Suryaa.co.in

Andhra Pradesh

పేదవాడు ఆకలితో ఉండకూడదన్నదే అన్నక్యాంటీన్ల లక్ష్యం

  • రూ.5లకే భోజనంతో కూలీలు, కార్మికులు, పేదలకు లబ్ధి

  • పేదవాడి కడుపు నింపడం కన్నా సంతృప్టి ఏముంటుంది?

  • రాష్ట్ర వ్యాప్తంగా 203 క్యాంటీన్లు ప్రారంభిస్తాం

  • అన్నక్యాంటీన్ల నిర్వహణకు రోజుకు రూ.53 లక్షల ఖర్చు

  • అన్నక్యాంటీన్ కు విరాళం అందించేందుకు దాతల ఆసక్తి

  • అన్నక్యాంటీన్ల ప్రారంభానికి ఎన్టీఆర్, డొక్కా సీతమ్మే స్ఫూర్తి

  • గుడివాడలో అన్నక్యాంటీన్ ను ప్రారంభించిన చంద్రబాబు నాయుడు

  • సామాన్యులతో కలిసి భోజనం చేసిన సీఎం చంద్రబాబు, భువనేశ్వరి

గుడివాడ : పేదవాడు ఆకలితో ఉండకూదన్నదే అన్నక్యాంటీన్ల లక్ష్యం, క్యాంటీన్లు శాశ్వతంగా, నిరంతరాయంగా నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుడివాడలో సతీమణి భువనేశ్వరితో కలిసి అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… 4వ సారి సీఎం అయ్యా…ఎన్నో కార్యక్రమాలు చేపట్టా. అన్నక్యాంటీన్ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. స్వాతంత్ర్య దినోత్సవరం రోజున క్యాంటీన్లు ప్రారంభించి నిజమైన దేవుళ్లైన మీ దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉంది.

అన్నక్యాంటీన్ ప్రారంభించినప్పుడు భోజనం చేయడానికి వచ్చిన వారి అభిప్రాయాలు విన్నాక సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ మొదటి సారి ఎమ్మెల్యే అయిన ఈ గుడివాడలో అన్నక్యాంటీన్ ప్రారంభించా. ఎన్టీఆర్ పుట్టిన ఈ ప్రాంతంలో ఎవరూ ఆకలితో ఉండ కూడదని కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గుడివాడకు టీడీపీ ఎప్పుడూ రుణపడి ఉంటుంది.’’ అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

భోజనం చేయడానికి వచ్చిన వారికి సీఎం చంద్రబాబు, భువనేశ్వరి స్వయంగా వడ్డించారు. వారితో కలిసి భోజనం చేసి కాసేపు ముచ్చటించారు. ఒక్కొక్కిరిని పలకరించి వారి కుటుంబ పరిస్థితులను గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు.

పేరుమార్చుకుని అన్నం పెట్టాలన్నా పట్టించుకోలేదు

‘‘ప్రతి ఒక్కరం జానెడు పొట్టకోసమే బతుకుతాం. డొక్కా సీతమ్మ ఆ రోజుల్లోనే ఆకలితో తన వద్దకు వచ్చేవారికి ఏ సమయంలోనైనా అన్నం పెట్టేవారు. అందుకే డొక్కా సీతమ్మ శాశ్వతంగా గుర్తున్నారు. ఎన్టీఆర్ మొదటి సారి సీఎం అయ్యాక తిరుపతి వచ్చి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. దానికి ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశారు. దర్శనానికి వచ్చిన వారు విరాళాలు కూడా ఇస్తున్నారు. టీటీడీ నిధులు ఖర్చులేకుండా ట్రస్ట్ వచ్చిన విరాళాలతో రోజూ భోజనం పెడుతున్నారు.

2018లో నేను అన్నా క్యాంటీన్లు ప్రారంభించా. అన్నం అందరికీ అవసరం. క్యాంటీన్ల పున:ప్రారంభంతో ఆటో డ్రైవర్లు, వీధి వ్యాపారులు, షాపుల్లో పని చేసేవారిలో ఆనందం ఉంది. రోజువారి సంపాదనలో రూ.100 లు భోజనానికే సరిపోతే కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉందని చెప్తున్నారు. అందుకే రూ.15లతో మూడు పూటలా ఆహారం పెట్టే కార్యక్రమాన్ని చేపట్టాం. 203 అన్న క్యాంటీన్లు నాడు ప్రారంభించాం. రోజూ 1.41 లక్షల మంది చొప్పున టీడీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి 4.60కోట్ల మందికి ఆహారం అందించాం. ఇందుకుగాను రూ.130 కోట్లు ఖర్చు పెట్టాం.

