రాజకీయాలు చాలా చిత్రం గా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే మరీ చిత్ర విచిత్రం గా మెలికలు తిరుగుతుంటూ…. లాజిక్ కు కూడా అందకుండా…..నీరు ఎటు పల్లం గా ఉంటే అటు పరుగెత్తినట్టుగా పరుగులు దీస్తూ ఉంటాయి . “ఆర్నీ ….” అనుకుంటూ ఆశ్చర్యపోవడం జనం వంతు . తెలుగు దేశం పార్టీ …. ఇప్పుడు బీజేపీ తో కలిసి ప్రయాణం చేస్తున్నది కదా ! బీజేపీ అంటే …. . ఆంధ్ర బీజేపీ తోనే తెలుగు దేశం కు ఫ్రెండ్ షిప్పు . తెలంగాణ బీజేపీ తో కాదు . తెలంగాణ బీజేపీ అయితే , తెలుగు దేశం ను దగ్గరకు కూడా రానివ్వదు .
గమ్మత్తు ఏంటంటే ; తెలుగు దేశం పుట్టిందే హైదరాబాద్ లో . అంటే, తెలంగాణ లో.తెలుగుదేశం ముఖ్య నాయకుల నివాసాలు అన్నీ ఉండేది హైదరాబాదులోనే. వారి ఆస్తిపాస్తులు , మంచీ చెడ్డా మొత్తం దుకాణాలన్నీ ఉండేది హైదరాబాదు లోనే. యవ్వారాలన్నీ హైదరాబాద్ లోనే. రాజకీయ యాపారాలు, . కలెక్షన్లు మాత్రం ఆంధ్ర లో. అందుకనేమో , టీడీపీ వాళ్ళతో ….కలిసి కాఫీ తాగినా “తెలంగాణ సెంటిమెంట్ “ ఊరుకోదేమోనని తెలంగాణా బీజేపీ నేతలకు అనుమానం . అనుమానం ఏమిటిలే…..ఏకం గా భయమే . మరి 2018 లో తెలుగుదేశం ను దగ్గరకు తీసిన కాంగ్రెస్ బతుకు ….. బస్ స్టాండ్ అయిపోయింది . అధికారం లోకి రావలసిన పార్టీ అడవులు బట్టి పోయింది. అప్పుడు బీజేపీ కి టాటా చీరియో….బై బై చెప్పేసి ఉన్న టీడీపీ ; కాంగ్రెస్ తో చెట్టాపట్టాలు వేసుకు తిరిగేది .
ఢిల్లీ లో విమానాశ్రయం నుంచి చంద్రబాబు నాయుడు…. నేరుగా రాహుల్ గాంధీ ఇంటికి వెళ్ళేవారు. అంత రాహుల్ గాంధీ కూడా గేటు బయటకు వచ్చి, బాబును లోపలికి తోడ్కొని వెళ్ళేవారు. మళ్లీ గేటు వరకు వచ్చి వీడ్కోలు చెప్పేవారు. అక్కడ , ఢిల్లీ లో రాహుల్ గాంధీకి జలుబు చేస్తే, ఇక్కడ ఆంధ్ర లో టీడీపీ జలుబు మాత్రలు మింగేసేంత ఫ్రెండ్ షిప్పు లాగా రెండు పార్టీలూ ….నెయ్యి- డాల్డా లా కలిసి మెలిసి రాజకీయాలు చేశాయి . వేసవి కాలం లో భూగర్భ జలాలు అడుగంటి పోయే రీతిలో …. కేసీఆర్ ప్రతిష్ట 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అడుగంటి పోయిం దంటూ మీడియా లో ఒకటే రివ్యూ లు . తెలంగాణ శాసనసభలోని 119 స్థానాలలో …. కేసీఆర్ పార్టీ కి ….ఓ పందొమ్మిది ఇరవై సీట్లు వస్తే గొప్ప అనే విశ్లేషణలు కూడా వెలువడ్డాయి .
