తెలుగుదేశం జనసేన పార్టీల మేనిఫెస్టో కమిటీ సమావేశం టీడీపీ జాతీయ కార్యాలయంలో సోమవారం జరిగింది. టీడీపీ నుండి యనమల రామకృష్ణుడు, పర్చూరి అశోక్ బాబు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్ లు పాల్గొనగా.. జనసేన తరపున ముత్తా శశిధర్, డి. వరప్రసాద్, ప్రొఫెసర్ కె. శరత్ కుమార్ లు పాల్గొన్నారు.
యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ…
ఇది కేవలం ప్రిలిమనరి మీటింగ్ మాత్రమే. గతంలో ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ’ మినీ మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. ఇందులో సూపర్ సిక్స్ అనేదానిపై ప్రచారం చేస్తున్నాం. టీడీపీ జనసేన పొత్తు కుదిరింది. మొదటి మీటింగ్ రాజమండ్రిలో పవన్, లోకేష్ లతోపాటు జాయింట్ యాక్షన్ కమిటి మీటింగ్ జరిగింది.
ఈ సమావేశంలో ఉమ్మడి మేనిఫెస్టో ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. ఉమ్మడి మేనిఫెస్టో కోసం ఒక కమిటి ఉండాలి. ఆ కమిటీలో రెండు పార్టీలకు సంబంధించిన ఆరుగురిని ఎంపిక చేయడం జరిగింది. ఇది ఫస్ట్ మీటింగ్. గతంలో టీడీపీ మినీ మేనిఫెస్టో ఇచ్చాం. టీడీపీతోపాటు జనసేన కూడా కొన్ని పాయింట్స్ ఇస్తామని ఆ పాయింట్స్ ఇస్తే యాడ్ చేస్తే బాగుంటుందని అనుకున్నాం. టీడీపీ తరపున 6 పాయింట్స్, జనసేన తరపున 6 పాయింట్స్ ఇచ్చాం. రెండు క్లబ్ చేసి డ్రాప్ మినీ మేనిఫెస్టోగా తయారు చేశాం.
పై కమిటి అప్రూవల్ కు పంపుతాం. చాలావరకు ఈ పాయింట్స్ ప్రజలకు ఉపయోగపడగలవు. సొసైటీలో అసమానతలు తొలగాలనేదే ఈ మినీ మేనిఫెస్టో ఉద్దేశం. ఆర్థిక వ్యవస్థ బాగుపడాలని, రైతులకు మేలు జరగాలని, అన్ని రంగాల్లో ప్రజలు మహాశక్తివంతులవ్వాలని భావిస్తున్నాం. అందుకే మహాశక్తి పథకం ద్వారా ‘తల్లికి వందనం’ పేరుతో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి రూ. 15,000 , అడబిడ్డ నిధి’ నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి స్త్రీకి నెలకు రూ. 1,500 ‘దీపం’ పేరుతో ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు .
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. యువగళం ద్వారా 20 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించడం, నిరుద్యోగులకు ‘యువగళం నిధి’ నుంచి నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి ఇవ్వడం, సౌభాగ్య పథం ద్వారా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు, అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో 20శాతం గరిష్టంగా రూ.10 లక్షల వరకు సబ్సిడీ ఇచ్చే విషయాన్ని జనసేన పార్టీ ప్రతిపాదించగా ఆమోదించాం. దీనిని జత చేశాం.
అన్నదాత పథకం ద్వారా ప్రతి రైతుకు మరియు కౌలు రైతుకు ఏటా రూ.20,000 ఆర్థిక సాయం చేయడం, ఆక్వా రైతులకు ప్రోత్సాహాన్ని కల్పించడం, హార్టికల్చర్ సాగుకు రాయితీలు ఇవ్వడం, పాడి రైతులకు నేరుగా ప్రోత్సాహకాలు కల్పించడం, ‘‘ ఇంటింటికీ మంచి నీరు” పథకం కింద ప్రతి ఇంటికీ రక్షిత త్రాగు నీటి కుళాయి కనెక్షన్. బీసీలకు రక్షణ చట్టం ద్వారా బీసీలకు రక్షణ కల్పించి వారికి అన్ని విధాలా అండ గా ఉండటం, సంపన్న ఆంధ్రప్రదేశ్పథకం ద్వారా అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పన్నుల, ధరల భారాన్ని, విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తూ మౌలిక వసతులను అభివృద్ధి పరచటం, రాష్ట్ర స్థూల ఉత్పత్తిని మెరుగుపరచే విధంగా చర్యలు తీసుకోవటం, పూర్ టు రిచ్ పథకం ద్వారా పేదలను సంపన్నులను చేసే పీ4(పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టనర్ షిప్), ఐదేళ్లలో కనీసం రెట్టింపు ఆదాయం. అమరావతే రాజధానిగా ప్రకటిస్తూ ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధి.
