– జగన్ వద్దకు వెళ్లకుండా ఆపేసిన పోలీసులు
-ఆగ్రహంతో వెనక్కి వెళ్లిన మాజీ మంత్రి బాలినేని
– ఆయనను అనుసరించిన అనుచరులు
– విషయం తెలిసి బాలినేనిని వెనక్కి పిలిపించిన జగన్
– అసంతృప్తితోనే సభకు హాజరైన బాలినేని
– అవమానంపై భగ్గుమంటున్న బాలినేని అనుచరవర్గం
– బాలినేనికే విలువ లేకపోతే ఇక మా సంగతేమిటంటున్న వైసీపీ నేతలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆయన సీఎం జగన్‌కు దగ్గరి బంధువు. అంతకుమించి జగన్ క్యాబినెట్‌లో కీలక శాఖలు నిర్వహించిన మాజీ మంత్రి. ఆ జిల్లాలో ఆయన చెప్పిందే వేదం. చేసిందే శాసనం. అలాంటి పలుకుబడి ఉన్న నేతను, సీఎం హెలిప్యాడ్ దగ్గరకు వెళ్లకుండా పోలీసులు నిలిపివేశారు. అంతే.. ఆయనకు ఒళ్లు మండింది. ఆగ్రహించిన ఆయన, తన అనుచరులతో పీఛేముడ్ అని వెళ్లిపోయారు.
ఆ మాజీ మంత్రి పేరు బాలినేని శ్రీనివాసరెడ్డి. ప్రకాశం జిల్లాలో మకుటం లేని మంత్రి. మాస్ లీడర్. ఆయనకంటూ సొంత వర్గం ఉంది. ఇతర పార్టీ నేతలూ ఆయనతో సత్సంబంధాలు నెరుపుతుంటారు. శీనన్న దగ్గరికి వెళితే ఏ పనయినా అయిపోతుందన్న ఒక నమ్మకం ఆ జిల్లా ప్రజలకు ఉంది. ఆ విధంగా ఆయన అడిగిన వారికి కాదనకుండా పనులు చేసి పెడుతుంటారు. హోదాలు, ఇతర భేషజం, అహంకారం ప్రదర్శించరు.
పేరుకు ఇద్దరు మంత్రులున్నా పెత్తనమంతా ఆయనదే. అలాంటి బాలినేనికి దారుణమైన అవమానం ఎదురయింది. సీఎం జగన్ మార్కాపురం పర్యటనకు వెళ్లిన బాలినేనిని, పోలీసులు హెలిప్యాడ్ వద్దనే ఆపివేశారు. వాహనం పక్కనబెట్టి నడిచివెళ్లాలన్న పోలీసుల సూచనపై, బాలినేని అగ్గిరాముడయ్యారు. అనుచరుల ముందు జరిగిన అవమానం తట్టుకోలేక, ఒంగోలు మేయర్ సహా.. అందరితో కలసి వెనక్కి వెళ్లిపోయారు.
ఇది మీడియాలో గుప్పుమంది. బాలినేని వంటి అగ్రనేతకు జరిగిన అవమానంపై వైసీపీ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమయింది. బాలినేని వంటి అగ్రనేతకే మర్యాద లేకపోతే, ఇక తమ సంగతేమిటన్న చర్చ మొదలయింది. ప్రధానంగా ప్రకాశం జిల్లా వైసీపీ వర్గాల్లో, ఇది చర్చనీయాంశమయింది. జిల్లాకు సంబంధించి.. నాయకులకు ఏ సమస్య వచ్చినా ముందు వెళ్లేది బాలినేని ఇంటికే. వారిని ఆయన జగన్ వద్దకు తీసుకువెళ్లి, సమస్య పరిష్కరిస్తుంటారు. చివరాఖరకు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డికి.. ఎంపీ టికెట్ రాకుండా అడ్డుపడిన బాలినేనికి, ఇప్పుడు సీఎం కార్యక్రమంలో పోలీసుల నుంచి అడ్డంకులు ఎదురుకావడంపై, పార్టీ వర్గాల్లో విస్మయం వ్యక్తమయింది.
ఇది బాలినేనిని సీఎం వద్ద తగ్గిన పలుకుబడికి నిదర్శనమన్న చర్చ మొదలయింది. మంత్రి పదవి నుంచి తొలగించటంతో, ఇప్పటికే అసంతృప్తితో రగిలిపోతున్న బాలినేనికి.. తాజాగా ఎదురయిన అవమానపర్వం, ఆయన అనుచరులకు ఆగ్రహం కలిగిస్తోంది.
అయితే.. తన మామ బాలినేనిని పోలీసులు నిలిపివేయడం, అందుకు ఆగ్రహించిన బాలినేని అనుచరులతో కలసి.. వెనక్కి వెళ్లిపోయిన సమాచారం తెలుసుకున్న సీఎం జగన్.. వెంటనే బాలినేనికి ఫోన్ చేసి పిలిపించారు. దానితో మెత్తబడ్డ బాలినేని.. తిరిగి తన అనుచరులతో కలసి మార్కాపురం చేరుకుని, సీఎంతో కలసి బటన్ నొక్కి, ఫొటోలకు ఫోజులిచ్చారు. అయితే.. బాలినేని నిజంగా మనస్ఫూర్తిగా వెనక్కి వచ్చారా? లేక అసంతృప్తితోనే వేదిక ఎక్కారా? అన్నదే అనుచరవర్గానికి అర్ధం కాకుండా ఉంది.