Suryaa.co.in

Telangana

అమ్మవారి ఆశీస్సులతో అభివృద్ధి పథంలో తెలంగాణ

– దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

జోగులాంబ గద్వాల జిల్లా: శ్రీ జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని, ఆలయ అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.

మంగళవారం దేవి శరన్నవరాత్రులు సందర్భంగా అలంపూర్ లోని శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించిన మంత్రికి దేవాలయ అర్చకులు స్వాగతం పలికారు. ముందుగా శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయం సందర్శించి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. అనంతరం శ్రీ జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించిన తర్వాత, అర్చకులు అమ్మవారి ప్రసాదం, శేష వస్త్రం బహుకరించి ఆశీర్వాదాలు అందజేశారు.

తదనంతరం మంత్రి ప్రస్తుతం జరుగుతున్న ప్రసాద్ పథకం పనులను పరిశీలించారు. పథకం ప్రణాళికను మ్యాప్‌లో చూసి, ఇంకా పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పథకం పరిసరాలను కూడా తనిఖీ చేసి, పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తి పీఠమైన శ్రీ జోగులాంబ దేవి,శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. దేవీ శరన్నవరాత్రులు సందర్భంగా కళ్యాణ పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగిందని పేర్కొన్నారు. కృష్ణా, తుంగభద్ర నదుల కలయిక ఈ క్షేత్రానికి ప్రత్యేకతను ఇస్తుందని, అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ఇక్కడ నవబ్రహ్మణుల పూజల కారణంగా ప్రజల కష్టాలు, సమస్యలు తీరుతాయని, ఈ ఆలయాన్ని “దక్షిణ కైలాసం” అని కూడా పిలుస్తారని తెలిపారు. మన రాష్ట్రంలో ఇలాంటి పుణ్యక్షేత్రం ఉండటం అదృష్టమని, ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు.

టెంపుల్ టూరిజం అభివృద్ధి, ఎకో టూరిజం పురావస్తు శాఖలతో సమన్వయం చేసి, ఈ అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్రగతిని సాధించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం కేంద్రం, రాష్ట్రం నుండి కావాల్సిన నిధులు సమకూర్చే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పుష్కర్ ఘాట్ దగ్గర స్నానం కోసం మంచి ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఆలయ పరిసరాలలో పెండింగ్‌లో ఉన్న ప్రసాద్ పథకం పనులను త్వరగా పూర్తి చేస్తామని ఇందుకోసం సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామని అన్నారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నవరాత్రుల సమయంలో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆలయ ఈవోకు ఆదేశించారు. అంతకు ముందు హరిత హోటల్‌లో జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్, జిల్లా ఎస్పీ తోట శ్రీనివాస రావు పుష్పగుచ్ఛం అందజేసి, మంత్రి కి స్వాగతం పలికారు.అనంతరం మంత్రి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

LEAVE A RESPONSE