– కుల గణన రాజ్యాంగబద్ధంగా జరిగిన ప్రక్రియ కాదు
-కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదు
– కానీ అది సైన్టిఫిక్గా, రాజ్యాంగబద్ధంగా జరగాలి
– స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకే పెద్దపీట
– బిజెపి మాత్రమే బీసీల రియల్ ఫ్రెండ్
– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఓబీసీ మోర్చా సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు
హైదరాబాద్: నిజంగా చిత్తశుద్ధితో బీసీల సంక్షేమం కోసం పనిచేస్తున్నది ప్రధాని నరేంద్ర మోదీ. కేబినెట్లో 27% మంది బీసీ మంత్రులు ఉన్నారు. బీసీలకు పెద్దపీట వేసిన ఘనత మోదీ దే. బీసీ కమిషన్ను తీసుకువచ్చింది కూడా మోదీ ప్రభుత్వమే. మోదీ స్వయంగా బీసీ. కానీ రాహుల్ గాంధీ మాత్రం బీసీని అవమానపరిచేలా “కన్వర్టెడ్ బీసీ” అంటూ విమర్శించడం దారుణం.
బీసీ జాబితాలు రాష్ట్రానికొకటిగా ఉండవు. రాష్ట్రాన్నిబట్టి జాబితాలు మారుతాయి. ఉదాహరణకు లంబాడాలు మన రాష్ట్రంలో ఎస్టీలు. కానీ మహారాష్ట్రలో బీసీలు. నేను ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో కేసీఆర్ ఈ కమిషన్ను ఏర్పాటు చేసినప్పటికీ, దానికి అవసరమైన నిధులు మాత్రం కేటాయించలేదు. కమిషన్కు కేవలం హోదా ఇచ్చారు గానీ, పనితీరుకు అవసరమైన ఆర్థిక మద్దతు కల్పించలేదు.
ఇక కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన విషయానికొస్తే, అది రాజ్యాంగబద్ధంగా జరిగిన ప్రక్రియ కాదు, ఆ గణన కేవలం గణాంకాల సేకరణ మాత్రమే. ఎందుకంటే, ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థల ద్వారా కాకుండా, ప్రభుత్వమే స్వయంగా నిర్వహించిన ప్రక్రియ. కులగణనకు సంబంధించి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ బయట పెట్టకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మండలాల స్థాయిలో కులగణన చేయలేదని అనేకమంది టీచర్లు చెబుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ వివరాలను బయటపెట్టే ఉద్దేశం కనబడడం లేదు. కులగణనను అధికారికంగా చేయాలంటే, అది రాజ్యాంగబద్ధమైన సంస్థలతో, సరైన డేటా ద్వారా చేయాల్సి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కులగణనకు వ్యతిరేకం కాదు. కానీ అది సైన్టిఫిక్గా, రాజ్యాంగబద్ధంగా జరగాలి.
నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రేపు జరగబోయే జనాభా గణనలో కులగణనను అధికారికంగా తీసుకురాబోతున్నది. భారత్లో చివరిసారిగా బ్రిటిష్ ప్రభుత్వం 1931లోనే కులగణన నిర్వహించింది.
గతంలో జనాభా గణన కరోనా కారణంగా వాయిదా పడగా, రానున్న కాలంలో నిర్వహించే జనాభా గణనను భారత ప్రభుత్వం నిఘా అధికార సంస్థ అయిన రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (RGI) ఆధ్వర్యంలో నిర్వహించనుంది. ఇది రాజ్యాంగబద్ధమైన, చట్టపరంగా ఏర్పాటైన సంస్థ.
ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న కీలక నిర్ణయం మేరకు అధికారికంగా జనగణనలో భాగంగా కులగణనను చేర్చడం వల్ల దేశంలోని వివిధ సామాజిక వర్గాల గణాంకాలు స్పష్టంగా వెలుగులోకి రానున్నాయి.