మంచి కార్యక్రమాలను కొనసాగించాల్సిన గత ప్రభుత్వం అన్నక్యాంటీన్ మూసేసింది. నచ్చిన పేరు పెట్టుకుని అన్నదానం కొనసాగించాలని అడిగినా పట్టించుకోలేదు. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు భోజనం పెట్టేందుకు ముందుకు వస్తే దుర్మార్గంగా వ్యవహరించి దౌర్జన్యం చేశారు. అన్నంపెట్టేవారిని కూడా పెట్టనీయలేదు. ఆనాడు మంచి బిల్డింగులు, మంచి ప్రదేశాల్లో క్యాంటీన్లు నిర్మించాం. ఆహారం కూడా నాణ్యతతో అందించాం. నేడు 100 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం…సెప్టెంబర్ నెల చివరి నాటికి 203 క్యాంటీన్లు అందుబాటులోకి తెస్తాం.

గిరిజన ప్రాంతాల్లో అన్ని మండలాల్లో క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం. ఒక్కో క్యాంటీన్ నుండి రోజుకు 350 మందికి ఆహారం అందించి… రద్దీని బట్టి పెంచుతాం. ఒక్కో క్యాంటీన్ కు రోజుకు రూ.26,256లు ఖర్చు అవుతుంది. 100 క్యాంటీన్లకు రూ.26 లక్షలు ఖర్చు అవుతుంది. 203 క్యాంటీన్లకు రూ.53.28 లక్షలు ఖర్చు అవుతుంది. సంవత్సరానికి రూ.200 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం. కానీ గత ప్రభుత్వం పేదవాళ్ల పొట్టగొట్టింది. ఎందుకు అన్నక్యాంటీన్లు మూసేశారు? అన్నక్యాంటీన్ పెత్తందారులదా.?’’ అని సీఎం ప్రశ్నించారు.

అన్నక్యాంటీన్ల నిర్వహనకు రోజుకు రూ.53 లక్షల ఖర్చు

‘అల్పాహారానికి రూ.22, మధ్యాహ్న, రాత్రి భోజనానికి కలిపి రూ.68ల ఖర్చుతో మూడు పూటలకు రూ.90 లు అవుతుంది. తినేవారు రూ.15 చెల్లిస్తే మిగతా రూ.75 ప్రభుత్వం, దాతలు ద్వారా ఖర్చు చేస్తాం. 203 అన్నక్యాంటీన్లకు రూ.53 లక్షలు ఖర్చు అవుతుంది. అన్నక్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసే బాధ్యతను అక్షయపాత్రకు అప్పగించాం. ఆ సంస్థ ఇప్పటికే 23 లక్షల మందికి రోజూ మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తోంది.

అన్నక్యాంటీన్లకు ఆహారం సరఫరా కోసం 11 కిచెన్లను ఏర్పాటు చేశారు. పెనుమత్స శ్రీనివాసరాజు, నారా భువనేశ్వరి రూ.1 కోటి చొప్పున విరాళం ఇచ్చారు. అన్నిదానాల కంటే అన్నదానం పవిత్రమైంది…ఇదొక మంచి పుణ్య కార్యక్రమం.

రాష్ట్రంలో ఉండే దాతలకు పిలుపునిస్తున్నా…క్యాంటీన్లకు తోచిన స్థాయిలో విరాళాలు అందించండి. మీ ఇంట్లో శుభకార్యాలయాల సమయంలో కొంత అన్నక్యాంటీన్లకు విరాళం ఇవ్వాలని కోరుతున్నా. 23 ఏళ్ల తర్వాత మనం వందేళ్ల స్వాతంత్ర్య ఉత్సవాలు జరుపుకుంటాం. ఈ 23 ఏళ్లపాటు మనం సంకల్పం తీసుకుని పని చేస్తే అగ్రదేశంగా మన దేశం తయారవుతుంది.

2019లో కూడా మన ప్రభుత్వం వచ్చి ఉండుంటే మనం మంచి స్థాయిలో ఉండేవాళ్లం. నాడు 120 సంక్షేమ పథకాలు ప్రారంభించి, జీఎస్డీపీని 13.5 శాతం పెంచాం. దీంతో పేదల తలసరి ఆదాయం పెరిగింది. 2019లో ప్రజల ఆలోచన మారి ఒక సైకోను తెచ్చారు. అప్పటి నుండి ప్రజలపై గుద్దుడు, బూతులు ప్రారంభమయ్యాయి. మాట్లాడితే బూతులే…ఆడబిడ్డలపైనే సోషల్ మీడియాలో వికృత పోస్టులు పెట్టారు. అన్నీ మాఫియాలే కొనసాగాయి. దొరికింది దోచేవారు.