ఉచిత ఇసుక పథకాన్ని పునరుద్ధరిస్తూ.. పేదవాడి సొంతింటి కలను నెరవేర్చడం. భవన నిర్మాణ రంగాన్ని ఆదుకోవడం. కార్మిక సంక్షేమం ద్వారా కనీస వేతనాలను పెంపొందించటం, వలసలను నివారించటం వంటి పథకాలను ఈ ప్రిలిమనరీ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నాం. ఇన్ క్లోజివ్ గ్రోత్ చాలా అవసరం. పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలించాలి అనే దిశగా పయనిస్తాం. ఆర్థికపరమైన సహాయాన్నిస్తాం. పేదరికం, అసమానతలు పెరుగుతూ పోతున్నాయి. వాటిని రూపుమాపాల్సివుంది.
జనసేన తరపున ముత్తా శశిధర్ మాట్లాడుతూ…
మంచి వాతావరణంలో టీడీపీ-జనసేన మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది. వైనాట్ 175 అంటూ జగన్ రెడ్డి చెప్తుంటే.. ప్రజలు ఎందుకు వైసీపీకి 151 సీట్లు ఇచ్చామని నవ్వుకుంటున్నారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండానే మేనిఫెస్టోని అమలు చేశామని ప్రజలను మోసగించడమే కాకుండా మేనిఫెస్టో విధానాన్నే అపహస్యం చేస్తున్నారు. మహానాడులో టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలతో పాటు గత నాలుగు సంవత్సరాలుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజా పోరాటాల్లో పాల్గొన్న సమయాల్లో కొన్ని వర్గాల నుంచి, వైసీపీ ప్రభుత్వంలో నష్టపోయిన బాధితులు, పేదల ప్రజల నుంచి వచ్చిన వినతుల మేరకు జనసేన పార్టీ కూడా ఆరు ప్రతిపాదనలు చెప్పడం జరిగింది.
సంపన్న ఆంధ్రప్రదేశ్-అమరావతే రాజధాని, ఉచిత ఇసుక ద్వారా పేదలకు ఇళ్లు నిర్మించడంతో పాటు భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించడం, జనసేన సౌభాగ్యపదం ద్వారా నిరుద్యోగ యువతను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేసి ఎక్కడికక్కడ ఉద్యోగాలు కల్పించడం, వ్యవసాయాన్ని భాగ్యపదంగా తీసుకెళ్లడం ద్వారా రైతులు, కౌలు రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడం, మన ఆంధ్రప్రదేశ్-మన ఉద్యోగాలు అనే ఆరు ప్రతిపాదనల్ని ఉమ్మడి మేనిఫెస్టో కమిటీలో చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఎంతో మంది యువత ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల అన్ని వర్గాల కార్మికులు ఉపాది కోల్పోయారు.
జనసేన-టీడీపీ యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ముందుకుసాగుతాం. రణభేరి సమావేశంలో, వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ యువతకు భరోసా ఇచ్చారు. వారిని పారిశ్రామిక వేత్తలుగా తయారు చేస్తానన్నారు. పలు ప్రాంతాల్లో పరిశ్రామిక వాడలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. విశాఖ ప్రాంతంలో పారిశ్రామికవాడలు, తూ.గో, ప.గో జిల్లాల్లో పర్యాటక అభివృద్ధిని పెంపొందించడం, ఆక్వా కల్చర్, పుడ్ ఫ్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పుతామన్నారు. తిరుపతి ప్రాంతాన్ని ఐటీ హబ్‍గా చేసి రాష్ట్రంలోని యువతకు నమ్మకం కలిగించే విధంగా కార్యక్రమాలు ప్రపోజ్ చేయడం జరిగింది. వీటిని పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ కి పంపడం జరుగుతుంది.
రానున్న రోజుల్లో టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను తయారు చేసి ప్రజలకు నమ్మకం కలిగిస్తాం. రాష్ట్రంలో యువత బంగారు భవిష్యత్తుకు ధైర్యం చెప్పబొతున్నాం. అన్ని సామాజిక వర్గాలను, కలుపుకొని అందరికీ చేయూతనిచ్చే విధంగా టీడీపీ-జనసేన మేనిఫెస్టో రూపొందిస్తాం.