Suryaa.co.in

Andhra Pradesh

దావోస్‌ సదస్సు ఆహ్వానంపై తెలుగుదేశం దుష్ప్రచారం

-సదస్సుకు హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానం
-గత ఏడాది నవంబరు 25న సీఎంకి ఆహ్వానం
-సదస్సుకు హాజరు కావాలని నిర్వాహకుల విన్నపం
-గత ఏడాది కూడా డావోస్‌ సదస్సుకు ఆహ్వానం వచ్చింది
-ఆ మేరకు గత ఏడాది మే నెలలో దావోస్‌ వెళ్లి వచ్చాం
-దాదాపు రూ.1.25 లక్షల కోట్ల మేర ఒప్పందాలు చేసుకున్నాం
-విశాఖలో మార్చి నెలలో గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌
-ఆ సమ్మిట్‌ సక్సెస్‌ చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
-పలు దేశాల ఇన్వెస్టర్లకు ఆహ్వానం. అతిథులూ రానున్నారు
-దావోస్‌ వెళ్లే వారందరినీ కూడా ఇక్కడకు ఆహ్వానిస్తున్నాం
-అందుకే ఈసారి దావోస్‌ సదస్సుకు వెళ్లవద్దని నిర్ణయించాం
-గత ప్రభుత్వ హయాంలో 5సార్లు దావోస్‌ పర్యటన
-ఎక్కడా లేని విధంగా ఆర్భాటంగా ప్రచారాలు
-ఎన్నో ఒప్పందాలు చేసుకున్నట్లు గొప్పగా ప్రకటనలు
-కానీ ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు. ఇది వాస్తవం
-మీ హయాంలో వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం ఇస్తారా?
-ప్రెస్‌మీట్‌లో టీడీపీ నేతలకు మంత్రి అమర్‌నాథ్‌ సవాల్‌

దావోస్‌ నుంచి ఆహ్వానం:
దావోస్‌లో ప్రపంచ ఆర్ధిక వేదిక సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానం రాలేదని, అందుకే ఇక్కడి నుంచి ఎవరూ వెళ్లలేదని తెలుగుదేశం పార్టీ సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. సీఎంగారికి గత ఏడాది నవంబరు 25న అక్కడి నుంచి ఆహ్వానం అందింది.

రాష్ట్రంలో సుపరిపాలన:
వచ్చే మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌. దానికి దావోస్‌ నుంచే ఇక్కడికి అందరినీ రప్పించాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. సీఎంగారి సుపరిపాలన, అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో నెంబర్‌ వన్‌. అలాగే దేశంలో మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ జీడీపీ 11.43 శాతం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. దాదాపు రూ.1.50 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. గత అక్టోబరు 31 నాటికే రాష్ట్రం నుంచి దాదాపు రూ.97 వేల కోట్ల విలువైన ఎగుమతులు జరిగితే, మీరు పోల్చి చూస్తున్న తెలంగాణ నుంచి అదే సమయంలో జరిగిన ఎగుమతుల విలువ రూ.55 వేల కోట్లు. రాష్ట్రంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్షాలు బాగా కురుస్తున్నాయి. రిజర్వాయర్లు నిండుతున్నాయి. పంటలు బాగా పండుతున్నాయి. దాంతో పారిశ్రామికవేత్తలు కూడా పెట్టుబడులకు ముందుకు వస్తున్నారు. అందుకే ఆ స్థాయిలో రాష్ట్రం అభివృద్ధి చూపుతోంది.

