కాకినాడ జిల్లా కాజులూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. పార్క్ చేసి ఉంచిన కారులో ఆడుకునేందుకు వెళ్లిన పాప అందులోనే మృతి చెందింది. ఈ ఘటనపై వివరాల ప్రకారం.. ఇంటి సమీపంలో ఆడుకుంటున్న అఖిలాండేశ్వరి(8) దగ్గరల్లో పార్క్ చేసిన కారులోకి వెళ్లి డోర్ వేసుకుంది. దీంతో కార్ డోర్లాక్ పడింది.
మళ్లీ డోర్ లాక్ తీయరాకపోవడంతో చిన్నారి అందులోనే ఉండిపోయింది. మధ్యాహ్నం కారులోకి వెళ్లిన పాప సాయంత్రం వరకు అందులోనే ఉండిపోయింది. ఈ క్రమంలో కారులో గాలి అందకపోవడంతో చిన్నారి స్పహ కోల్పోయింది. అఖిలాండేశ్వరి ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు గ్రామం మొత్తం గాలించారు.
చివరికి ఇంటి పక్కన కారులో కొన ఊపిరితో బాలికను గుర్తించిన స్థానికులు హుటాహుటిన యానాం ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కూతురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.