– గ్లోబల్ సమ్మిట్ లో నృత్యానికి భాగస్వామ్యం
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
భారతదేశంలోని ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నృత్య శైలి ఉంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాకతీయం ప్రత్యేకమైనదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం సాయంత్రం రవీంద్రభారతిలో పద్మశ్రీ పద్మజా రెడ్డి తో పాటు వారి శిష్య బృందం ఏర్పాటు చేసిన నృత్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై డిప్యూటీ సీఎం ప్రసంగించారు. కాకతీయానికి సంబంధించి లోతుగా అధ్యయనం చేసి పుస్తక రూపంలో తీసుకురావడమే కాదు నృత్య రూపకంగా తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచంలోనే ప్రత్యేకతను తీసుకువచ్చిన పద్మశ్రీ పద్మజా రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.
అన్ని నాటకాల్లో సాంత్వన ఉంటుంది కానీ కాకతీయలో పేరిణి నృత్యం యుద్ధానికి వెళ్లే ముందు సైనికులను ఉత్తేజితులను చేసి వారిలో శక్తిని పోగేసి యుద్ధానికి సిద్ధం చేసే సందర్భం ప్రస్ఫుటంగా నృత్య రూపంలో చూపిస్తున్న పద్మజా రెడ్డి బృందానికి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అభినందనలు అన్నారు. పద్మజా రెడ్డి శిష్యులు ఖాళీయ మర్దనం నృత్యరూపకంలో సర్పాల నృత్యం కళ్లకు కట్టినట్టు చూపించారని వారికి ఉజ్వల భవిష్యత్తు ఉందని అన్నారు. వారి శిష్య బృందం రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ డిసెంబర్ 7తో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గతంలో చేసిన పనులను చెప్పుకోవడంతోపాటు అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడేలా విజన్ డాక్యుమెంటును ఆవిష్కరిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది ఈ డాక్యుమెంట్లో వివరించబోతున్నట్లు తెలిపారు. 2047 కల్లా మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి కావలసిన ప్రణాళికను ఈనెల 8, 9 తేదీల్లో ఆవిష్కరిస్తున్నామని వివరించారు.
ఇన్ఫ్రా, ఇండస్ట్రీ, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాలజీ అన్ని అంశాలను విజయం డాక్యుమెంట్లో వివరించనున్నట్లు తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ కు ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తులతో పాటు ప్రఖ్యాత సంస్థల సీఈఓ లను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకతీయ నృత్యాన్ని ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నామని ఈ నృత్యాన్ని భాగస్వామి గా చేసే ఆలోచన ను కమిటీ పర్యవేక్షిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి జితేందర్ రెడ్డి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి యోగితా రానా తదితరులు పాల్గొన్నారు.