– అప్పుల ఊబిలో రేవంత్ ప్రభుత్వం
– 2 లక్షల ఉద్యోగాల వాగ్దానం నీటి బుడగ
– తెలంగాణ బడ్జెట్ 2025-26: అంకెల మాయాజాలం వెనుక ఆర్థిక వైఫల్యాల బహిర్గతం చేసిన డా. శ్రవణ్ దాసోజు ఎమ్మెల్సీ
– తెలంగాణ అధ్యయన సమాచరణ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ మీటింగ్‌లో భారత రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యులు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ తెలంగాణ బడ్జెట్‌పై సమగ్రమైన విశ్లేషణ
హైదరాబాద్: బడ్జెట్ విశ్లేషణ కేవలం సంఖ్యలు చూసి సంతోషపడటం కాదు. గవర్నర్ ప్రసంగం, ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం, సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్స్, CAG రిపోర్ట్స్ — ఇవన్నీ కలిపి విశ్లేషించినప్పుడే బడ్జెట్లోని నిజమైన గుట్టు బయటపడుతుంది. కేటాయింపులు (Allocations), రివైజ్డ్ ఎస్టిమేట్స్ మాత్రమే చూడకుండా యాక్చువల్ ఖర్చు గణాంకాలను పరిశీలించాల్సిన ఆవశ్యకత ఉంది.
రెవెన్యూ లోటు — సర్ప్లస్ నుండి డెఫిసిట్‌కు పతనం
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి స్వీకరించిన రోజు తెలంగాణ రాష్ట్రం రూ. 779 కోట్ల రెవెన్యూ సర్ప్లస్తో ఉంది. రెండు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం రెవెన్యూ డెఫిసిట్‌ను రూ. 9,420 కోట్లకు చేర్చింది — అంటే సర్ప్లస్ స్టేట్‌ను డెఫిసిట్ స్టేట్‌గా మార్చడం ఈ ప్రభుత్వం సాధించిన అతి పెద్ద ‘విజయం’. ఇది ప్రభుత్వ సంపద సృష్టించలేకపోవడానికి స్పష్టమైన నిదర్శనం.
అప్పుల ఊబిలో ప్రభుత్వం — FRBM పరిమితులు అతిక్రమణ
CAG రిపోర్ట్ ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 365 రోజులలో 363 రోజులు ఆర్బిఐ చుట్టూ తిరిగి అప్పు కోసం ప్రయత్నించారు — అప్పు లేకుండా ప్రభుత్వాన్ని నడపలేకపోయారు. ప్రభుత్వం చేసిన అప్పులు:
* తీసుకున్న అప్పు: రూ. 3,47,000 కోట్లు
* ముఖ్యమంత్రి చెప్పినట్లు కట్టిన అప్పు: రూ. 3,30,000 కోట్లు — అయితే వాస్తవంగా FRBM రుణాల కింద కట్టింది రూ. 1,67,000 కోట్లు మాత్రమే
* కార్పొరేషన్లు చెల్లించిన మొత్తాన్ని కూడా తమ ఖాతాలో వేసుకొని ప్రజలను తప్పుదోవ పట్టించారు — ఇది అసెంబ్లీ విశేషాధికారాల ఉల్లంఘన (Breach of Privilege)
FRBM పరిమితులు దాటి అప్పులు చేయడం వాస్తవంగా జరుగుతోందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
కేటాయింపులు vs యాక్చువల్ ఖర్చు — రంగాల వారీ వైఫల్యం
2024-25 యాక్చువల్ ఖర్చు గణాంకాలు పరిశీలిస్తే ఏ రంగంలోనూ 60% కూడా ఖర్చు చేయలేదు. కొన్ని కీలక రంగాల వివరాలు:
* గృహనిర్మాణం (Housing): కేటాయింపు రూ. 7,903 కోట్లు — ఖర్చు కేవలం రూ. 413 కోట్లు (−95%)
* SC/ST/OBC సంక్షేమం: కేటాయింపు రూ. 23,000 కోట్లు — ఖర్చు రూ. 7,420 కోట్లు మాత్రమే
* మైనారిటీ సంక్షేమం (2025-26): కేటాయింపు రూ. 3,591 కోట్లు — ఖర్చు రూ. 1,591 కోట్లు (BCని రూ. 2,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి విఫలం)
* వ్యవసాయ రంగం (2025-26): కేటాయింపు రూ. 3,591 కోట్లు — ఖర్చు రూ. 1,591 కోట్లు
అర్బన్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ సహా అన్ని రంగాల్లోనూ ఖర్చు 40-50%కు మించలేదు. ఇది ప్రజలను వంచించే బడ్జెట్ మాత్రమే అని స్పష్టమవుతోంది.
