Suryaa.co.in

Andhra Pradesh

అది సుజనా- టీడీపీ స్క్రిప్టు..

– మతతత్వ రాజకీయాలతో చిచ్చు పెట్టలేరు.
– రాష్ట్రంలో అవినీతి చక్రవర్తి చంద్రబాబే
– చంద్రబాబు అవినీతి సామ్రాజ్యాన్ని పెంచిపోషించింది మీరు కాదా..?
– పవన్ కల్యాణ్ వి బుర్ర తక్కువ మాటలు
– చంద్రబాబు రాజకీయంగా ఇక షెడ్ కు వెళ్ళాల్సిందే..
– వైయస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే.. 2 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం
– రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్

మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
అది సుజనా-టీడీపీ స్క్రిప్టు..
బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇవాళ విజయవాడ వచ్చి, సుజనా చౌదరి, టీడీపీ ఆఫీసు నుంచి తీసుకొచ్చిన స్క్రిప్టును చదివి, మా ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి పైనా అర్థంపర్థం లేని విమర్శలు చేశారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, ఇక్కడ పరిస్థితులు గురించి, ఇక్కడ పరిపాలన చేస్తున్న మనసున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురించి ఏం తెలుసు అని మాట్లాడారు అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ గురించి, ఇక్కడ పరిపాలన గురించి, దేశంలో ఎక్కడా లేనివిధంగా మా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి… ఏం తెలుసుకోకుండానే బీజేపీ కేంద్ర మంత్రి మాట్లాడటం అన్యాయంగా ఉంది. మా రాష్ట్రం గురించి కనీసం ఓనమాలు అయినా తెలుసుకుని వచ్చారా.. అని నిలదీస్తున్నాం.

2 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం..
భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో అమలు జరగనన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే.. గాంధీజీ కన్న కలలను నిజం చేస్తూ.. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసి, 2 లక్షల మంది యువతకు రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చారు, ఈ విషయం మీకు తెలుసా, తెలియదా.. అని ప్రశ్నిస్తున్నాం. అలానే, ప్రతి 50 ఇళ్ళకు వాలంటీర్ చొప్పున 2.6 లక్షల మంది వాలంటీర్లను నియమించారు. మరో 90 వేల మందికి అవుట్ సోర్సింగ్ ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు.. ఇన్ని లక్షల ఉద్యోగాలు, అధికారంలోకి వచ్చిన ఇంత తక్కువ కాలంలోనే ఇచ్చిన రాష్ట్రం దేశంలో మరేదైనా ఉందా.. అని ప్రశ్నిస్తున్నాం.- యువతకు ఉద్యోగాలపై మీరు మాట్లాడిన మాటలపై మేం చర్చకు సిద్ధం.. మీరు సిద్ధమా..?
మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అయినా, ఇంత తక్కువ సమయంలో 2 లక్షల మంది యువతకు మీరు శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారా.. అని ఛాలెంజ్ చేస్తున్నాను. దమ్ముంటే వాస్తవాలు చెప్పండి.

వికసించటానికి అదేమైనా పువ్వా..?
మతతత్వ రాజకీయాలు చేసో, మతాన్ని అడ్డం పెట్టుకుని ఏపీలో మీ పార్టీ వికసించాలంటే.. అదేమన్నా పువ్వు అనుకుంటున్నారా..? . మీ కలలు కల్లలుగానే మిగిలిపోతాయి. మీ పార్టీ నాయకులు పిలవగానే, ఢిల్లీ నుంచి వచ్చి, మా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శించడం.. మళ్ళీ ఢిల్లీ వెళ్ళడం మీకు అనవాయితీగా మారింది.
2014-19 మధ్యకాలంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది మీరు- చంద్రబాబు నాయుడు కాదా.. మీ హయాంలో మీరు చేసిన పనులేంటి..?. మీరు చేసిన మాఫియాలేంటి..?. చంద్రబాబు దోపిడీలో మీరు భాగస్వామి అవునా.. కాదా..? మీరు చెబుతున్నమాఫియాలు అన్నీ మీ హయాంలోనే జరిగాయి. చంద్రబాబు-మీరు కలిసి నాలుగేళ్ళపాటు అధికారంలో ఉండి దోచుకుని దాచుకుంది నిజం కాదా…?. చంద్రబాబు అవినీతి సామ్రాజాన్ని మీరు పెంచి పోషించలేదా..?.
చంద్రబాబును, ఆయన దత్తపుత్రుడి మాటలు నమ్మి మీరు మాపై నిందలు వేస్తారా..?. ఈ రాష్ట్రంలో అవినీతి చక్రవర్తి ఎవరైనా ఉన్నారంటే.. అది ఒక్క చంద్రబాబు నాయుడే.
విభజన హామీల గురించి మాట్లాడకుండా.. మతతత్వ రాజకీయాలతో చిచ్చు పెట్టలేరు.
విభజిత ఆంధ్రప్రదేశ్ కు కేంద్రంలోని బీజేపీ ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చిందా..?. విభజన హామీలు ఏమయ్యాయి.. ఎందుకు నెరవేర్చలేదు. వాటి గురించి విజయవాడ మీటింగ్ లో ఎందుకు మాట్లాడలేకపోయారు.?. మీరు చేయాల్సింది మాత్రం చెప్పకుండా.. మా ప్రభుత్వంపై నిందలు వేసి వెళతామంటే.. జనం చూస్తూ ఊరుకోరు. రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చి, ప్రజలను నట్టేట ముంచిన పాపంలో మీరూ కూడా భాగస్వాములు కాదా.. ?. మీకు అసలు ఆంధ్రప్రదేశ్ లో ఓటు అడిగే నైతిక హక్కు ఎక్కడిది..? విభజన హామీల గురించి మాత్రం ఒక్క మాట మాట్లాడకుండా.. మతతత్వ రాజకీయాలతో ఈ రాష్ట్రంలో చిచ్చు పెట్టాలనుకుంటారా..?. ప్రజలు సహించరు.

మీ పార్టీలన్నింటినీ ప్రజలు ఒకే గాటిన కట్టారు
రాష్ట్రంలో బీజేపీని, కేఏ పాల్ పార్టీని, జనసేన.. ఈ పార్టీలన్నింటినీ ప్రజలు ఒకేగాటిన కట్టారు.
కేఏ పాల్ పార్టీకి ఎంత విలువ ఉందో.. మీకూ ఈ రాష్ట్రంలో అంతే విలువ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో వార్డు మెంబరుగా కూడా బీజేపీ వాళ్ళు గెలవలేరు. ఆంధ్రప్రదేశ్ కు ఇంత అన్యాయం చేసి.. రాష్ట్రానికి ఏ మొహం పెట్టుకుని వస్తారు. వచ్చి, మీ సోది మీరు చెప్పుకుని పోతే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మాపై నిందలు మోపడంపైనే మేం ప్రశ్నిస్తున్నాం.
దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా, సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల గడప వద్దకే చేరుస్తూ, శాచురేషన్ విధానంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ, కులం, మతం, పార్టీలు చూడకుండా, ముఖ్యమంత్రి జగన్ గారు బటన్ నొక్కగానే.. పేదల అకౌంట్లలో డబ్బులు పడుతున్నారు. వేరే రాష్ట్రాల నుంచి అధికారులు, ప్రజా ప్రతినిధులు వచ్చి, ఇక్కడ సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరును, జగన్ పరిపాలనను చూసి శభాష్ అంటున్నారు.
– రాష్ట్రంలోని ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి అవ్వా, తాత.. మా బిడ్డ, మా అన్న, మా తమ్ముడు, మా మేనమామ, మా కుటుంబంలో సభ్యుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడని, మా సంక్షేమం చూసుకుంటున్నాడని అనుకుంటున్నారు.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై..
బుర్ర తక్కువ మాటలు..
పవన్ కల్యాణ్ రాష్ట్రానికి టూరిస్టులాంటి వాడు. ఎప్పుడు వస్తాడో.. ఎప్పుడు ఏ పార్టీతో పొత్తులో ఉంటాడో అతనికే తెలియదు. మూడు నెలలకో, ఆరు నెలలకో ఒకసారి రావడం, నాలుగు మాటలు మాట్లాడి వెళతాడు. రాజకీయాల్లో అసలు ఉంటాడో.. పోటీ చేస్తాడో, చేయడో ఏదీ స్పష్టంగా చెప్పడు. ఒక రాజకీయ పార్టీగా.. రాష్ట్రంలోని 175 స్థానాల్లో పోటీ చేస్తావా.. అంటే దానికీ సమాధానం చెప్పడు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎవరంటే అదీ చెప్పడు. 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తానని కూడా చెప్పడు, చెప్పలేడు. అతనిదొక రాజకీయ పార్టీ, అతనొక నాయకుడా.. అని ప్రజలు నవ్వుకుంటున్నారు.

మాట్లాడితే.. వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటాడు. అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకత ఎక్కడ ఉంది… అని అడుగుతున్నాం. అసలు కౌలు రైతుల గురించి, వ్యవసాయం గురించి పవన్ కల్యాణ్ కు ఏం తెలుసు అని మాట్లాడుతున్నాడు..? దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తన పాలనలో.. రైతును రాజును చేస్తే.. రైతును రారాజును చేయడమే లక్ష్యంగా జగన్ రైతుల కోసం నిరంతరం తపిస్తున్నారు.

పవన్ కల్యాణ్ కు దమ్ముంటే.. మీ జనసేన పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పు. 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పు. ఆ ధైర్యం లేదుకానీ.. లోకాభిరామాయణం అంతా చెబుతావు. 2014లో జనసేనను చంద్రబాబుకు తాకట్టు పెట్టాడు. మళ్ళీ 2024లో కూడా ఆ పార్టీని, నమ్ముకున్న యువకులను చంద్రబాబు కు అమ్మేస్తాడు, తాకట్టు పెట్టేస్తాడు. జనసేన కార్యకర్తలారా కళ్ళు తెరవండి అని చెబుతున్నాం.

పవన్ కల్యాణ్.. ప్యాకేజీ కల్యాణ్ గా చరిత్రలో మిగిలిపోతాడు. నమ్ముకున్నవాళ్ళను నట్టేట ముంచేస్తాడు. అతన్ని నమ్మొద్దు.పేదల గుండెల్లో గూడు కట్టుకున్న, కోట్ల కుటుంబాలలో, వారి జీవితాల్లో వెలుగులు నింపిన జగన్ ప్రభుత్వాన్ని కూలదోయాలన్న ఆరాటమే తప్ప.. ప్రజల కోసం ఏం చేస్తావో చెబితే బాగుంటుంది.

కులాల గురించి మాట్లాడను అంటూనే, మళ్ళీ మళ్ళీ కులాల గురించే మాట్లాడతావు. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలంటావు. నిన్ను నమ్ముకుని వాళ్ళంతా మోస్తే.. నీవేమో చంద్రబాబుకు అమ్ముడుపోతావా.. ఆయనను అధికారంలోకి తీసుకువస్తానంటావా..?ఒక్క సీటు కూడా గెలవలేని పవన్ కల్యాణ్.. ఏం చేస్తాడు..?కులాలను రెచ్చగొడతావా.. నీకు ఒక సిద్ధాంతం ఉందా..?

ఈరోజు తిరుపతిలో కూడా జగన్ మోహన్ రెడ్డి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. పవన్ కల్యాణ్ వి బుర్ర తక్కువ మాటలు..దమ్ముంటే.. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించు, మా పార్టీ విసిరిన ఛాలెంజ్ కు సమాధానం చెప్పు. సిగ్గు, ఎగ్గూ లేకుండా, ఎవరో పెట్టే గడ్డికి కక్కుర్తి పడి.. కులాల పేరుతో మాట్లాడతావా.. ?సినిమాల్లో ఎవరో రాసిచ్చిన స్క్రిప్టులు చదివినట్టు.. పవన్ కల్యాణ్ మతి లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు.

సామాజిక న్యాయ నిర్మాత జగన్
జగన్ ప్రభుత్వంలో 25 మంది మంత్రులు ఉంటే.. వారిలో 17 మంది మంత్రులు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలే. సామాజిక న్యాయాన్ని రాష్ట్రంలో అడుగడుగునా అమలు చేస్తున్న సామాజిక న్యాయ నిర్మాత జగన్ మోహన్ రెడ్డి . 75 ఏళ్ళ స్వాతంత్ర్య భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఇంతగా సామాజిక ధర్మాన్ని పాటించాడా..?

గత మూడేళ్ళలో పేదలకు సంక్షేమ పథకాల ద్వారా రూ. 1.65 లక్షల కోట్లు చీఫ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్.. కు అందాయి. అమ్మ ఒడి.. చేయూత, ఆసరా, రైతు భరోసా, పెన్షన్.. జగనన్న విద్యా దీవెన, విద్యా కానుక.. ఈ పథకాలన్నీ పేర్లు వింటేనే ప్రతిపక్షాల గుండెలు ఆగిపోతాయి.
ఏ లబ్ధిదారుడు ఇంటికి వెళ్ళినా.. ఈరోజు ఒక్కటే చెబుతారు. కులాలు కూడు పెట్టవని అంటున్నారు. పవన్ ను నమ్మితే నట్టేట ముంచుతాడని చెబుతున్నారు.మీరంతా విడివిడిగా వచ్చినా, కట్టకట్టుకుని వచ్చినా, తలకిందులుగా తపస్సు చేసినా జగన్ ప్రభుత్వాన్ని ఇంచి కూడా కదిలించలేదు.

చంద్రబాబు ఇక షెడ్ కు వెళ్ళాల్సిందే..
2019 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును ఒక చెప్పుతోనే కొట్టారు. 2024లో రెండు చెప్పులతో కొడతారు. కులాల్ని రెచ్చగొట్టే రాజకీయాలు చేసిందీ.. ఒక కులాన్ని ప్రజల మీద పెత్తనం చేయించిందీ చంద్రబాబే. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలిచిందంటే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాలను చంద్రబాబు ఎంతగా అణగదొక్కాడో అర్థం చేసుకోవచ్చు.

చంద్రబాబు ఇక షెడ్ కు వెళ్ళాల్సిందే. మా ప్రభుత్వంపై వ్యతిరేక ఓటు ఎందుకు ఉంటుంది. ప్రతి గడపలో ఈరోజు ప్రజలు సంక్షేమ పథకాలతో పండగ చేసుకుంటున్నారు.2024లో 175 స్థానాల్లో 175 స్థానాలు గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నాం.జగన్ ని ఓడించే ధైర్యం ఎవరికీ లేదు.. ఎంత మంది కలిసొచ్చినా జగన్ ప్రభుత్వాన్ని ఏం చేయలేరు. ప్రజలెవరూ ఇవాళ కులం, మతం చూడటం లేదు. జనం అంతా జగన్ పరిపాలననే చూస్తున్నారు.

LEAVE A RESPONSE