– కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి
– సంక్షేమం రెండు కళ్లు
– తిరుపతి కేంద్రంగా అధ్యాత్మక పర్యాటకం, పరిశ్రమలతో రాయలసీమ జోన్ అభివృద్ధి
– రెవెన్యూ, స్టాంప్స్ , రిజిస్ట్రేషన్ శాఖ , జిల్లా ఇన్చార్జి మంత్రిఅనగాని సత్యప్రసాద్
తిరుపతి :ప్రతి పేద కుటుంబానికి నేరుగా వారి ఇంటి వద్దకే వెళ్లి స్వయంగా పెన్షన్ అందిస్తున్న దేశంలోనే ఆదర్శప్రాయమైన ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం నిలిచిందని రెవెన్యూ, స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ శాఖ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సోమవారం ఉదయం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల జీవకోన 48, 49 వార్డులలో ఎన్టీఆర్ భరోసా భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో,స్థానిక ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎన్. మౌర్య,ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షీ లతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
ప్రతి నెలా సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు అందజేస్తూ పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను చాటుతున్నామన్నారు. వికలాంగులకు ₹6,000, డయాలసిస్ పేషెంట్లకు ₹10,000, పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి ₹15,000 పెన్షన్ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి విస్తృతమైన పెన్షన్ పథకం లేదని, ఇది కూటమి ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయమన్నారు. గత 17 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ₹51,000 కోట్ల రూపాయలను పింఛన్ల రూపంలో పంపిణీ చేశామని, తిరుపతి జిల్లాలో ఒక నెలకు 2.62 లక్షల మందికి సుమారు ₹113 కోట్ల పెన్షన్లు అందిస్తున్నామని, ఇది పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిదర్శనమన్నారు.
ప్రధానమంత్రి 2047 “వికసిత భారత్” లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశును కూడా “సువర్ణాంధ్రప్రదేశ్”గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సీఐ సమిట్‌లో ₹12 లక్షల కోట్ల పెట్టుబడులు, 6 లక్షల ఉద్యోగ అవకాశాల ప్రకటన ఒక చారిత్రాత్మక ముందడుగని తెలిపారు. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా — విశాఖపట్నం జోన్, సెంట్రల్ జోన్, రాయలసీమ జోన్‌గా విభజించి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అమలు చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా తిరుపతి కేంద్రంగా రాయలసీమ జోన్‌ను స్పిరిచువల్ టూరిజం, ఇండస్ట్రీస్‌తో అభివృద్ధి చేస్తామని తెలిపారు. నాయుడుపేట, సూళ్లూరుపేట వంటి ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ పరిశ్రమలను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. తిరుపతి చుట్టుపక్కల నూతన టౌన్‌షిప్‌లు, కన్వెన్షన్ సెంటర్లు, టూరిజం హబ్బులు ఏర్పాటు చేయడానికి క్యాబినెట్ ఆమోదం కూడా లభించినట్టు చెప్పారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ప్రజలకు హ్యాపీ, హెల్తీ, వెల్తీ వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.


