-టీడీపీ కార్యకర్త సైదాపై వైసీపీ మూకల కౄరత్వం హేయం
– కింజరాపు అచ్చెన్నాయుడు
రాష్ట్రంలో వైసీపీ నేతల అరాచకాలు తాలిబాన్లనే భయపెట్టేలా తయారయ్యాయి. జగన్ రెడ్డి.. హిట్లర్, గడాఫీ లాంటి నియంతలను మించిన నియంతలా వ్యవహరిస్తుంటే.. వారి వెనకుండే ఆరాచక మూక ఉగ్రవాదుల కంటే దారుణంగా తయారయ్యారు. గుంటూరు జిల్లా, పిడుగురాళ్ళ మండలం, తుమ్మలచెరువుకు చెందిన టీడీపీ కార్యకర్త సైదాపై జరిగిన దాడి వైసీపీ అకృత్యాలకు నిలువుటద్దంగా మిగిలింది. పెళ్లికి వెళ్లి వస్తున్న సైదాను నడిరోడ్డుపై రాడ్లు, రాళ్లతో జరిగిన దాడి వైసీపీ రాక్షసత్వాన్ని కళ్లకు కడుతోంది. నాలుగు రోజుల క్రితమే 21వ తేదీన పట్టపగలు, నడిరోడ్డుపై అత్యంత కౄరంగా దాడికి చేసినా.. ఇంత వరకు పోలీసులు కనీసం కేసు నమోదు చెయ్యలేదు. పోలీసులు ఉన్నది శాంతి భద్రతలు కాపాడడానికో.. వైసీపీ నేతలకు రెడ్ కార్పెట్ వేసి దాడులు చేయించడానికో అర్ధం కావడం లేదు. నిరసనలు తెలియచేసిన వారిని, రాజ్యాంగబద్దంగా సిద్ధించే హక్కులపై ప్రశ్నించిన వారిపై అడ్డగోలుగా కేసులు పెడుతున్న పోలీసులు.. మారణాయుధాలతో తెగబడిన వారిపై కేసులు పెట్టకపోవడం సిగ్గుచేటు. దాడికి గురైన సైదాకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది. దాడి ఘటనపై తక్షణమే పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితులను అరెస్టు చేయాలి.