భారత రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలకపాత్ర పోషిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ మోడల్, కేసీఆర్ ఆలోచనలు ఈ దేశానికి అవసరమన్నారు. ఎనిమిదేండ్ల మోదీ పాలనలో హామీలు ఇవ్వడమే తప్ప ఆచరణలో సాధ్యం కాలేదన్నారు. అన్ని రంగాల్లో దేశాన్ని దివాళా తీయించారు.. ప్రపంచ దేశాల ముందు దేశ ప్రతిష్ట మంటగలిపారని ధ్వజమెత్తారు.
2014, 2019 ఎన్నికల సమయంలో, బీజేపీ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని పేర్కొన్నారు. మద్దతు ధరల పెంపు ఒక మాయ, వ్యవసాయానికి ఉపాధిహామీ అనుసంధానం, స్వామినాథన్ కమిటీ సిఫారసుల అమలు, రైతుల ఆదాయం రెట్టింపు వట్టి మోసమని మండిపడ్డారు. ఎరువుల ధరలు, పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి రైతుల నడ్డి విరిచారని నిప్పులు చెరిగారు. నోట్ల రద్దు, నల్లధనం వెనక్కి తేవడం, జీఎస్టీ అమలు వంటి విఫలయత్నాలతో దేశాన్ని దివాళా తీయించారని ధ్వజమెత్తారు. గ్యాస్ ధరలు రెండింతలు పెంచి మోదీ సామాన్యుల నడ్డి విరిచాడని కోపోద్రిక్తులయ్యారు.
ఎనిమిదేళ్లలో తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా అమలు చేస్తూ దేశానికి రోల్ మోడల్ గా నిలిపారని మంత్రి పేర్కొన్నారు. భారతదేశానికి తెలంగాణ అభివృద్ధి ఒక నమూనాగా నిలుస్తుందన్నారు. దేశ ప్రజల ఆశీస్సులతో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ కొత్త చరిత్ర సృష్టిస్తుందని నిరంజన్ రెడ్డి తేల్చిచెప్పారు.