-అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ అవకాశాలు మృగ్యం
-ముగ్గురు సహా నిందితులను అరెస్టు చేశాక… అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కు నో ఛాన్స్
-అవినాష్ తల్లి అనారోగ్యంగా ఉందంటే రాష్ట్ర ప్రజలెవరూ నమ్మడం లేదు
-ప్రజలు నమ్మాలంటే ఆమె అనారోగ్యంగా ఉన్నారని నిరూపించండి
-25వ తేదీన ముందస్తు బెయిల్ పిటీషన్ పై హైకోర్టు తీర్పు చెప్పాలన్న సుప్రీంకోర్టు
-అవినాష్ రెడ్డి ని అరెస్టు చేస్తామని కర్నూలు ఎస్పీని సిబిఐ అధికారులు కలిసింది నిజమా?, కాదా?… సజ్జల చెప్పాలి
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడుగా అభియోగాలను ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ లభించే అవకాశాలు మృగ్యం. గురువారం నాడు తెలంగాణ హైకోర్టు విచారించనున్న అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ అత్యంత కీలకం. ఈనెల 25వ తేదీన వెకేషన్ కోర్టు బెంచ్ కేసును విచారించి, తీర్పును వెల్లడించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఉత్తర్వులను జారీ చేసిందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు తెలిపారు. బుధవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…. వివేకానంద రెడ్డి హత్య కేసులో నలుగురు పాత్రధారులను ఇప్పటికే అరెస్టు చేయగా, అప్రూవరుగా మారిన ఒక నిందితుడు బయట ఉన్నారు.
ఇక ఈ కేసులో సూత్రధారులైన దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, వైయస్ భాస్కర్ రెడ్డి లను ఇప్పటికే సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ముగ్గురు సహా నిందితులను అరెస్టు చేసిన తర్వాత, వైఎస్ వివేక హత్యకు సూత్రధారులలో ఒకడిగా పేర్కొంటూ, కచ్చితంగా అరెస్టు చేస్తామని, చేయాలని సిబిఐ చెబుతున్న అవినాష్ రెడ్డికి హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందస్తు బెయిల్ ఇవ్వడం అన్నది అసాధ్యం. తన తల్లి ఆరోగ్యం బాగాలేదని చెబితే అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చే అవకాశం లేదు కానీ, అరెస్టు చేసిన తర్వాత సాధారణ బెయిలిచ్చే అవకాశాలుంటాయన్నారు.
సాక్షి దినపత్రికలో అసలు విషయాన్ని రాయలేదు
సుప్రీంకోర్టు తీర్పును సాక్షి దినపత్రిక తో పాటు, నీలి కూలి మీడియా ఛానల్స్ వక్రీకరించాయి. తెలంగాణ హైకోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్లో ఉంది. ఈ నెల 25వ తేదీన వెకేషన్ కోర్టు బెంచ్ విచారించేలా చర్యలు తీసుకోవాలి. తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చేవరకు తనని సీబీ ఐ అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని అవినాష్ రెడ్డి కోరారు. ఓరల్ గా తన తల్లి ఆరోగ్యం బాగాలేదని అవినాష్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేసినప్పటికీ, సుప్రీంకోర్టు ధర్మాసనం వినిపించుకోలేదు.
తెలంగాణ హైకోర్టులో ఒక జడ్జి విని, ఇంకా వినడానికి సమయం లేదని జూన్ 5వ తేదీకి కేసు వాయిదా వేశారు. అయితే, ఈనెల 25వ తేదీన నే కేసును విచారించి తీర్పును వెలువరించాలని వెకేషన్ కోర్టు బెంచ్ ను సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. దీనితో జూన్ 5వ తేదీకి వాయిదా వేసిన కేసు ఇన్ వ్యాలీడ్ అవుతుంది. సుప్రీంకోర్టు తీర్పు ఒకలా ఉంటే… దానికి ఎన్టీవీ, టీవీ9, సాక్షి చానల్స్ తో పాటు ఇతర నీలి చానల్స్ వక్రీకరించి వార్తా కథనాలను ప్రసారం చేశాయి.
