– తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి లోకేష్
– ప్రభుత్వ తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన వైసీపీ
అమరావతి : అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్బాణాలతో వాడివేడిగా సాగుతున్న శాసనమండలి సమావేశాల్లో మంగళవారం సంచలన పరిణామం చోటుచేసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడినందుకు ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్.డి కుమార స్వామిని అభినందించడంతో పాటు కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ఈ తీర్మానాన్ని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించాలని సభ్యులను కోరారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు పడుతున్నాయంటూ వైసీపీ సభ్యులు సభను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని, ఈ అంశంపై వందసార్లు చెప్పామని, అయినా వైసీపీ సభ్యులకు క్లారిటీ లేదని నిలదీశారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని వారే చెప్పి.. మళ్లీ సభను వారే తప్పదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ కెపాసిటీని దాదాపు 80 శాతానికి తీసుకువచ్చాం. ఐదేళ్లలో వైసీపీ చేసిందేమీ లేదు. వైసీపీ హయాంలో ఉత్పత్తి సామర్థ్యం 48శాతానికి పడిపోయింది. 25వేల కోట్ల అప్పులు తేలాయి. మీరా మాట్లాడేది? సొంత కేసుల గురించి మేం ఢిల్లీ వెళ్లలేదు. కేంద్రాన్ని భయపెట్టాలని, మద్దతు ఉపసంహరించాలని అడుగుతున్నారు.
దేశ ప్రయోజనాల కోసం మేం ఎన్డీయేకు బేషరతుగా మద్దతు ఇస్తున్నాం. కేంద్రంతో గొడవ పెట్టుకోం, మేం చర్చిస్తాం, మాట్లాడతాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. తాను ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ సభ్యులు ఆమోదం తెలుపుతున్నారా, లేదా వ్యతిరేకిస్తున్నారా అని మంత్రి సూటిగా ప్రశ్నించారు.
ప్రభుత్వ తీర్మానానికి మద్దతు తెలిపిన వైసీపీ
మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు తెలిపింది. మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఎవరు ఏ ప్రయత్నం చేసినా వైసీపీ సహకరిస్తుంది. సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని అన్నారు.
వైసీపీ తీర్మానం అసందర్భంగా ఉంది
మండలిలో వైసీపీ పక్షనేత బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టిన తీర్మానం అసందర్భంగా ఉందని, ఇప్పటికే మంత్రి తాము ఏం చేస్తున్నామో స్పష్టంగా చెప్పారని అధికారపక్ష సభ్యులు అభిప్రాయపడ్డారు. మంత్రి లోకేష్ కలుగజేసుకుని.. అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనే లేదు, ఇక ఉపసంహరణ ఎక్కడ? స్టీల్ ప్లాంట్ ను ఇప్పటికే రివైవ్ చేశాం.
వైసీపీ తీసుకువచ్చిన తీర్మానం అసందర్భంగా ఉంది. ఆరు నెలల ముందు అయితే తీర్మానం రిలవెంట్ గా ఉండేది. ఆరు నెలల ముందు డ్రాఫ్ట్ చేసిన కాపీని ఇప్పుడు తీసుకువచ్చారు. ఇది ఇప్పటికే మేం చేసేశామన్నారు. దీనిపై బొత్స స్పందిస్తూ.. తమ తీర్మానాన్ని కూడా ఆమోదించాలని, లేదంటే డివిజన్ కోరాలన్నారు. దీనిపై మంత్రి పయ్యావుల కేశవ్ స్పందిస్తూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ పై మంత్రి తాము ఏం చేస్తున్నామో ఇప్పటికే స్పష్టంగా చెప్పారని, వైసీపీ తీర్మానాన్ని ఉపసంహరించుకుంటారా లేదా అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
ఉర్సా కంపెనీకి రూపాయికే ఎకరం భూమి కట్టబెట్టారని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా
పరిశ్రమలకు విలువైన భూములు ధారాదత్తం చేస్తున్నారంటూ మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన దుష్ప్రచారాన్ని మంత్రి లోకేషే సమర్థంగా తిప్పికొట్టారు. విశాఖలో ఉర్సా కంపెనీకి రూపాయికే ఎకరం భూమి కట్టబెట్టారని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
టీసీఎస్, కాగ్నిజెంట్ పరిశ్రమల ఏర్పాటుద్వారా ఒక్కో కంపెనీ 25వేల ఉద్యోగాలు కల్పిస్తుంది. రూ.15వేల కోట్ల ఎకనామిక్ యాక్టివిటీని క్రియేట్ అవుతుంది. ఈ రెండు కంపెనీలకు మాత్రమే రూపాయికు భూములు ఇచ్చాం. ఇక ఏ కంపెనీకి ఇవ్వలేదు. ఈ రెండు కంపెనీలకు భూములు ఇవ్వొచ్చా, ఇవ్వకూడదా బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇవ్వాలన్నారు.
తాము అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వం పరిశ్రమలకు కేటాయించిన భూములను రద్దు చేస్తామంటూ వైసీపీ బెదిరిస్తోందని, ఈ విషయాన్ని టీసీఎస్ అడుగుతోందని మంత్రి లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై బొత్స క్లారిటీ ఇవ్వాలన్నారు.