ఈ లెక్కల ఆధారంగా ఎవరు అభివృద్ధిలో ఉన్నారు? ఎవరు ఇంకా వెనుకపడ్డారు? ఎవరికెలా, ఎలాంటి సంక్షేమ పథకాలు అవసరమో నిర్ణయించడానికి స్పష్టమైన మార్గం లభించే అవకాశం ఉంది.
ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలపై గమనిస్తే.. విశ్వకర్మ యోజన, ముద్రా రుణాలు, స్టార్టప్ ఇండియా వంటి వివిధ పథకాలలో అధికంగా లబ్దిదారులు బీసీలే కావడం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వాస్తవం మోదీ ప్రభుత్వం బీసీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్న విషయాన్ని నిరూపిస్తుంది.
ఈ నేపథ్యంలో కులగణనపై బీజేపీ వైఖరి.. సాంకేతికంగా ప్రామాణికమైనది, రాజ్యాంగబద్ధమైన విధానంలో ఆధారితమైనది, మరియు నిర్దిష్ట గణాంకాల ఆధారంగా సంక్షేమాన్ని సరైనదిశగా మలచే దిశగా ఉంది. భారతీయ జనతా పార్టీ ఓబీసీల సంక్షేమం పట్ల పూర్తి నిబద్ధతతో ముందుకెళ్తోంది. దేశవ్యాప్తంగా ఓబీసీలు భారతీయ జనతా పార్టీతో ఉన్నారు.
ప్రజల్లో బిజెపి పై పెరుగుతున్న ఆదరణను, నమ్మకాన్ని చూసి ఓబీసీలను బిజెపి నుంచి వేరుచేయాలనే కుట్రలకు కాంగ్రెస్ పార్టీ తెరతీసింది. గతంలో ఎస్సీలకు రిజర్వేషన్ తొలగిస్తారన్నదానిపై తప్పుడు ప్రచారానికి దిగినట్లే, ఇప్పుడు ఓబీసీల విషయంలోనూ అదే విధంగా వికృత రాజకీయం చేస్తోంది.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రిజర్వేషన్లు మారవు, బలపడతాయని స్పష్టంగా ప్రకటించారు. అయినా కాంగ్రెస్ నాయకులు బీసీల్లో అపోహలు కలిగించేలా వ్యవహరిస్తున్నారు. మతపరమైన కోణంలో ముస్లింలకు రిజర్వేషన్ కల్పించాలన్న కాంగ్రెస్ చేస్తున్న కుట్రను బిజెపి వ్యతిరేకిస్తోంది.
ఓబీసీలకు అన్యాయం జరగకుండా, వారి హక్కులను కాపాడేందుకు బిజెపి ముందుంటుందని అనేకసార్లు స్పష్టం చేయడం జరిగింది. రానున్న స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకే పెద్దపీట వేస్తాం.
MC ఎన్నికల సందర్భంగా బీసీలకు 50 డివిజన్లు కేటాయించామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాటిలో సుమారు 35 డివిజన్లలో బీసీల స్థానంలో ముస్లింలే గెలిచారు. ఈ పరిణామంతో గౌడ్, యాదవ, గంగపుత్ర వంటి బీసీ సామాజిక వర్గాలకు అసలు న్యాయం జరగలేదు.
గత ప్రభుత్వం బీసీలకు కేటాయించిన స్థానాలను మతపరమైన ఓటు బ్యాంకు ప్రయోజనం కోసం వాడుకుంది. ఇది బీసీల పట్ల ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యానికి, వారికి చేసిన అన్యాయానికి స్పష్టమైన ఉదాహరణ.
ప్రస్తుతం ముస్లింలకు 4% రిజర్వేషన్ విద్యా మరియు ఉద్యోగ రంగాల్లో అమలవుతోంది. అయితే ఈ రిజర్వేషన్లు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4), 16(4) ప్రకారమే చెల్లుబాటు కావాలి. కానీ ముస్లిం మైనారిటీ స్కూళ్లు, మదర్సాలు ప్రభుత్వ నియమాలకు అతీతంగా నడవడం రాజ్యాంగబద్ధంగా సమర్థించదగిన విషయం కాదు. దీనిని EBC పేరుతో ప్రజలను తప్పుదారి పట్టిస్తూ, మతపరమైన ప్రాధాన్యత ఇవ్వాలనే కుట్ర జరుగుతోంది.
