తెలంగాణ సీఎం బీసీనే

- బీసీల వాటా గుంజుకుంటాం
- రాహుల్ ప్రధాని కావడం తథ్యం
- అధికారంలోకి రాగానే కుల సర్వే
- బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు దద్దమ్మలు
- టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్య
శంషాబాద్: : తెలంగాణకు బీసీయే గ్యారంటీగా ముఖ్యమంత్రి అవుతాడని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీసీలకు రావాల్సిన వాటా తీసుకుంటామని, అవసరమైతే లాక్కుంటామని వ్యాఖ్యానించారు. బీసీలది న్యాయమైన కోరిక అని అన్నారు. బీసీలకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అండగా ఉంటారని చెప్పారు.
శంషాబాద్‌లో నిర్వహించిన టీపీసీసీ ఓబీసీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బీసీల హక్కుల కోసం మాట్లాడే ధైర్యం రాహుల్ గాంధీ ఇచ్చారని గుర్తు చేశారు.
తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి అవుతాడని ఘంటాపథంగా చెబుతున్నా.
రాహుల్ గాంధీ, ఖర్గే ఇచ్చిన ధైర్యంతో బీసీ ముఖ్యమంత్రి అవుతాడని చెబుతున్నా. రాహుల్ భారత్ జోడో యాత్రతో, ఎవరు ఎంతో వారికి అంత రాహుల్ గాంధీ నినాదం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 55 శాతానికి పైగా సర్పంచ్లను చేశాం.
మున్సిపల్ ఎన్నికల్లో 58 శాతం బీసీలకు సీట్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. మంత్రివర్గంలో, ఎమ్మెల్సీల్లో, కార్పొరేషన్లలో బీసీల సంఖ్యను పెంచుతాం. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రుల సహకారంతో కుల సర్వే నిర్వహించి డాక్యుమెంట్ ఇచ్చాం.
బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు దద్దమ్మలు. మోదీ, అమిత్ షా దగ్గరికి వెళ్ళి చెప్పే దమ్ము, ధైర్యం దద్దమ్మలకు లేదు. కుల సర్వే సాకారం అయి ఉంటే యావద్దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా ఉండేది. కేంద్ర సర్వేలో 10వ కాలమ్‌లో ఎస్సీ, ఎస్టీ ఇచ్చి ఓబీసీ కాలమ్ ఎత్తేశారు. బీసీ వంచన చేస్తున్న మోదీ. తెలంగాణ పిలుపు కేంద్రానికి కనువిప్పు కావాలి. మోదీ గద్దె దిగే టైం వచ్చింది.
రాహుల్ ప్రధాని కావడం తథ్యం. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కుల సర్వే నిర్వహిస్తాం. కులాలను పక్కనపెట్టి బీసీలు ఏకం కావాలి. పోరాడితే పోయేదేమీ లేదు. భవిష్యత్ తరాల కోసం పోరాటం చేయాల్సిన అవసరం. న్యాయమైన కోరిక మనది. మన వాటా మనకు వచ్చే వరకు పోరాడాలి అని మహేశ్ కుమార్‌గౌడ్ పిలుపునిచ్చారు.