అరెస్టుకు తొలగిన అడ్డంకి అని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5, ఈటీవీలు సుప్రీంకోర్టు తీర్పును యధా విధంగా ప్రజలకు తెలియజేసేందుకు కృషి చేశాయి. సాక్షి దినపత్రికలో చాంతాడంత కథనం రాసినప్పటికీ, అసలు విషయాన్నీ రాయలేదు. హైకోర్టు విచారించే వరకు అరెస్టు చేయకుండా తనకు రక్షణ కల్పించాలని అవినాష్ రెడ్డి కోరగా, దానికి సుప్రీంకోర్టు తిరస్కరించినట్లు ఆ వార్త కథనంలో భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదు. సిబిఐ అధికారులకు అరెస్టు చేయాలని ఉన్నప్పటికీ, స్థానిక పోలీసులు సహకారం అందించడం లేదు. ఇదే విషయాన్ని ఒక ప్రముఖ దినపత్రిక కార్టూన్ గా వేసింది.
అవినాష్ తల్లి అనారోగ్యంపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలి
అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారని చెబుతుంటే రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మడం లేదు. ఆమె ఆరోగ్యంతోనే ఉన్నారని, అయినా అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరినట్లుగా డ్రామాలాడుతున్నారని ప్రజలు భావిస్తున్నారు. అవినాష్ తల్లి అనారోగ్యంతో ఉంటే, వైఎస్ విజయమ్మను చూడనివ్వకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అదే వైఎస్ విమలను చూసేందుకు అనుమతినివ్వడం వెనుక ఆంతర్యం ఏమిటి. అంటే అవినాష్ తల్లి ఆరోగ్యం మెరుగుపడిఉండాలి. రామోజీరావు అనారోగ్యంతో ఉన్నారంటే సిఐడి పోలీసులు వైద్యులను పంపి నిర్ధారణ పరీక్షలు చేయిస్తామని చెప్పారని రామకృష్ణంరాజు గుర్తు చేశారు. మరి ఇప్పుడు వైయస్ అవినాష్ రెడ్డి తల్లికి ఆరోగ్య పరీక్షలు చేయిస్తామని సిబిఐ అధికారులు వైద్యులను పంపితే అనుమతిస్తారా అంటూ సందేహాన్ని వ్యక్తం చేశారు.
జగనన్న మృత్యు దీవెన అని పేరు పెడితే బాగుంటుంది
మద్యాన్ని దశలవారీగా నియంత్రిస్తూ, మధ్య నిషేధానికి చర్యలు తీసుకుంటామని జగన్మోహన్ రెడ్డి గతంలో హామీ ఇచ్చారని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు. మద్య నిషేధం అమలు గురించి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రసంగించిన వీడియోను ఆయన మీడియా ప్రతినిధుల ముందు ప్రదర్శించారు. దశలవారీగా మద్య నియంత్రణ చేస్తూ, మద్య నిషేధానికి కృషి చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి… ఇప్పుడు ఆదాయాన్ని ఇబ్బడి, ముబ్బడి గా పెంచుకుంటూ, భవిష్యత్తును కూడా తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.
నాసిరకమైన మద్యాన్ని సేవిస్తూ ప్రజలు మృత్య వాత పడుతున్నారని దానికి జగనన్న మృత్యు దీవెన అని పేరు పెడితే బాగుంటుంది. విద్యా దీవెన కాస్త విద్యా వంచనగా మారింది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని డబ్బులే చెల్లించడం లేదు. సిపిఎస్ పథకాన్ని రద్దు చేస్తామని చెప్పి, చేసింది లేదు. ఎస్సీ ఎస్టీలకు మేలు చేసే 29 పథకాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. విదేశీ విద్యకు నిధులే ఇవ్వడం లేదు.
ఇప్పుడు ఎన్నో షరతులను విధిస్తూ, అంబేద్కర్ పేరును ఎత్తివేసి జగనన్న విదేశీ విద్యగా మార్చడం దారుణం. సురక్షితంగా గమ్యస్థానం చేరు స్తానని చెప్పిన పైలెట్ ను కాకుండా, ఉచితంగా ప్రయాణ విమానం కల్పిస్తానని చెప్పిన పైలెట్ ను నమ్మడం వల్ల చివరకు ఆ విమానం ప్రమాదానికి గురైందని ఈ సందర్భంగా ప్రదర్శించిన మరొక వీడియో సందేశాన్ని రఘురామకృష్ణం రాజు వివరించారు.