కేంద్ర గ్రాంట్లలో భారీ లోటు — ‘బడేభాయ్’ బంధం వైఫల్యం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘నరేంద్ర మోడీ నా బడేభాయ్’ అని ప్రకటించినప్పటికీ, తెలంగాణకు కేంద్ర గ్రాంట్లలో రూ. 21,000 కోట్లు పొందాలని లక్ష్యంగా నిర్ణయించుకొని కేవలం రూ. 7,000 కోట్లకు కూడా తక్కువ మాత్రమే వచ్చింది. బడేభాయ్-ఛోటేభాయ్ బంధం తెలంగాణ ప్రజలకు ఏ మేరకూ ఉపయోగపడలేదు.
రైతు విషయంలో వాగ్దాన ఉల్లంఘన
రైతు భరోసా పథకాన్ని పూర్తిగా పడగొట్టారు. రైతు బీమా పథకం, పంట బీమా పథకం అమలు కావడం లేదు. దాదాపు 286 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు — వారి కుటుంబాలకు సకాలంలో పరిహారం అందడం లేదు. రైతు డిక్లరేషన్‌లో ‘అన్ని పంటలకు’ బోనస్ అని రాసినదాన్ని మెలిక పెట్టి ‘సన్న బియ్యానికి మాత్రమే’ బోనస్ అని పరిమితం చేశారు. ఎరువులు, విత్తనాలకు కోసం లైన్లలో నిలబడుతున్న రైతులకు ప్రభుత్వం నుండి సమాధానం లేదు.
నిరుద్యోగులతో మోసం — 2 లక్షల ఉద్యోగాల వాగ్దానం నీటి బుడగ
ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రకటించింది. అయితే వాటిలో 50,000 ఉద్యోగాలు గత BRS ప్రభుత్వమే గుర్తించి రిక్రూట్మెంట్ ప్రక్రియ మొదలుపెట్టినవే. వాటిని కూడా తమ ఖాతాలో వేసుకొని ప్రజలను తప్పుదోవ పట్టించారు. మొదటి సంవత్సరంలో లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 67,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రకటించారు — వాటిలో కూడా నిజమైన సంఖ్య వేరుగా ఉంది.
పెన్షనర్లు, మహిళలు, మైనారిటీలకు అన్యాయం
పెన్షనర్లకు ₹2,500 పింఛను, తులం బంగారం, ₹500 గ్యాస్ సిలిండర్, పెళ్ళిని పోస్ట్‌పోన్ చేయమని చెప్పి పరిగ్రహించిన 420 వాగ్దానాలు అమలుకు నోచుకోవడం లేదు. బడ్జెట్ తయారీలో ఆకాంక్షలకు అనుగుణమైన కేటాయింపులు, ఖర్చు జరగడం లేదు.