బీసీ రిజర్వేషన్లను ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు ఏ మాత్రం ముప్పు లేకుండా, అదనంగా 10% EWS రిజర్వేషన్ను మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది. బీసీల పక్షాన బిజెపి మాత్రమే నిలుస్తోంది. కాబట్టి భారతీయ జనతా పార్టీని బీసీల నుంచి వేరుచేయడానికి కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోంది. దీన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి.
ఇప్పటి వరకు నరేంద్ర మోదీ బీసీలకు గౌరవం కలిగించే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దత్తాత్రేయ ని గవర్నర్గా నియమించారు. డాక్టర్ కె. లక్ష్మణ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అలాగే ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ బీసీలకు మంత్రి పదవులు, గవర్నర్ హోదాలను ఇచ్చింది.
మరి కాంగ్రెస్ పార్టీ ఏమిచేసింది? ఎన్నికల ముందు ముఖ్యమంత్రి స్వయంగా బీసీలకు హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీలకు సంబంధించిన వీడియోలు బయటపెడితే, ఆయన అసలైన బండారం బయటపడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుకే బీసీల సంక్షేమం గురించి మాట్లాడుతారు. కానీ చేతల్లో మాత్రం ఏమాత్రం నిబద్ధత, చిత్తశుద్ధి లేదు. కేవలం యాక్టింగ్ చేస్తున్నారు. ఆ నటనకే ఇస్తారు ఆస్కార్ అవార్డు.
రాహుల్ గాంధీ , ఆయన నేతృత్వంలోని టీం, బీసీల సంక్షేమం పేరుతో చేస్తున్నది కూడా ఓ “నాటకం”. ఇది బీసీలకు వెన్నుపోటు పొడవడమే. హైదరాబాద్ లో తలపెట్టిన బీసీ సమ్మేళనానికి ప్రతి ఒక్కరూ తప్పకుండా హాజరవ్వాలని మనవి చేస్తున్నాను. బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధులంతా రావాలని కోరుతున్నాను.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం ఇద్దరినే కేబినెట్లోకి తీసుకోవడం ద్వారా వారి నిజమైన బీసీ ద్రోహ స్వభావం బయటపడుతోంది. బిజెపి మాత్రమే బీసీల రియల్ ఫ్రెండ్. బీసీలకు సంక్షేమం గురించి, వారి అభివృద్ధి గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీయే. అందుకే బీసీల అందరి ఆశీర్వాదం, సహకారం కావాలి.
బీసీ వర్గాల్లో విశ్వకర్మ వర్గానికి చెందిన పెద్దలు నన్ను కలిసి తమ సమస్యలు చెప్పారు. గీత కార్మికులకు కూడా అనేక సమస్యలు ఉన్నాయి, పోలీసుల వేధింపులు ఎదురవుతున్నాయి. అమాయకమైన స్వర్ణకారులను లాఠీచార్జ్ చేస్తూ వేధిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులకు రాజకీయ ప్రయోజనం తప్ప, బీసీల సంక్షేమంపై చిత్తశుద్ధి లేదు.
బిజెపి మాత్రమే బీసీల అభివృద్ధి కోసం ఆలోచిస్తుంది. బిజెపి దేశం కోసం పని చేస్తుంది. బిసీలకు పెద్దపీట వేసేది బిజెపి మాత్రమే. అందుకే ఈరోజు ఓబీసీలంతా భారతీయ జనతా పార్టీతో ఉన్నారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బిజెపి గెలవాలంటే బీసీలంతా కీలకపాత్ర పోషించాలని కోరుతున్నాను.