అయితే ; చంద్రబాబు నాయుడు తెలంగాణ లో కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారం లోకి దిగాలనుకున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ విజయానికి చేరువలో ఉన్నదని, ఓ చెయ్యేస్తే సరిపోతుందని చంద్రబాబు నాయుడు భావించి ఉంటారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ఉన్నట్టయితే…..; క్రెడిట్ మొత్తం చంద్రబాబు ఖాతాలో జమ అయ్యి ఉండేది. కాంగ్రెస్ వాళ్ళది గానీ, రాహుల్ గాంధీది గానీ ఏమీ లేదని ; చంద్రబాబు ప్రచారం చేసి పెట్టడం వల్లే గెలిచామని కాంగ్రెస్ వాళ్ళే డప్పు వేసుకుంటూ తిరిగేవారు. నిజానికి చంద్రబాబు సభలకు జనం పోటెత్తారు . ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన శ్రీమతి లాటి సీనియర్ నాయకులు కూడా చంద్రబాబు సభలలో …. చేతులు కట్టుకుని వేదికలపై వినమ్రంగా నిలబడ్డారు . ఏమి జనం …ఏమి జనం అన్నట్టుగా విరగబడ్డారు . “చంద్రబాబు దయవల్ల మనం తెలంగాణ లో అధికారం లోకి వస్తున్నాం “ అనుకుంటూ ఢిల్లీ లో రాహుల్ గాంధీ , తెలంగాణా లో కాంగ్రెస్ వాదులు చంకలు గుద్దుకున్నారు . తీరా ఫలితాలు వచ్చాక చూస్తే ; టీఆర్ ఎస్ కు వస్తాయని అంచనాలు వేసిన …..; 19 స్థానాలు కాంగ్రెస్ కు వచ్చాయి .
దాంతో …. టీడీపీ తో ఫ్రెండ్ షిప్ కు కాంగ్రెస్ ఓ నమస్కారం పెట్టేసింది . ఆ ఎన్నికల్లో టీడీపీ కి రెండు సీట్లు వచ్చాయి . టీడీపీ కూడా కాంగ్రెస్ ఊసు ఎత్తడం మానేసింది. స్వంతంగా పోటీ చేస్తే , అధికారం లోకి వచ్చి ఉండే వారమని ఎన్నికలయ్యాక అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ల నీరు కుక్కు కున్నారు. కాంగ్రెస్ గెలిచేదాకా గెడ్డం కూడా గీయనని ఆయన 2018 ఎన్నికలకు ముందు భీష్మ ప్రతిజ్ఞ ఒకటి చేశారు . 2018 ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు పై ఆయనలో అంత ధీమా ఉండేది . చంద్రబాబు తెలంగాణ ఎన్నికల ప్రవేశం తో ఉత్తంకుమార్ రెడ్డి ధీమా కాస్తా సింగపూర్ వెళ్లిపోయింది . అందుకే , ఇప్పుడు తెలుగుదేశం ను తెలంగాణ బీజేపీ దగ్గరకు రానివ్వడం లేదు .
అసలు టీడీపీ ప్రస్తావన కూడా తేవడం లేదు. “నేను సాయం పట్టనా?”అని బాబు కూడా అనడం లేదు ….. రమ్మని వారూఅడగరు.మరి ఇద్దరూ ఎన్ డీ ఏ కదా అంటే …. ; “కాదన్నది ఎవరు ” అంటూ ఓ తెలంగాణ బీజేపీ నేత హాయిగా నవ్వేశారు . అయితే ; టీ.బీజేపీ పలకరించక పోయినంత మాత్రాన , చంద్రబాబు కు వచ్చిన నష్టం ఏమీ లేదు . ఎన్ డీ ఏ కి బద్ధ శత్రువైన ‘ఇండియా’ గ్రూప్ లో ముఖ్యమైన కాంగ్రెస్ పార్టీ కి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … చంద్రబాబును అక్కున చేర్చుకుంటున్నారు . చంద్రబాబే తన రాజకీయ గురువు అని ఆయన… అసెంబ్లీ లోను, బయటా ఎలుగెత్తి చాటడానికి నిముషం కూడా సందేహించడం లేదు , వెనుకాడడం లేదు . ఇద్దరూ కలిసి సభలు -సమావేశాల్లో పాల్గొంటారు .
