– బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్
హైదరాబాద్: గత బీఆర్ఎస్ పరిపాలనలో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎక్కడైనా ఉద్యమం జరిగితే, ఆ ఉద్యమంతో అనుసంధానమైన జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని గృహ నిర్బంధంలో పెట్టడం ఫ్యాసిజం… అందుకే ఆ చర్యను భారతీయ జనతా పార్టీ కఠినంగా ఖండిస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం విలేఖర్లతో మాట్లాడారు. ఇంకా, ఆయన ఏమన్నారంటే…
ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు వివిధ రకాల కార్యక్రమాలు తలపెట్టడం సహజం. ప్రజలు ఇక్కట్లపై, ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించడం నాయకుల బాధ్యత. అయితే, ఇక్కడ అర్థంపర్థం లేకుండా, ఆలోచన లేకుండా పోలీసులు మితిమీరి అధికార దుర్వినియోగానికి పాల్పడటం దుర్మార్గ వైఖరి. ఇదే పరిస్థితి బీఆర్ఎస్ పాలనలోనూ జరిగింది, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలోనూ కొనసాగుతోంది.
గత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కాలం నుంచి ఇప్పటివరకూ, ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులు నాయకుల అడుగులకు మడుగులొత్తడం, నాయకుల సూచనలతో అనేక తప్పిదాలు చేయడం, అందువల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం కలగడం, కుంభకోణాలు వెలుగులోకి రావడం జరుగుతోంది. అందులో భాగంగానే వివిధ కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి భారతదేశంలో, ప్రత్యేకించి మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కనిపిస్తోంది.
ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి, కానీ ప్రభుత్వ వ్యవస్థ నిలకడగా ఉండాలి. అయితే, ఇలాంటి వైనం కారణంగా ఉన్నతాధికారుల అవినీతి వల్ల వివిధ కేసుల్లో విచారణలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో, రాజకీయ పార్టీ అధ్యక్షులను అరెస్ట్ చేయడం తీవ్రమైన సమస్య. భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఇప్పటికైనా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విధానాలు, పద్ధతులు మార్చుకోవాలి. తప్పిదాలకు పాల్పడటం వల్లే విచారణలు ఎదుర్కోవాల్సి వస్తోంది.