– నిందితులపై హత్యాయత్నం కేసు పెట్టాల్సిందే
– అమరావతి ఏమైనా పాకిస్తాన్‌లో ఉందా?
– అక్కడికి వెళ్లాలంటే వీసాలు కావాలా?
– లేకపోతే వైసీపీ ప్రభుత్వ అనుమతి కావాలా?
– బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు
బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై అమరావతిలో వైసీపీ శక్తులు దాడి చేయటం అనాగరికమే కాదు సిగ్గుచేటు. జాతీయ కార్యదర్శి హోదాలో సత్యకుమార్ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ పర్యటిస్తుంటారు. బాధితులను కలసి, వారికి పార్టీ పక్షాన భరోసా ఇస్తుంటారు. అది పార్టీ నేతగా ఆయన హక్కు, బాధ్యత. అదే బాధ్యత-హక్కుతో అమరావతికి వెళ్లి, రైతులకు మద్దతు ప్రకటించడం తప్పా? అమరావతి రాజధాని అన్నది మా పార్టీ విధాన నిర్ణయం. దానిని ఎప్పుడో తీర్మానించాం.
అయినా అమరావతి ఏమైనా పాకిస్తాన్‌లో ఉందా? అక్కడికి వెళ్లాలంటే వీసాలు, పాస్‌పోర్టులు కావాలా? లేకపోతే వైసీపీ ప్రభుత్వ అనుమతి తీసుకోవాలా? ఓవైపు కేంద్రం నుంచి అన్ని రకాల సాయం పొందుతున్న వైసీపీ ప్రభుత్వం, మరోవైపు బీజేపీ నేతలపై దమనకాండకు పాల్పడ టాన్ని ఏవిధంగా అర్దం చేసుకోవాలి? పార్టీ కార్యకర్తలకు బీజేపీ రక్షణగా ఉంటుంది. ఒక జాతీయ పార్టీ కార్యదర్శికే రక్షణ లేకపోతే, ఇక ఏపీ సర్కారు సామాన్యులకు ఏం రక్షణ కల్పిస్తుంది? ఇది శాంతిభద్రతల వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనం. ఈ ఘటనపై విచారణ జరిపి, నిందితులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలి. సత్యకుమార్‌కు పార్టీ యావత్తూ అండగా ఉంటుంది.