– రేవంత్ రెడ్డి ఇకనైనా కళ్లు తెరవాలి
– రేవంత్ బండి వెనక్కి దూసుకెళ్తోంది
– రాష్ట్రం రక్తపాతంలో మునిగితేలుతోంది
– బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి
హైదరాబాద్ : ఏడాది పాలనతోనే తెలంగాణ రెయిజింగ్ అంటూ కాంగ్రెస్ సర్కారు చేసుకుంటున్న ప్రచారంపై బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి ఫైరయ్యారు. మంగళవారం బీఆర్ఎస్ నేతలతో కలిసి తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పాలనలో.. అభివృద్ధిలో కంటే ఇతర అంశాల్లో తెలంగాణ దూసుకెళ్తోందని విమర్శించారు. నిర్భంధాలలలో, కూల్చివేతలలో, హత్యలు, అత్యాచారాలలో, రైతుల కష్టాలలో, రైతుల ఆత్మహత్యల్లో, గురుకులాల విద్యార్థుల మరణాలలో, ధర్నాలు, లాఠీచార్జీలు, అక్రమ అరెస్టులలో, రైతు కష్టాల్లో, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యల్లో, పోలీసు కానిస్టేబుళ్ల ఆందోళనల్లో, జర్నలిస్టుల మీద దాడుల్లో, ఎన్ కౌంటర్లలో రెయిజింగ్ అవుతోందని ఆరోపించారు.
మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి బూతుల్లో, ముఖ్యమంత్రి అబద్దాల్లో చాలా రెయిజింగ్ ఉందన్నారు. కాంగ్రెస్ సర్కారు స్కాముల్లో, అవినీతిలో, ఢిల్లీ ట్రిపుల్లో, ఢిల్లీకి పంపే మూటల్లో పెరుగుదల ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ రెయిజింగ్ అవకపోగా.. అప్పటికే అభివృద్ధిలో దూసుకెళ్తున్న రాష్ట్రం.. తిరోగమన మార్గం పట్టిందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు రక్తం చిందిస్తోంటే.. కాంగ్రెస్ సర్కారు జల్సాలు చేస్తోందని ఆయన ఆరోపించారు.
తెలంగాణ రెయిజింగ్ అంటే.. అన్ని రంగాల్లో వృద్ధి కనిపించాలని.. కానీ ఇప్పుడు ఏ రంగంలోనూ వృద్ధి కనిపించడం లేదని ఆయన అన్నారు. రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందని, పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగ కల్పన 9 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయని చెప్పారు. ఉద్యోగాల కల్పనలో 2015 కంటే దిగువకు రాష్ట్రం పడిపోయిందని వివరించారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కూడా పూర్తిగా పడిపోయిందని… ఇండ్లు కొనాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. ఉన్న ఇళ్లు కూడా ఉంటాయో కూలిపోతాయో అన్న భయం ప్రజల్లో కనిపిస్తోందని అన్నారు.
గత ఏడాది ఈ సమయానికి రూ.5వేల కోట్ల లోటు బడ్జెట్ ఉంటే.. ఇప్పుడు అది రూ.35వేల కోట్లకు పెరిగిందని మండిపడ్డారు. పెద్ద ఎత్తున అప్పులు తెస్తున్నా.. సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని.. మరి డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయని ప్రశ్నించారు.
టీఎస్ ఐపాస్ లో ఉన్న లెక్కల ప్రకారం 2014లో రాష్ట్రానికి 174 పరిశ్రమలు వచ్చాయని.. 2015లో 1500కు పెరిగాయని, 2023లో 2600కు దూసుకెళ్లాయని చెప్పారు. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 1200 పరిశ్రమలే వచ్చాయని వివరించారు. మొత్తం గత పదేళ్లలో 25వేల పరిశ్రమలు వస్తే… పదేళ్ల సగటులో సగం పరిశ్రమలు కూడా ఈ ఏడాదిలో రాలేదని విమర్శించారు. పెట్టుబడుల్లోనూ రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్లిందన్నారు. 2015లో 28వేలకోట్ల పెట్టుబడులు వస్తే.. ఈ ఏడాది రూ.8468 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయన్నారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 2015 కంటే కూడా ఇప్పుడు పెట్టుబడులు తక్కువ వచ్చాయని సతీష్ రెడ్డి ఆరోపించారు.
పదేండ్ల సరాసరిలో 30 శాతం మాత్రమే పెట్టుబడులు వచ్చాయని.. పది నెలల దౌర్భగ్య పాలనలో తెలంగాణ పదేండ్లు వెనక్కి పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగాల కల్పనలోనూ అదే దుస్థితి ఉందన్నారు. పదేళ్లలో 18 లక్షల 60 వేల ఉద్యోగాలు వస్తే.. ఈ ఏడాది కేవలం 34 వేల ఉద్యోగాలే వచ్చాయన్నారు.
2015లో 94వేల ఉద్యోగాల జరిగిందని.. ఇప్పుడు అందులో 35 శాతం మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని.. ఇది రెయిజింగా, రివర్సింగా అని సర్కారును ప్రశ్నించారు. ఏం సాధించారని కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తూ.. సంబురాలు చేస్తున్నారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ముందుకు దూసుకెళ్లడం లేదని.. రివర్స్ గేర్ వేసిందని ఎద్దేవా చేశారు. అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రభాగాన నిలిచిన తెలంగాణను కేవలం ఏడాది కాలంలో అట్టడుగు స్థానానికి పడేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. రేవంత్ రెడ్డి అధికారమనే బండి ఎక్కి ముందుకు దూసుకెళ్తున్నానన్న భ్రమలో వేగంగా పోతున్నారని.. కానీ బండి రివర్స్ గేర్ లో ఉందనే విషయాన్ని మరిచిపోయారన్నారు.
రివర్స్ లో వేగంగా వెళ్తూ.. అన్నింటిని ఢీకొడుతూ, విధ్వంసం చేస్తూ.. వెళ్తున్నారని.. ఢికొడుతున్నప్పుడు వస్తున్న శబ్దాన్ని.. తాను నడుపుతున్న వేగంతో వస్తోందని గొప్పగా చెప్పుకుంటున్నారని.. ఒకసారి బండి ఆపి.. కిందకు దిగి చూస్తే జరిగిన విధ్వంసం ఏంటో రేవంత్ రెడ్డికి తెలుస్తుందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా బండి రివర్స్ లో ఉన్న విషయాన్ని గుర్తిస్తే.. తెలంగాణ బాగుపడుతుందని లేకపోతే మళ్లీ దశాబ్దాల క్రితం ఉన్న దుర్భర పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతుందని అన్నారు.