– ఉచిత బస్సు ప్రయాణ’తో దాదాపు 88 లక్షల మంది మహిళలకు ప్రయోజనం
– వారందరి తరఫున ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు
– రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి
కాణిపాకం: మహిళల ఆత్మ గౌరవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద పీట వేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
శుక్రవారం స్త్రీ శక్తి పథకంలో భాగంగా చిత్తూరు 2 డిపో నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ను చిత్తూరు ఎం ఎల్ ఏ గురజాల జగన్ మోహన్, కలెక్టర్ సుమిత్ కుమార్ తో కలసి ప్రారంభించారు. అనంతరం కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయం వరకు ప్రయాణించారు. అనంతరం ఆలయం వద్ద పూతలపట్టు ఎం ఎల్ ఏ కె. మురళీ మోహన్ తో కలిసి ఉచిత బస్సు సౌకర్యం ను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీల మేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించని పరిస్థితిలో కూడా నెరవేర్చే సాహసం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన ఒక సంవత్సర కాలంలోనే 90శాతం పథకాలను ప్రభుత్వం అమలు చేసిందన్నారు. భరోసా పెన్షన్, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాల అమలుతో పాటు మహిళల ఆత్మ గౌరవం మరింత పెంచేలా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ స్త్రీ శక్తి పథకం ను ముఖ్యమంత్రి ప్రారంభించారన్నారు.
పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ మెట్రో, మెట్రో ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ బస్సులలో ఈ అవకాశం ను వినియోగించుకోవచ్చన్నారు. మహిళామణులు ఈ అవకాశం ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్త్రీ శక్తి పథకం కూలీ పనులకు, ఉద్యోగాలకు, కళాశాల, పాఠశాలలకు వెళ్లే మహిళలు, ఆడ పిల్లలకు చాలా ఉపయోగంగా ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 88లక్షల మంది మహిళలు ఈ సౌకర్యం ను వినియోగించుకోనున్నారు.
సగటున ఒక్కో కుటుంబానికి నెలకు రూ.4 వేల వరకు డబ్బులు మిగిలే అవకాశం ఉందన్నారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినందుకు రాష్ట్ర మహిళల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి లకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 5 ఆర్టీసీ బస్సు డిపో ల ద్వారా దాదాపు 207 పల్లె వెలుగు 63 ఎక్స్ప్రెస్ సర్వీసులు ద్వారా స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళామణులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించనున్నామని తెలిపారు. గతంలో 1.31 లక్షల ప్రయాణీకులతో 70 శాతం ఆక్యుపెన్సీ ఉండగా పథకం అమలు ద్వారా సుమారు 1.87 లక్షల మంది ప్రయాణికులతో 100 శాతం ఆక్యుపెన్సీ ఉండనుందన్నారు.
21 బడి బస్సులను పల్లె వెలుగు సర్వీసులు గా మార్చామన్నారు. బసు స్టేషన్ లలో ప్రయాణీకుల రద్దీకు అనుగుణంగా కుర్చీలు, ఫ్యాన్ లు, టాయిలెట్ లు ఏర్పాటు తో పాటు మహిళల కోసం అదనంగా పింక్ టాయిలెట్ లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. డ్రైవర్ ల కొరతను అధిగమించడానికి అదనంగా 200 డ్రైవర్ లను ఆన్ కాల్ ద్వారా నియమించి శిక్షణ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగరపాలక మేయర్ అముద, చూడా చైర్మన్ కఠారి హేమలత, తదితరులు పాల్గొన్నారు.