విద్య, ఆరోగ్య రంగాల్లో జాతీయ సగటు కంటే తక్కువ ఖర్చు
విద్యకు జాతీయ సగటు 15% కేటాయించాలని విద్య నిపుణులు చెప్తుండగా తెలంగాణ ప్రభుత్వం 9% మాత్రమే కేటాయించింది. ఆరోగ్యం, గ్రామీణ అభివృద్ధి, వివిధ రంగాల్లో ఇతర రాష్ట్రాల కంటే తక్కువ ఖర్చు చేస్తున్నారు. 70% మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలలలో చదువుతుండగా ప్రభుత్వ పాఠశాలలకు నిధులు లేవు. స్కిల్ యూనివర్సిటీ (YSU)కి రెండేళ్ళుగా నిధులు కేటాయిస్తున్నారు కానీ కోర్సులపై స్పష్టమైన విజన్, మిషన్ లేదు.
జనవరి బడ్జెట్ గణాంకాల హస్తలాఘవం
జనవరి వరకు CAG రిపోర్ట్‌లో రెవెన్యూ రసీదులు రూ. 1 లక్ష కోట్లు మాత్రమే ఉండగా, రెండు నెలల్లో రూ. 60,000 కోట్లు చేర్చి బడ్జెట్లో రూ. 1,60,000 కోట్లు చూపించారు — ఇది ‘మంత్రదండం’ తిప్పినట్లు బడ్జెట్ సంఖ్యలు మారుస్తున్నారనే సందేహాన్ని కలిగిస్తోంది.
హైదరాబాద్ కేంద్రీకృత అభివృద్ధి — తెలంగాణకు శాశ్వత ప్రమాదం
మూసి నదీ పునరుద్ధరణ పేరిట రూ. 34,000 కోట్ల బడ్జెట్ కేటాయింపు ప్రకటించారు కానీ అందులో మూసీ పునరుద్ధరణకు నిజమైన కంట్రిబ్యూషన్ ఎంతో స్పష్టంగా చెప్పడం లేదు. కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలు హైదరాబాద్ స్థాయిలో ఎందుకు అభివృద్ధి చెందలేదు? నగర కేంద్రీకృత అభివృద్ధి విధానం తెలంగాణ మొత్తానికి శాశ్వత నష్టం. గుళ్ళు, విగ్రహాల కంటే మూసీ ప్రక్షాళనకు నిధులు కేటాయించాలి.
బీఆర్ఎస్ డిమాండ్లు
* రైతు భరోసా పూర్తి స్థాయిలో అమలు చేయాలి; 286 మంది రైతు కుటుంబాలకు వెంటనే పరిహారం అందించాలి
* ఎఫ్ఆర్బీఎం పరిమితులు మీరకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి
* రెవెన్యూ లోటు రూ. 9,420 కోట్ల నుండి బయటపడేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక రూపొందించాలి
* విద్య, ఆరోగ్య రంగాలకు జాతీయ సగటు మేరకు కేటాయింపులు చేయాలి
* ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ సంక్షేమ నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేయాలి
* హౌసింగ్కేటాయింపు రూ. 7,903 కోట్లలో రూ. 413 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం అంటే 95% నిధులు నిరుపయోగం — వెంటనే సరిదిద్దాలి
* కేంద్ర గ్రాంట్ నిర్ణీత లక్ష్యం రూ. 21,000 కోట్లకు గాను రూ. 7,000 కోట్ల కంటే తక్కువ వచ్చిన కారణాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
* హైదరాబాద్ కేంద్రీకృత అభివృద్ధి విధానం విరమించి జిల్లాల వారీ సమగ్ర అభివృద్ధికి నిధులు కేటాయించాలి
* బడ్జెట్ అమలులో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలి
ఈ సమావేశానికి ప్రొఫెసర్ ఎర్రోజు శ్రీనివాస్ అధ్యక్షత వహించగా, ప్రభుత్వ విప్ డాక్టర్ అద్దంకి దాయకర్, వెటరన్ ప్రొఫెసర్ సీతారామ రావు, మాజీ ఎమ్మెల్యే జులకంటి రంగా రెడ్డి గారు, ప్రొఫెసర్ కృష్ణారెడ్డి, సాయి ప్రసాద్, పాపారావు రాజు రాజు తదితరులు పాల్గొన్నారు.