విద్యుత్ వినియోగ పరిమితిని 200 నుంచి 300 యూనిట్లకు పెంచాం
విద్యార్థుల 75 శాతం హాజరు కూడా పాత నిబంధనే
అయినా అక్కసుతోనే ఎల్లో పత్రికల రాతలు
హైదరాబాద్‌లో మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రెస్‌మీట్
ప్రెస్‌మీట్‌లో మంత్రి ఆదిమూలపు సురేష్ ఏం చెప్పారంటే..:
వారికి ఈ పథకం అర్ధం కాదు:
అమ్మ ఒడి పథకంపై ఎల్లో మీడియా గగ్గోలు పెడుతోంది. కానీ మీరు ఎంత గగ్గోలు పెట్టినా ప్రజలు జగన్‌గారిపై పూర్తి విశ్వాసంతో ఉన్నారు. లోకేష్ విమర్శలు చేస్తున్నారు. మరోవైపు ఎల్లో మీడియాలో అసత్యాలు వండి వారుస్తూ, అమ్మ ఒడి పథకంపై కధనాలు రాశారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేవారికి ఈ పథకం అర్ధం కాదు.
ఇదీ సీఎం లక్ష్యం:
పేదరికంలో ఉన్న తల్లులు, తమ పిల్లలను బడికి పంపించడం కోసం ఒక గొప్ప ఆలోచనతో సీఎం వైయస్ జగన్ ఈ పథకం అమలు చేస్తున్నారు. పేదరికం విద్యకు అడ్డు కావొద్దు అన్న నినాదాన్ని జగన్‌గారు తీసుకొచ్చారు. ఆ కుటుంబాలకు ఉన్నత విద్యను అందించడం ద్వారా, వారి స్థితిగతులు మార్చాలని, వారినీ అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో సీఎంగారు పని చేస్తున్నారు.
పేద కుటుంబాల పిల్లలు కూడా బాగా చదువుకోవాలని, రాబోయే కాలంలో వారూ ఈ పోటీ ప్రపంచంలో నిలిచే విధంగా వారికి ఉన్నత విద్యను అందించాలని, అందు కోసం బలమైన పునాది ఏర్పాటు చేస్తూ, 1 నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న నిరుపేద పిల్లలకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులున్నా..:
ఇప్పటికే ఈ పథకంలో రెండుసార్లు పిల్లల తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున, దాదాపు రూ.13 వేల కోట్లకు పైగా మొత్తాన్ని జమ చేయడం జరిగింది. కరోనా మహమ్మారితో ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బ తిన్నప్పటికీ, ఇచ్చిన మాటకు కట్టుబడి, నిరుపేద కుటుంబాలకు మేలు ఆగకూడదన్న సంకల్పంతో సీఎం వైయస్ జగన్ పథకాన్ని అమలు చేశారు.
అయితే అమ్మ ఒడి పథకంపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది. వాస్తవానికి ఈ పథకంలో అర్హతకు సంబంధించి కొత్తగా నియమావళి రూపొందించలేదు. అంతే కాకుండా గతంలో కంటే ఇంకా ఎక్కువ మందికి అవకాశం కల్పించడం కోసం గత ఏడాది అర్హత నియమాలు సవరించాం.
అర్హులు పెరిగేలా ఈ సవరణలు:
అమ్మ ఒడి పథకంలో అర్హత కోసం కుటుంబ వార్షిక ఆదాయం 2019–20లో గ్రామీణ ప్రాంతాల్లో రూ.5 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.6,250 ఉంటే, దాన్ని 2020–21లో గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలకు పెంచడం జరిగింది. అదే విధంగా ఆ కుటుంబాలకు భూకమతాలకు సంబంధించి 2019–20లో 2.5 ఎకరాల పొలం, 5 ఎకరాల భూమి ఉన్న వారిని అర్హులుగా పరిగణిస్తే, 2020–21లో దాన్ని 3 ఎకరాల పొలం, 10 ఎకరాల భూమి ఉన్న వారికి కూడా వర్తింప చేశాం. ఇంకా 2019–20లో నెలకు 2000 యూనిట్ల వరకు వినియోగించే వారినే అర్హులుగా పరిగణిస్తే, 2020–21లో దాన్ని 300 యూనిట్లకు పెంచడం జరిగింది. ఆ విధంగా ఇంకా ఎక్కువ మందికి అవకాశం కల్పించాం.
