– 2029 ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లే ప్రధాన జెండా కావాలి
రాహుల్ గాంధీ మాట మాకు శిలాశాసనం
– తెలంగాణ నిర్ణయం దేశాన్ని ప్రభావితం చేసింది
– బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసమే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా
– స్థానిక సంస్థల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలియజేసిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్,ఇతర నాయకులు
– కార్యక్రమంలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ,మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి
హైదరాబాద్ : 100 ఏళ్ల బీసీ ల ఆకాంక్ష ను రాహుల్ గాంధీ,ఖర్గే నాయకత్వం లో కాంగ్రెస్ పార్టీ నెరవేర్చింది. బీసీ రిజర్వేషన్లు గొప్ప కార్యక్రమం. ఆనాడు దళితులు, వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు కల్పించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చింది.
కులగణన చేస్తామని రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రలో స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ మాట మాకు శిలాశాసనం. నాయకుడు మాట ఇస్తే దాన్ని నేరవేర్చాల్సిన బాధ్యత నాది, మా పీసీసీ అధ్యక్షుడిది. కులగణన పైన ఎన్నో అవాంతరాలు వచ్చినా వాటిని అధిగమించాం. యేడాదిలో పూర్తి పారదర్శకంగా , పక్కా గా కులగణన పూర్తి చేశాం.
ఫిబ్రవరి 4 ని సామాజిక న్యాయ దినోత్సవం గా ప్రకటించుకున్నాం. అసెంబ్లీ తో పాటు అన్ని వర్గాలతో కులగణన పైన చర్చించాం.. అందరి అభిప్రాయాలను తీసుకున్నాం. రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే తెలంగాణ మోడల్ లో కులగణన చేయాలని దేశమంతా చెబుతున్నారు. కులగణన కు మేం వ్యతిరేకమని బీజేపీ గతంలో సుప్రీంకోర్టు లో అఫిడవిట్ దాఖలు చేసింది.
బీసీ రిజర్వేషన్లను 9 వ షెడ్యూల్ లో చేర్చాలని జంతర్ మంతర్ లో నిర్వహించిన ధర్నాకు 16 పార్టీలు మద్దతు ఇచ్చాయి. మనం తీసుకువచ్చిన ఒత్తిడికి లొంగే కేంద్రం 2026 లో జరిగే జనగణనలో కులగణన చేయాలని నిర్ణయించింది. తెలంగాణ నిర్ణయం దేశాన్ని ప్రభావితం చేసింది. బీసీ రిజర్వేషన్లపై మాకు చిత్తశుద్ధి లేదని కొందరు విమర్శిస్తున్నారు.
చిత్తశుద్ది లేని ది బీజేపీకి. బీసీ రిజర్వేషన్లను 9 వ షెడ్యూల్ చేరి చట్టబద్దత కల్పించాల్సింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ లు లక్ష్మణ్, ఆర్ క్రిష్ణయ్య సాధించాలి. మోదీ స్థానంలో రాహుల్ గాంధీ ఉంటే 48 గంటల్లో నేను రిజర్వేషన్లను సాధించుకు వచ్చేవాడిని. ప్రధాని మోదీని తెలంగాణకు చెందిన బీజేపీ మంత్రులు ప్రశ్నించాలి. బీజేపీ నాయకులు వాళ్ల నిబద్ధతను చూపించాలి.
రిజర్వేషన్ల కోసం ఇంకా ఏం చేయాలన్నా నేను సిద్ధం. ఏం చేయాలో చెప్పండి. అర్ధరాత్రి కూడా నా మంత్రి వర్గం సమావేశం ఏర్పాటు చేస్తా. రిజర్వేషన్ల విషయంలో నన్ను ప్రశ్నించే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదు.నా నిబద్దతను ప్రశ్నించలేరు. నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసమే ఇంత కాలం స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశాం.
యాభై శాతానికి మించి రిజర్వేషన్లు పెంచొద్దని గత కేసీఆర్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం చేసింది. ఈ చట్టం చేసినప్పుడు మంత్రులు గా గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. కేసీఆర్ ఇప్పుడు వాళ్లను మా పైకి ఉసిగొల్పుతున్నాడు. ఆ చట్టంలో పేర్కొన్న యాభై శాతం నిబంధనను సవరిస్తూ మేం ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకువచ్చాం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తాపత్రయం పడుతున్నది నేను. నాకు తోడుగా ఉండండి.. రక్షణ కవచంలా ఉండి రిజర్వేషన్లను కాపాడుకోవాలి.
రిజర్వేషన్లపై ఎవరైనా కోర్టుకు వెళ్తే వాదించడానికి ఢిల్లీ నుంచి ఉద్దండులైన న్యాయవాదులను వాదనల కోసం నియమిస్తా. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కాగితం పెట్టిన వాళ్ళని, కాగితం పెట్టించిన వాళ్లను సామాజిక బహిష్కరణ చేస్తామని ప్రకటించండి.
42 శాతం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఎంపీలతో పాటు ఇండియా కూటమి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం. అన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అమలు అయితేనే నిజమైన విజయం. 2029 ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లే ప్రధాన జెండా కావాలి.