Suryaa.co.in

Editorial

దటీజ్… నాయుడు!

-పొత్తుతో రాష్ట్రానికి ‘విత్త’నం
-బడ్జెట్‌పై పొత్తు ప్రభావం
-ఏపీని చూసి కుళ్లుకుంటున్న ఇతర రాష్ట్రాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యూహం మామూలుగా ఉండదు. సంక్షోభంలోనే అవకాశాలు వెతుక్కునే నైజం ఆయనది. గత ఎన్నికల ముందు రాష్ట్రంలో కనీసబలం లేని బీజేపీతో పొత్తు వల్ల నష్టమని చాలామంది టీడీపీ సీనియర్లు వాదించారు. ఆ పార్టీతో కలిస్తే మునిగిపోతామని చంద్రబాబుకు సలహాలిచ్చే చాలామంది మేధావులు హెచ్చరించారు. కొందరు మీడియా అధినేతలు, బాబు చుట్టూ చేరిన వ్యూహకర్తలు కూడా బీజేపీతో పొత్తు వద్దని సలహాలిచ్చారు. నిజానికి గతంలో బీజేపీతో పొత్తు విచ్ఛిన్నానికి-దానితో టీడీపీ ఓటమికి వారే పరోక్షంగా కారణమయ్యారు.

కానీ బాబు లెక్కలు వేరు. అందులో ఒకటి ఎన్నికలు నడిపించేందుకు కేంద్ర దన్ను ఒకటయితే, గెలిచిన తర్వాత దివాళా తీసిన రాష్ట్రాన్ని ఆర్ధికంగా గట్టెక్కించాలన్నా, ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నా కేంద్ర ‘విత్త’నం అనివార్యం. ఈ కూడికలు-తీసివేతలు లెక్కలు వేసిన తర్వాతనే.. ఎవరి సలహాలు పట్టించుకోకుండా బీజేపీతో పొత్తును ఖరారు చేశారు.

ఇప్పుడు బడ్జెట్‌లో బాబు లెక్కలే నిజమయ్యాయి. పొత్తు ఫలాలు అందుకోవడం ఆరంభమయిందన్న సంకేతాలు బడ్జెట్‌తోనే మొదలయ్యాయి. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు చూసిన ఇతర రాష్ట్రాలు కుళ్లుకుంటున్న పరిస్థితి. కేవలం టీడీపీ ఎన్డీయే భాగస్వామి అయినందుకే ఏపీకి నిధుల వరద పారించి, తమకు మొండిచేయి చూపారంటూ ఎన్డీయేతర రాష్ట్రాలు ఈర్ష్యపడుతున్నాయంటే, చంద్రబాబు పొత్తు రాజకీయం సత్వర ఫలితాలిస్తున్నట్లు స్పష్టమవుతూనే ఉంది.

అమరావతి అభివృద్ధికి 15 వేల కోట్లరూపాయల సాయం ప్రకటించడమే దానికి మరో నిదర్శనం. పక్కనే ఉన్న తెలంగాణకు నయాపైసా నిధులు విదల్చని, కేంద్రంపై బీఆర్‌ఎస్-కాంగ్రెస్ జమిలిగా కారాలు మిరియాలు నూరుతున్న పరిస్థితి.

పక్క రాష్ట్రానికి నిధులివ్వడం సంతోషం. మాకేమీ ఏపీపై ఈర్ష్య, ద్వేషం లేదు. కానీ తెలంగాణకు గుండుసున్నా ఇచ్చినందుకే బాధగా ఉందని కేటీఆర్ వ్యాఖ్య పరిశీలిస్తే.. ఎన్డీయేలో టీడీపీ చేరికపై చంద్రబాబు వ్యూహం-అంచనా ఎంత పకడ్బందీగా అమలవుతుందో స్పష్టమయింది.

వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే సాయం బుందేల్‌ఖడ్ ప్యాకేజీ మాదిరి ఉంటుందన్న బాబు అంచనా నిజం కావచ్చు. అదే నిజమైతే ఏపీకి పారిశ్రామికరాయితీలు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మరిన్ని పరిశ్రమలు తరలిరావడం ఖాయం. అదే జరిగితే ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు వలసలు ఆగిపోవడ ం ఖాయం.

ఇక విశాఖ-చెన్నె, హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్లలోని కొప్పర్తి , ఓర్వకల్లు దగ్గర నీళ్లు-రహదారులు-విద్యుత్-రైల్వేసదుపాయాల కల్పన కోసం, ఆ ప్రాంత అభివృద్ధికి ఈ సంవత్సరంలోనే అదనపు అర్ధిక అభివృద్ధి నిధులు కేటాయిస్తామన్న కేంద్ర హామీ.. చంద్రబాబు పొత్తు వ్యూహం ఫలాలు అందుతున్నాయని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ.

వెనుకబడిన జిల్లాలయిన ఉత్తరాంధ్ర,రాయలసీమకు గ్రాంట్లతో పాటు, కొత్తగా ప్రకాశం జిల్లాను కూడా వెనుకబడిన జిల్లా జాబితాలో చేర్చేందుకు.. చంద్రబాబు కేంద్ర పెద్దలతో జరిపిన చర్చలు ఫలించినట్లే అర్ధమవుతుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసేందుకు అవసరమైన నిధులు సమకూరుస్తామన్న కేంద్రహామీ పరిశీలిస్తే, ఎన్నికల ముందు బీజేపీతో చంద్రబాబు ఎందుకు జతకట్టారోనన్న అసలు రహస్యం అర్ధమవుతుంది. ‘పూర్వోదయ’ కింద కూడా ఏపీ నిధులు పొందనుంది.

బీజేపీతో పొత్తు పెట్టుకుంటే రాష్ట్రానికి ఇన్ని లాభాలుంటాయన్న విషయం తెలిసినందుకే చంద్రబాబునాయుడు.. తన సహచరులు ఆ పార్టీతో పొత్తు వద్దన్నా లెక్కచేయకుండా, బీజేపీ వైపు మొగ్గు చూపారు. అందుకే ఇప్పుడు రాష్ట్రానికి ఇంత సాయం సాధించగలిగారు. మిగిలిన మిత్రపక్షాల మాదిరిగా కేంద్రంలో పదవుల కోసం పట్టుపట్టకుండా.. గొంతెమ్మ కోర్కెలు కోరకుండా ఆర్ధిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించే, ఇలాంటి అదనపు నిధులు-అదనపు సాయం సాథించడానికి కారణం చంద్రబాబునాయుడు ముందుచూపేనన్నది నిర్వివాదం. అందుకే ఆయన విజనరీ లీడర్.

LEAVE A RESPONSE