మీ హయాంలో ఒక్కటైనా వచ్చిందా?:
చంద్రబాబు, కరువు కవల పిల్లలు అని పేరు. గత ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 వరకు ఆ ప్రభుత్వ పెద్దలు 5సార్లు దావోస్‌ వెళ్లారు. ప్రపంచ ఆర్థిక వేదికలో పలు ఒప్పందాలు చేసుకున్నారు. ఆ పర్యటనల కోసం దాదాపు రూ.80 కోట్లు ఖర్చు చేశారు. కానీ వారు చేసుకున్న ఒప్పందాల్లో కనీసం ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. ఒక్క కంపెనీ కూడా ఇక్కడికి రాలేదు. మేము గత ఏడాది మే నెలలో సీఎంగారి నేతృత్వంలో దావోస్‌ వెళ్లాం. గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులతో సహా దాదాపు రూ.1.25 లక్షల కోట్లకు ఎంఓయూలు చేసుకున్నాం. ఇప్పటికే దాదాపు రూ.35 వేల కోట్లకు సంబంధించి ఎస్‌ఐపీబీలో క్లియరెన్స్‌ కూడా ఇచ్చాం.

అంతా ఆర్భాట ప్రచారం:
కానీ మీ హయాంలో ఏం జరిగిందని చూస్తే, ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. కానీ వెళ్లిన ప్రతిసారి విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. ఇక్కడి వంటల గురించి అక్కడ గొప్పగా చెప్పుకున్నారు. చంద్రబాబు, లోకేష్‌ చాలా మందితో మాట్లాడారని అట్టహాసంగా ప్రచారం చేసుకున్నారు. చంద్రబాబు స్నానం చేయలేదని, జ్వరం వచ్చినా సమావేశాల్లో పాల్గొంటున్నారని మరో ప్రచారం. ఇలా ప్రతిదీ తామే ఏదో సాధించినట్లు చాలా ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారు.
అలా ఏమీ లేకపోయినా ఆ రకమైన ప్రచారం చేసుకున్నారు కాబట్టే, ప్రజలు మీకు బుద్ధి చెప్పారు.

తెలుగుదేశం దుష్ప్రచారం:
ప్రపంచ ఆర్థిక వేదిక నుంచి సీఎంగారికి గత ఏడాది నవంబరు 25న ఆహ్వానం అందింది. ఆ çసమావేశానికి రావాలని నిర్వాహకులు కోరారు. గత సమావేశంలో సీఎంగారు పాల్గొన్నప్పుడు పలు ఒప్పందాలు చేసుకున్నారు. అంతే కాకుండా హెల్త్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన చర్చలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ పాల్గొన్నారు. వైద్య రంగంలో రాష్ట్రంలో అమలు చేసిన సంస్కరణలను ఆయన వివరించారు. దాన్ని ప్రపంచమంతా చూసింది. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్‌ క్లినిక్స్‌ వంటివన్నీ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు పొందాయి. వాస్తవాలు ఇలా ఉంటే, ప్రభుత్వానికి ఇప్పుడు ఆహ్వానం రాలేదని తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తోంది. మా సీఎంగారిని ఒక చర్చలో పాల్గొనాలని దావోస్‌లో నిర్వాహకులు కోరారు. మరి 5సార్లు అక్కడికి వెళ్లిన చంద్రబాబును, ఒక్కసారైనా అలా మాట్లాడమని కోరారా?

అబద్దాలు. అసత్య ప్రచారాలు:
ఏమన్నా అంటే సెల్‌ఫోన్‌ కనిపెట్టింది తానే అని, తన వల్లే ఐటీ పరిశ్రమ వచ్చిందని చంద్రబాబు చెబుతారు. చంద్రబాబు హయాంలో వాస్తవాల కంటే ప్రచారమే ఎక్కువ. రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్‌ కంపెనీ ఏర్పాటు చేస్తున్నారని చంద్రబాబు ప్రకటిస్తే, దాన్ని ఆ మర్నాడే ఆ కంపెనీ స్వయంగా ఖండించింది. నిజానికి ఆనాడు ఐటీ రంగంలో విశేష చొరవ చూపింది. అభివృద్ధి చేసింది నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ. అలాగే హైటెక్‌ సిటీకి తొలుత బీజం వేసింది నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం. కానీ చంద్రబాబు అన్నీ తానే చేశానని చెబుతారు.