ఇసుక, లిక్కర్ మాఫియా నడిపారు…ఆఖరికి రేషన్ బియ్యం కూడా మాఫియా చేశారు. క్యాసినో కూడా ఆడించారు….ఎందుకు ఆడించారంటే దాడులు చేశారు. అసెంబ్లీలో కూడా బూతులు మాట్లాడారు. అందుకే శాసన సభను మళ్లీ గౌరవ సభగా మార్చిన తర్వాతే వస్తానని చెప్పి ఇప్పుడు అసెంబ్లీని గౌరవసభగా మార్చాం.’ అని సీఎం అన్నారు.

భగవంతుడిచ్చిన శక్తితో ప్రజల జీవితాలు మార్చుతా
‘రాష్ట్రంలో ఇప్పుడు భూకబ్జాలు కనబడుతున్నాయా.? మీరంతా స్వేచ్ఛగా జీవిస్తున్నారు. గత ఐదేళ్లు స్వేచ్ఛగా కనీసం మాట్లాడుకోలేకపోయారు. ఆ వ్యక్తిని(జగన్) చూసి నవ్వితే కొడతారు…ఏడ్చినా కొడతారు. ఇంట్లో నుండి బయటకు రావాలంటే హౌస్ అరెస్టులు చేస్తారు. ఆయన వచ్చి ఉంటే చెట్లు నరికి పరదాలు కట్టేవారు…నేను చెట్లు నరికించలేదు…పరదాలు కట్టించ లేదు. రచ్చబండే నాకు వేదిక అని చెప్పా. సింపుల్ గవర్నమెంట్….ఎఫెక్టివ్ గవర్నెన్స్ మా విధానం. మీలో ఒకడిగా తిరుగుతా…మీ సమస్యలు అర్థం చేసుకుని పరిష్కరిస్తా.

భగవంతుడు ఇచ్చిన శక్తినంతా ఉపయోగించి మీ జీవితాల్లో వెలుగులు తీసుకొస్తా. ఇప్పుడు కొందరు ఒక బిడ్డనే కంటున్నారు…కొందరు కనడం లేదు. రానురాను జనాభా తగ్గుతుంది…వృద్ధుల సంఖ్య పెరిగి పని చేసే వారి సంఖ్య తగ్గుతుంది. ఎన్ని డబ్బులు ఉన్నాయనేదానికంటే ఎంత మంది పిల్లలుంటే అంత సంపద వస్తుంది. జనాభా నియంత్రించాలని ఒకప్పుడు నేనే చెప్పాను. చనిపోయే వారి సంఖ్య పెరుగుతోంది. యువత తగ్గుతోంది…ఇది ప్రమాదం…దీన్ని నివారించాలి.

నేను పేదల కోసమే పని చేస్తా. పేదరికం లేని గ్రామాలను తయారు చేస్తాం. రాష్ట్రంలో పేదరికం నిర్మూలిస్తాం. సంపద కొద్దిమందికే పరిమితం కాకూడదు.. ప్రతి ఒక్కరూ సంపద అనుభవించాలి. పై స్థాయిలో ఉండే 20 శాతం మంది కిందస్థాయిలో ఉండే 20 శాతం మందిని ఆదుకుంటే వారు ఆర్థికంగా పైకొస్తారు. నా జీవితాంతం ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదరిక నిర్మూలన చేసేవరకు కష్టపడతా. ఏ పని చేసినా పేదల ఆదాయం పెంచడం కోసమే ఆలోచిస్తా..మీ జీవన ప్రమాణాలు పెంచుతాం.

గతంలో కరెంట్ కావాలంటే ఎక్కడినుండో వచ్చేది…కానీ ఇప్పుడు ఇంటివద్దే విద్యుత్ తయారు చేసే విధానం చేపడతాం. సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు. మీ అవసరాలకు పోను మిగిలిన విద్యుత్ ను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. అన్నక్యాంటీన్ల విరాళాలకు ముందుకొచ్చే వారికోసం గుంటూరు చంద్రమౌళి నగర్, SBIలో 37818165097 నెంబరుతో, ISFCSBIN తో ఖాతా ప్రారంభించాం. మా ప్రభుత్వం అందరికీ 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది. ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తాం.’’ అని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.

LEAVE A RESPONSE