వారికీ అర్హత కల్పించాం:
నిజానికి నెలకు 300 యూనిట్లకు పైగా విద్యుత వినియోగించే వారు నిరుపేదలు ఎలా అవుతారు? అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఈ పథకంలో అర్హులు కారు. అయితే శానిటరీ వర్కర్లకు పథకాన్ని వర్తింప చేశాం.
ఇంకా గతంలో నాలుగు చక్రాల వాహనాలు ఉన్న వారిని అర్హులుగా గుర్తించలేదు. అయితే దాన్ని కూడా సవరించి టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటో కలిగి ఉన్న వారికి కూడా ఇస్తున్నాం. అలాగే పట్టణాల్లో గతంలో 700 చదరపు అడుగుల ఇల్లున్న వారు మాత్రమే అర్హులు కాగా, ఇప్పుడు 1000 చదరపు అడుగుల ఇల్లున్న వారికి కూడా వర్తింప చేస్తున్నాం. వీటన్నింటి ద్వారా ఇంకా ఎక్కువ మందికి అవకాశం కల్పిస్తున్నాం.
ఎంత మంది తల్లులకు లబ్ధి:
2019–20లో ఈ పథకంలో 42,33,098 మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తే, 2020–21లో ఆ సంఖ్య 44,48,865కు పెరిగింది. అంటే 2,15,767 మంది తల్లులకు అదనంగా పథకంలో ఆర్థిక సహాయం చేశాం. నిజం చెప్పాలంటే వీలైనంత వరకు ఎక్కువ మందికి అవకాశం కల్పించడం కోసం నియమావళి సవరించడం జరిగింది.
పథకంలో అర్హత పొందిన వారిలో 81 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలు ఉన్నారు. 2019–20లో చూస్తే.. బీసీలు 46.53 శాతం, ఎస్సీలు 20.67 శాతం, ఎస్టీలు 6.58 శాతం, మైనారిటీలు 7.17 శాతం. మొత్తం కలిపి 80.95 ఆ వర్గాలకు దక్కింది. 2020–21లో పథకంలో లబ్ధి పొందిన వారిలో 52 శాతం బీసీలు ఉన్నారు.
పథకంలో అర్హులను గుర్తించే ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. అన్ని జాబితాలు సామాజిక తనిఖీ కోసం సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నాం.
హాజరు నిబంధన:
విద్యార్థుల హాజరుకు సంబంధించి కొత్తగా నియమావళి ఏం మార్చలేదు. 75 శాతం హాజరు ఉండాలని తొలి జీఓ నెం:63లో నిర్దేశించడం జరిగింది. అయితే అమ్మ ఒడి పథకాన్ని విద్యా సంవత్సరం మధ్య (2020 జనవరి)లో ప్రారంభించడం వల్ల తొలి ఏడాది హాజరు శాతానికి సంబంధించి ఉన్న నిబంధనను సడలిస్తున్నట్లు అప్పుడు సీఎంగారు చెప్పారు. ఆ తర్వాత కోవిడ్ వల్ల 2020–21 విద్యా సంవత్సరంలో తరగతులు నిర్వహించలేదు. కాబట్టి అప్పుడు కూడా హాజరు 75 శాతం ఉండాలన్న నిబంధనను సడలించడం జరిగింది.
ఇప్పుడు తరగతులు సక్రమంగా జరుగుతున్నాయి కాబట్టి, గతంలో జారీ చేసిన మార్గదర్శకాలు సవరిస్తూ, జీఓ నెం:73 జారీ చేయడం జరిగింది. అలా హాజరు శాతం 75 శాతం ఉండాలన్న నిబంధన అమలు చేస్తూ, ఈ ఏడాది పథకాన్ని జనవరి నుంచి జూన్‌కు మార్చడం జరిగింది.
అయితే వాస్తవాలన్నీ ఇలా ఉంటే నారా లోకేష్‌తో పాటు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తూ విషం చిమ్ముతున్నారు. ఇకనైనా వారు వాస్తవాలు తెలుసుకోవాలి.. అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.