గతంలో కంటే ఎక్కువ పెట్టుబడులు:
ఇప్పుడు ప్రభుత్వం మీద పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి శ్వేతపత్రం డిమాండ్‌ చేశారు. గత 5 ఏళ్ల కాలంలో.. ఆనాడు కోవిడ్‌ వంటి సమస్య లేదు. అప్పుడు వచ్చిన పెట్టుబడులు, ప్రభుత్వం చేసిన ఆర్భాట ప్రచారాలు, నాలుగు పర్యాయాలు భాగస్వామ్య సదస్సులు నిర్వహణ..ఇవన్నీ చూసినా, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఏటా వచ్చిన సగటు పెట్టుబడులు రూ.11 వేల కోట్లు మాత్రమే. అదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ మూడున్నర ఏళ్లలో, ఏటా వచ్చిన సగటు పెట్టుబడి రూ.15 వేల కోట్లు. ఈ కాలంలో కోవిడ్‌ వల్ల దాదాపు రెండేళ్లు పోయాయి. అవే కాకుండా మరో రూ.1.70 లక్షల కోట్ల ప్రాజెక్టులు పైప్‌లైన్‌లో ఉన్నాయి. ఇది వాస్తవం. ఇటీవలే రూ.2 వేల కోట్లకు ఎంఓయూ. కాకినాడ వేదికగా గ్రీన్‌ ఎనర్జీ సెజ్‌ ఏర్పాటు కోసం ఒప్పందం చేసుకున్నాం.

ఇన్ని పనులు జరుగుతుంటే..:
ఇక్కడ ఇన్ని అభివృద్ధి పనులు జరుగుతుంటే దావోస్‌ సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానం రాలేదని దుష్ప్రచారం చేస్తున్నారు. విజయవాడలో ఫోర్‌ ట్వంటీ అయిన మాజీ ఎమ్మెల్యే నాపై పిచ్చి విమర్శలు చేశారు. పొరుగు రాష్ట్ర పరిశ్రమల మంత్రి దావోస్‌ పర్యటనలో ఉంటే, నేను కోడి పందాలు, రికార్డింగ్‌ డ్యాన్స్‌ల్లో పాల్గొన్నానని. అదెక్కడో ఆ ఫోర్‌ ట్వంటీ చెప్పాలి. అలాంటి పనికి మాలిన వారి విమర్శలకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మార్చి నెలలో విశాఖలో జరిగే గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌లో రాష్ట్రానికి అన్ని రంగాలలో ఇంకా పెట్టుబడులు రానున్నాయి,

మీడియా ప్రశ్నలకు సమాధానంగా..
అది వారి పాలసీ:
అబద్ధాలు చెప్పడం టీడీపీ పాలసీ. అందుకే ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు. దావోస్‌కు ఇన్విటేషన్‌ రాలేదని అర్ధం లేని విమర్శ చేస్తున్నారు. ఆహ్వానం వస్తే, ఎందుకు వెళ్లలేదని అడగొచ్చు.
గత ఏడాది మే నెలలో మేము దావోస్‌ వెళ్లినప్పుడు, మన రాష్ట్ర పెవిలియన్‌ను ప్రపంచ ఆర్థిక వేదిక సీఈఓ స్వయంగా సందర్శించారు. సీఎంగారిని కలిశారు. ఆయనతో పాటు, వేదిక బృందం సభ్యులు కూడా వచ్చారు.

ఇప్పుడు ఎందుకు పోలేదంటే..:
దావోస్‌కు ఆరు నెలల క్రితమే వెళ్లాం. మార్చి నెలలో విశాఖలో జరిగే గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌కు అందరినీ ఆహ్వానిస్తున్నాం. అందుకే మేము ఇప్పుడు దావోస్‌ వెళ్లలేదు. అలాగే కొత్త పారిశ్రామిక విధానం కూడా రూపొందిస్తున్నాం. ఇవన్నీ సమ్మిట్‌ నాటికి సిద్ధమవుతాయి అని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ వివరించారు.

LEAVE A RESPONSE