినిపించారు. అనంతరం గ్రామాల వారీగా ప్రభుత్వం, పార్టీ పరంగా జరుగుతున్న అభివృద్ధికి సంబంధించిన వివరాలు తెలిపారు. ముఖ్య నాయకులు కార్యకర్తలు ద్వారా మాట్లాడించారు. ఆయా గ్రామాల వారీగా ఇంకా మిగిలి ఉన్న సమస్యలు, చేయాల్సిన పనులు, జరగాల్సిన అభివృద్ధిపై కార్యకర్తలతో మంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయా గ్రామాల ప్రజలు కార్యకర్తలు తన దృష్టికి తెచ్చిన సమస్యలను అక్కడికక్కడే మంత్రి పరిష్కరించారు. ఇండ్లు, పెన్షన్లు, దళిత బంధు, కమ్యూనిటీ హాళ్లు వంటివి చర్చించారు. కొన్ని సామాజిక కులాలకు కమిటీ హాళ్లు, గుడులను అక్కడికక్కడే మంత్రి మంజూరు చేశారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. రాష్ట్రంలో కొత్త పంచాయ‌తీరాజ్ చ‌ట్టం రావ‌డంతోపాటు, 3,146 గూడాలు, తండాలు కొత్త‌గా గ్రామ పంచాయ‌తీలు అయ్యాయి. సీఎం కెసిఆర్ గారి దూర‌దృష్టితో కేంద్ర ఫైనాన్స్ క‌మిష‌న్ నిధుల‌కు సమానంగా రాష్ట్ర నిధులు అందాయి. అతి త‌క్కువ జ‌నాభా ఉన్న గ్రామానికి కూడా రూ.5లక్ష‌ల‌కు త‌గ్గ‌కుండా నిధులు అందాయి. ఉపాధి హామీ ప‌థ‌కాన్ని స‌మ‌ర్థ‌వంతంగా వినియోగించుకోవ‌డం వ‌ల్ల శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న గ్రామాల్లో ప‌నులు జ‌రిగాయి. న‌ర్స‌రీలు, డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు, ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాలు, బృహ‌త్ ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాలు, క్రీడా ప్రాంగ‌ణాలు, మొక్క‌లు నాటి 7.7శాతానికి పెంచిన గ్రీన‌రీ, క‌ల్లాలు, రైతు వేదిక‌లు వ‌చ్చాయి.

ప్ర‌తి గ్రామ పంచాయ‌తీకి ట్రాక్ట‌ర్‌, ట్రాలీ, ట్యాంక‌ర్ లు అందాయి. దీంతో ఇవ్వాళ ప‌ల్లెలు కేంద్రం ఏ ప్ర‌మాణాల ప్ర‌కారం చూసినా, రాష్ట్రానికే అవార్డులు వ‌స్తున్నాయి. ఆ స్థాయిలో ప‌ల్లెల‌ను తీర్చిదిద్దినాం. సిఎం కెసిఆర్ వ‌ల్ల ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంలో వ‌చ్చి, అద‌నంగా నిధులు స‌మ‌కూర‌డ‌మే గాక‌, పారిశుద్ధ్యం మెరుగుప‌డింది. ఇంటింటికీ న‌ల్లాల ద్వారా శుద్ధి చేసిన మంచినీరు, సాగునీరు, విద్యుత్‌, రైతుల‌కు పెట్టుబ‌డులు, బీమా…ఇలా అనేక ప‌థ‌కాలు వ‌చ్చి, తెలంగాణ స‌స్య‌శ్యామ‌లం అవ‌డ‌మే గాక సుభిక్షంగా ప‌ల్లెలు త‌యార‌య్యాయి. అని మంత్రి ఎర్ర‌బెల్లి వివ‌రించారు. ఒక్కో గ్రామానికి త‌క్కువ‌లో త‌క్కువ కోటికిపై నిధులు అందిన‌ట్లు మంత్రి వివరించారు. పాత గ్రామ పంచాయతీలతో పాటు, కొత్తగా ఏర్పడ్డ తండాల‌కు కూడా ఈ మధ్యకాలంలో కోటి రూపాయలతో అభివృద్ధి జరిగినట్లు మంత్రి ఆత్మీయ స‌మ్మేళ‌నంలో చ‌దివి వినిపించారు. ఇక గ్రామాల్లో మ‌హిళ‌లు యువ‌త కోసం, వారి అభివృద్ధి కోసం ప‌నులు చేప‌ట్టాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నాను. మ‌హిళ‌ల‌కు ఉచిత ఉపాధి, ఉద్యోగావ‌కాశాలు దొరికే విధంగా కుట్టు మిష‌న్ల శిక్ష‌ణ‌, మిష‌న్ల పంపిణీని చేప‌ట్టాను. పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ‌వంలో 10వేల మందికి శిక్ష‌ణ ఇవ్వ‌డం ల‌క్ష్యం. వారికి ఉపాధి, ఉద్యోగాలు క‌ల్పించ‌డం నా విధిగా ప‌ని చేస్తున్నానని మంత్రి తెలిపారు. అలాగే, నిరుద్యోగ యువ‌త కోసం ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు ద‌క్కే విధంగా, వారికి ఉచిత శిక్ష‌ణ‌, జాబ్ మేళా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు మంత్రి వివ‌రించారు. ఎర్రబెల్లి ట్రస్టు చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు మాట్లాడుతూ, ఇవ్వాళ కెసిఆర్, దయాకర్ రావుల‌ వల్ల పాలకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి బాగా జరిగింది. దయన్న ఇప్పటికే ఎంతో చేశారు. మా కుటుంబం అంతా నియోజకవర్గ అభివృద్ధి కోసమే పాటు పడుతున్నది. ఇంకా అభివృద్ధి చేసే మనో ధైర్యాన్ని, అవకాశాలను ఇవ్వండి అని చెప్పారు .

మ‌హిళ‌ల‌తో క‌లిసి వడ్డిస్తూ, ఆత్మీయ భోజ‌నాలు
బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ స‌మ్మేళ‌నాల్లో బాగంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, ఆయ‌న స‌తీమ‌ణి, ఎర్ర‌బెల్లి ట్ర‌స్టు చైర్ ప‌ర్స‌న్ ఎర్ర‌బెల్లి ఉషా ద‌యాక‌ర్ రావులు మ‌హిళ‌ల‌తో క‌లిసి వడ్డిస్తూ భోజ‌నాలు చేశారు. మ‌హిళ‌ల‌తో క‌లిసి ముచ్చ‌టిస్తూ, స‌ర‌దాగా గ‌డుపుతూ, భోజ‌నాలు ఎలా ఉన్నాయి? రుచిగా ఉన్నాయా? అంటూ, వారి యోగ క్షేమాలు తెలుసుకుంటూ, వారితో మ‌మేకం అయి క‌లిసి భోజ‌నాలు చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు వారి సతీమణి ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్పర్సన్ ఉష దయాకర్ రావు గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, ముఖ్యులు, కార్యకర్తలు యువత విభాగం రైతుబంధు సమితి బాధ్యులు, బి అర్ ఎస్ పార్టీ వివిధ విభాగాల బాధ్యులు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE