Suryaa.co.in

Andhra Pradesh

అంబేద్కర్ అడుగుజాడల్లో సీఎం జగన్ పరిపాలన

– నవభారత నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ – డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు
– బహుజనుల బాంధవుడు, కారణజన్ముడు బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ – మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌
– అణగారిన వర్గాల ఆదర్శ దైవం అంబేద్కర్‌ – మంత్రి జోగి రమేష్‌
– వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా బాబా సాహెబ్ జయంతి వేడుకలు

నవభారత నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ అని డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి బూడి ముత్యాలనాయుడు కీర్తించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొని అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ, దేశంలో ప్రజాస్వామ్యబద్ధ పాలనకు అంకురార్పణ చేసిన మహనీయుడు బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ అని ప్రస్తుతించారు. సమాజంలో ఏ వర్గమూ అణగారి ఉండకూడదని ఆశించి అందుకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు. అంబేద్కర్‌ అడుగుజాడల్లోనే ముఖ్యమంత్రి జగన్‌ ముందుకు సాగుతున్నట్లు ఆయన వివరించారు. తాజాగా మంత్రివర్గ కూర్పులోనూ సీఎం జగన్‌ సామాజిక న్యాయం పాటించిన తీరు దేశానికే మార్గదర్శకం అని బూడి ముత్యాలనాయుడు వెల్లడించారు.

రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, బహుజనుల బాంధవుడు, కారణజన్ముడు బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ అన్నారు. ఆయన కోరుకున్న సమసమాజ సాధన, రాజ్యాంగ స్పూర్తిని సవ్యంగా ఆకళింపు చేసుకుని ఆచరిస్తున్న నిజమైన అంబేద్కర్‌ వారసుడు ముఖ్యమంత్రి జగన్‌ అని పేర్కొన్నారు. దళిత, బడుగు, బలహీన వర్గాలను అన్ని రంగాల్లో ఉన్నతులుగా తీర్చిదిద్దడం, మంత్రి వర్గంలో పెద్ద పీట వేయడం ద్వారా అంబేద్కర్‌కు సీఎం జగన్‌ నిజమైన నివాళి అర్పించారని మంత్రి వేణుగోపాలకృష్ణ చెప్పారు.

రాష్ట్ర గృహనిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ, ప్రపంచ దేశాలు గర్వించదగ్గ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్‌ భారతదేశంలో పుట్టడం మనందరికీ గర్వకారణమన్నారు. అణగారిన వర్గాలకు ఆదర్శ దైవమని అభిప్రాయపడ్డారు. ఆ మహనీయుడి స్పూర్తితో ముఖ్యమంత్రి జగన్‌ పరిపాలన చేస్తున్నారని తెలిపారు. అట్టడుగు వర్గాల్లో ఉన్న ఆఖరి వ్యక్తి వరకు లబ్ధి చేకూరేలా సీఎం కృషి చేస్తున్నట్లు చెప్పారు. అందరి గుండెల్లో చిరస్మరణీయుడైన అంబేద్కర్‌ అడుగుజాడల్లోనే తామంతా ముందుకు సాగుతామని మంత్రి జోగి రమేష్‌ ప్రకటించారు.

పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ డాక్టర్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, తన రాజ్యాంగ రచనతో దేశానికి దశ–దిశ నిర్ధేశించి, ప్రపంచ దేశాలలో భారత్‌కు ప్రత్యేక స్థానాన్ని సముపార్జించి పెట్టిన బి.ఆర్‌.అంబేద్కర్‌ ఆలోచనా విధానం భారత జాతి ఉన్నంతవరకూ వర్ధిల్లుతూనే ఉంటుందన్నారు.
ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ మాట్లాడుతూ, ఈ దేశానికి అంబేద్కర్‌ ఒక చరిత్ర కాదనీ… భావి భారతమే బాబా అంబేద్కర్‌ అని స్పష్టం చేశారు.

ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగమే భారతీయులందరి ఉమ్మడి పవిత్ర గ్రంధం అని వ్యాఖ్యానించారు. అంబేద్కర్‌ ఆలోచనా విధానంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ముందుకు సాగుతూ ఆయన ఆశయాలను ఆచరణలో అమలు చేసి చూపిస్తున్నారని తెలిపారు.

ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాట్లాడుతూ, అంబేద్కర్‌ ఆలోచనలలో అత్యంత కీలకమైన విద్యకు ముఖ్యమంత్రి జగన్‌ అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చాక అంబేద్కర్‌ వాదాన్ని మాటల్లో కాక చేతల్లో చేసి చూపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్‌ అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ, అంబేద్కర్‌ ఆశించిన విధంగా అణగారిన వర్గాలకు స్వర్ణయుగంలా జగన్‌ హయాం వర్ధిల్లుతుందన్నారు.

అంబేద్కర్‌ జయంతి వేడుకల్లో నవరత్నాల కార్యక్రమం వైస్‌ ఛైర్మన్‌ అంకంరెడ్డి నారాయణమూర్తి, గుంటూరు నగర మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, ఏపీ ఫైబర్‌ నెట్‌ ఛైర్మన్‌ గౌతంరెడ్డి, మాదిగ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కనకారావు మాదిగ, ఆప్కో ఛైర్మన్‌ చిల్లపల్లి మోహనరావు, ఏపీ లిడ్‌క్యాప్‌ ఛైర్మన్‌ కాకుమాను రాజశేఖర్, కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ అడపా శేషు, రాష్ట్ర గ్రంధాలయ పరిషత్‌ ఛైర్మన్‌ మందపాటి శేషగిరిరావు, టైలర్‌ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ షేక్‌ సుబాన్‌బి, నాగవంశ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ బొడ్డు అప్పలకొండమ్మ, ఎస్సీ కమిషన్‌ మెంబర్‌ కాలే పుల్లారావు, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి నారుమల్లి పద్మజ, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్‌ బత్తుల దేవానంద్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE