– లోక్సభలో ఎంపీ కడియం కావ్య ప్రశ్నకు మంత్రి కిషన్ రెడ్డి సమాధానం
న్యూఢిల్లీ: ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో బొగ్గు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై స్పష్టత ఇవ్వాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కోరారు. ఈ మేరకు ఆమె లోక్సభలో మాట్లాడారు.
కావ్య అడిగిన ప్రశ్నకు సమాధానంగా, సింగరేణి బొగ్గు గనుల కంపెనీ లిమిటెడ్ బొగ్గు విక్రయ విధానాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. సంస్థ అనుసరిస్తున్న విధానాలు పారదర్శకతను పెంపొందించడమే కాకుండా, తెలంగాణ పరిశ్రమల అభివృద్ధికి దోహదపడుతున్నాయని తెలిపారు.
శక్తి విధానం (2017, 2025లో నవీకరణ), నాన్-రెగ్యులేటెడ్ సెక్టార్ లింకేజ్ వేలం విధానం (2016, 2020లో మార్పు), న్యూ కోల్ డిస్ట్రిబ్యూషన్ పాలసీ (2007, 2022 వరకు సవరింపు), బ్రిడ్జ్ లింకేజ్ పాలసీ (2016) వంటి కేంద్ర బొగ్గు శాఖ విధానాల ప్రకారం సింగరేణి బొగ్గు గనుల కంపెనీ లిమిటెడ్ తన బొగ్గు సరఫరాను నిర్వర్తిస్తోందని మంత్రి వివరించారు. ఈ విధానాల అమలుతో పారదర్శకత, సమాన అవకాశాలు, పరిశ్రమలకు మద్దతు, ఉపాధి అవకాశాల పెరుగుదల, అలాగే రాయల్టీ, పన్నుల రూపంలో రాష్ట్రానికి భారీ ఆదాయం లభిస్తోందన్నారు. ఇది తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
2025లో సవరించిన శక్తి విధానం ఆధారంగా పవర్ రంగానికి కొత్త బొగ్గు లింకేజీలు మంజూరు చేయడమవుతోందని ఆయన తెలిపారు. ఈ విధానాల వల్ల తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలకు స్థిరమైన బొగ్గు సరఫరా లభించడంతో పాటు పోటీతత్వ ధరల ద్వారా వ్యాపార వ్యయాలు తగ్గుతుండటంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.