– ఆలయ భూములను వాటాలేసుకుని దోచుకుంటున్నారు
– ఏపీ బీజేపీని చంద్రబాబు పార్టీకి అద్దెకిచ్చేశారు
– ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, ఎంపీ పురందేశ్వరి ఎక్స్‌లో చేసిన పోస్టుపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్
తాడేపల్లి: చంద్రబాబు ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, ఎంపీ పురందేశ్వరి లు పనిచేస్తున్నారని మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని నాని (వెంకట్రామయ్య) మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దీనిలో భాగంగానే వారు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వైయస్ఆర్సీపీపై హిందూ వ్యతిరేక ముద్ర వేసేందుకు అసత్యలతో కూడిన పోస్టులను పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం జరిగినా, ఆలయ ఆస్తుల దోపిడీ జరిగిన గత బీజేపీ- టీడీపీ ఉమ్మడి ప్రభుత్వ హయాంలోనే జరిగాయని అన్నారు. రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని టీడీపీ కార్యకర్త ధ్వంసం చేస్తే వైయస్సార్సీపీ ఆలయంలో స్వామి వారి మూర్తులను ప్రతిష్ఠించడంతో పాటు ఆలయాన్ని నిర్మించిందని గుర్తు చేశారు. ఆనాడు అంతర్వేది రథాన్ని దహనం చేస్తే దానిపై సీబీఐ విచారణ చేయాలని కోరుతూ నాటి సీఎం వైయస్ జగన్ కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని మరిచిపోయారా అని ప్రశ్నించారు.
నేడు కూటమి పాలనలో కోర్టు ఆదేశాలను ధిక్కరించి వేల కోట్ల విలువైన ఆలయ భూములను కూటమి నేతలు పంచుకుతింటున్నారని ధ్వజమెత్తారు. ఈ దారుణాలన్నీ మాధవ్, పురందేశ్వరి కళ్ళకు కనిపించడం లేదా అని నిలదీశారు. ఇంకా ఆయనేమన్నారంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాలను ఎక్కువగా కూల్చేసినా, హిందూ మతానికి అవమానం జరిగినా తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసున్నప్పుడే జరుగుతుంది. పాపాలన్నీ చేసేది, చేయించేది, చేస్తుంటే చూస్తూ ఊరుకునేది వాళ్లే. కానీ హిందూ మతం ముసుగులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద విషం చిమ్మడమే లక్ష్యంగా బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మాజీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఒకేరోజు, ఒకే సమయానికి కూడబలుకున్నట్టుగా అక్షరం పొల్లుపోకుండా ఎక్స్‌లో పోస్టులు పెట్టారు.