డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణకు జాతీయ గుర్తింపు

- కేంద్రం నిర్దేశించిన ఏడు అంశాల్లో 80 శాతానికి పైగా మార్కులు
- ఈగల్ ఫోర్స్ కృషికి జాతీయ స్థాయిలో పురస్కారం
- ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, సిబ్బందిని అభినందించిన డీజీపీ సీవీ ఆనంద్
- డ్రగ్స్ మహమ్మారి బారి నుండి భవిష్యత్ తరాలను కాపాడటమే లక్ష్యం
- డిజిపి సి. వి. ఆనంద్ వెల్లడి
హైదరాబాద్ : డ్రగ్స్, మాదకద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ పోలీస్ శాఖ మరోసారి జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకుంది. డైరెక్ట్ సందీప్ శాండిల్య నేతృత్వంలో తెలంగాణ ఈగల్ ఫోర్స్ చేపట్టిన సమన్వయ చర్యలు, దర్యాప్తు, నిరోధక కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు లభించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా న్యూ ఢిల్లీ లో ఈగల్ ఫోర్స్ డైరెక్ట్ మంగళ వారం జాతీయ స్థాయి పురస్కారం అందుకున్నారు.
న్యూఢిల్లీలో సెప్టెంబర్ 22, 23 తేదీల్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడో జాతీయ స్థాయి యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ (ANTF) అధిపతుల సమావేశంలో ఈ గుర్తింపు లభించింది. దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, రాష్ట్రాల మధ్య సమన్వయం, దర్యాప్తు సామర్థ్యం, నార్కోటిక్స్ నియంత్రణ వ్యవస్థ బలోపేతంపై ఈ సదస్సులో చర్చిస్తున్నారు.
ఏడు అంశాల్లో ప్రతిభ
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఏడు ప్రధాన అంశాల ఆధారంగా రాష్ట్రాల యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పనితీరును అంచనా వేశారు. తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఈ అంశాల్లో 80 శాతానికి పైగా మార్కులు సాధించింది.
- ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ 2. సింథటిక్ డ్రగ్స్ నియంత్రణ 3. ప్రాసిక్యూషన్ విధానం 4. డిమాండ్, హార్మ్ రిడక్షన్ కోఆర్డినేషన్, కెపాసిటీ బిల్డింగ్ 6. రిసెర్చ్, అనాలిసిస్ 7. అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్ ప్రాసిక్యూషన్ విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. లీగల్ సెర్చ్, జ్యుడీషియల్ అనాలిసిస్, సాక్షుల రక్షణ, ప్రాసిక్యూషన్ సపోర్ట్ వంటి అంశాలకు ప్రత్యేక సెల్‌లను ఏర్పాటు చేశారు.
జిల్లాల వారీగా డీజీపీ పర్యవేక్షణ
డ్రగ్స్ నియంత్రణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన డీజీపీ సీవీ ఆనంద్… ఈగల్ ఫోర్స్ అధికారులతో పలుమార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. జిల్లాల పర్యటనల్లో ఎస్పీలు, యూనిట్ అధికారులకు మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో ఇంటెలిజెన్స్ సేకరణ, కేసుల దర్యాప్తు, నిందితులపై చర్యలు, ప్రాసిక్యూషన్ తదితర అంశాలపై అధికారులు సమన్వయంతో పనిచేశారు.
భవిష్యత్ తరాలను కాపాడటమే లక్ష్యం
డ్రగ్స్ మహమ్మారి బారిన పడకుండా భవిష్యత్ తరాలను కాపాడటమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. మాదకద్రవ్యాల వల్ల యువత, ముఖ్యంగా పిల్లల జీవితాలు దెబ్బతినే ప్రమాదం ఉందని, అందువల్ల డ్రగ్స్ నియంత్రణపై పోలీస్ శాఖ మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలను సాధించడంలో ఈగల్ ఫోర్స్‌తో పాటు జిల్లా పోలీసు యూనిట్లు, సంబంధిత విభాగాలు సమన్వయంతో పనిచేయడం అభినందనీయమని డీజీపీ తెలిపారు. జాతీయ స్థాయిలో తెలంగాణ ఈగల్ ఫోర్స్‌కు లభించిన ఈ గుర్తింపు వెనుక పనిచేసిన అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు.
సైబర్ నేరాల నియంత్రణ, డ్రగ్స్ కట్టడిలో అగ్రస్థానం
తెలంగాణ పోలీస్ శాఖ రెండు కీలక ప్రాధాన్య విభాగాల్లో దేశంలోనే మొదటి స్థానానికి చేరుకుంది. సైబర్ నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల (యాంటీ నార్కోటిక్స్) కట్టడిలో అత్యుత్తమ పనితీరుతో అగ్రస్థానం సాధించింది.
ఇతర విభాగాల్లోనూ ర్యాంకును మెరుగుపర్చేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా కొత్త జాతీయ నేర చట్టాల అమలు, ఐసీజేఎస్ (ICJS), సీసీటీఎన్‌ఎస్ (CCTNS) వంటి అంశాల్లో వెనుకబడిన స్థాయిని అధిగమించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనుంది. ఆయా విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించి, పనితీరును నిరంతరం సమీక్షిస్తూ ర్యాంకును మెరుగుపర్చేలా చర్యలు తీసుకోనునట్లు డిజిపి స్పష్టం చేశారు.