ఒకరిని ఒకరు అభినందించుకుంటారు . బీజేపీ వారేమో – తమ ఎన్ డీ ఏ లో ముఖ్య భాగస్వామి అయిన చంద్రబాబు వైపు కన్నెత్తి కూడా చూడరు . మొన్న జరిగిన జూబిలీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో …. జూబిలీ హిల్స్ నియోజక వర్గ పరిధిలోని చంద్రబాబు అభిమానులు వేలల్లో ఉన్నారు. వారంతా మూకుమ్మడిగా కాంగ్రెస్ కు వేశారు గానీ ; బీజేపీ కి వేయలేదు (ట). బిజెపి కి వేయమని బాబు కూడా పిలుపు ఇవ్వలేదు . అలాగే , ఎన్ డీ ఏ లో మరో ముఖ్యనాయకుడైన పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడైనా ఎన్ డీ ఏ నాయకుడే గానీ, హైదరాబాద్ లో కాదు .
బీజేపీ కి అత్యంత ఇష్టమైన సనాతన నినాదాలను ప్రతిబింబించే వస్త్ర ధారణలు, ధర్మ పరిరక్షణ లో భాగంగా దేవాలయాలకు వెళ్లే మెట్ల మార్గాలను నీటితో శుద్ధి చేయడాలు, బీజేపీని తలపించే రీతిలో ఆహార్యాలు, నుదుటున.. జెయింట్ సైజు కుంకుమ బొట్టు తో… సనాతన ధర్మ పరిరక్షణకు తాను చేయగలిగిందంతా చేస్తుంటారు. ఈ కృషిలో భాగం గా ఆయన తమిళనాడు వెడతారు, కర్ణాటక వెడతారు, అవసరం పడితే కేరళ కూడా వెడతారు. కానీ, తన…. తన సోదర, బంధు మిత్రుల ఆస్తులు, ఫారం హౌస్ లు లెక్కకు మించి ఉన్న ఆర్థిక ప్రయోజనాలు ఉన్న తెలంగాణ లో బీజేపీ తరఫున ప్రచారానికి మాత్రం వెళ్ళరు. బీజేపీ వాళ్ళే పిలవరు….; వచ్చే వచ్చే ఓట్లు కూడా మొహం చాటేస్తాయేమో అని.
గతం లో జరిగిన హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భం గా కూడా మొక్కుబడిగా.. ఏదో ఫార్మాలిటీ గా ఆయనను టీ. బీజేపీ నేతలు ఇంటికి వెళ్లి పిలిచారు కానీ ; ఈ సారి ఆ “ఫార్మాలిటీ”ని కూడా వారు పట్టించుకోలేదు .అందుకని, మొన్న జరిగిన జూబిలీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో పవన్ కళ్యాణ్… ఎన్ డీ ఏ లో తోటి రాజకీయ పక్షమైన బీజేపీ తరఫున ప్రచారానికి వెళ్ళలేదు. ఈ ఈక్వేషన్లు, కూడికలు…. తీసివేతలు చూసిన వారికి, అసలు ఈ పార్టీలకు సిద్ధాంత రాద్దాంతాలతో పని ఏమీ లేదేమో అన్న భావన కలగడం సహజం. రాజకీయ విలువలు అనే ప్రశ్నేలేదు. పవర్, క్యాష్ & క్యారీ,పరస్పర అవసరం ఆధారిత రాజకీయాల సీజన్ నడుస్తున్నట్టు ఉంది. అలాక్కానివ్వండి.
– భోగాది వేంకట రాయుడు