32 కేసులు ఉన్నా వ్యక్తికి ప్రధాని మోడీ భయపడడమా?
32 కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తికి ప్రధాని నరేంద్ర మోడీ భయపడడమా? అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. రాజ్యసభలో మెజారిటీ కోసమే మోడీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తుందని వాదనలను ఆయన తోసిపుచ్చారు. గత నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఏ ఒక్క బిల్లును కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్లమెంటులో వ్యతిరేకించింది లేదు. పార్లమెంటులో కేవలం నాపై అనర్హత వేటు వేయాలని కోరుతూ మాత్రమే మా పార్టీ ఎంపీలు ప్లకార్డులను ప్రదర్శించారు. వైఎస్ వివేక హత్య కేసులో సహకరించకుండా, అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తామంటే సహాయ నిరాకరణ చేస్తామని కేంద్రానికి చెప్పే, దమ్ము మా పార్టీ నాయకత్వానికి ఉందని నేను అనుకోవడం లేదు. ఆలస్యం జరిగింది కాబట్టి అనుమానం తలెత్తడం సహజం. కానీ త్వరలోనే అనుమానం నివృత్తి అవుతుందని భావిస్తున్నట్లుగా రఘురామకృష్ణం రాజు తెలిపారు.
తల్లి ప్రేమను అర్థం చేసుకోండి బోర్డు ఎందుకు పెట్టారు?
కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రి ఆవరణలో తల్లి ప్రేమను అర్థం చేసుకోండి అని బోర్డు ఎందుకు పెట్టారో చెప్పాలని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. తల్లి ప్రేమను సిబిఐ అర్థం చేసుకోవాలా?, సిబిఐ కి అరెస్టు చేసే ఉద్దేశమే లేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొని, ఇప్పుడు వారిని తల్లి ప్రేమ అర్థం చేసుకోండని బోర్డు పెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
అవినాష్ రెడ్డి ని అరెస్టు చేస్తామని సిబిఐ అధికారులు పేర్కొనగా, కడప ఎస్పీ సహకరించేందుకు సిద్ధమవడంతో తల్లిని పరామర్శించడానికి పులివెందులకు వెళ్లిన అవినాష్ రెడ్డి, అక్కడ నుంచి తల్లితో కలిసి కర్నూలుకు మకాం మార్చారు. కర్నూల్ ఎస్పీ కూడా కడప జిల్లా ప్రొద్దుటూరు అల్లుడే నట. ఇక కర్నూలు రేంజ్ డిఐజీ ఇటీవల బదిలీ కాగా, ఆయన బదిలీని అడ్డుకున్నది అవినాష్ రెడ్డి నేనట.
కర్నూల్ రేంజ్ డీఐజీ ఇటీవల బదిలీ అయిన మాట నిజమే. కానీ ఆయన బదిలీని అడ్డుకున్నది ఎవరో తెలియదు. కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రి అంతటి ఆసుపత్రులు కడపలోను ఉన్నాయి. అవినాష్ రెడ్డి అభిమానులకు ఆగ్రహం వచ్చి ఎల్లో మీడియా ప్రతినిధులపైనే దాడి చేశారు. ఇతర మీడియా ప్రతినిధులపై కాదు కదా? అన్న సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు విస్మయాన్ని కలిగించాయి.
జర్నలిజం నేపథ్యం నుంచి వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డికి నిజాలు రాసే వారంతా ఎల్లో మీడియా గా కనిపిస్తున్నారా?, టిడిపి కార్యాలయం పై దాడిని అప్పటి డిజిపి సమర్ధించగా, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పై రాళ్లదాడిని కూడా ప్రభుత్వం సమర్ధించుకుంది. కొడితే కొట్టించుకోవాలి… తిడితే తిట్టించుకోవాలి అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వ్యవహార శైలి ఉన్నదని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు.
అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తామని సిబిఐ అనలేదన్న సజ్జల వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. మరి కర్నూలుకు సిబిఐ అధికారులు ఎందుకు వెళ్లారు. గోలి కాయలు ఆడుకోవడానికి వెళ్లారా?, కర్నూలు జిల్లా ఎస్పీని కలిసింది నిజమా? కాదా?? అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. విశ్వ భారతి ఆసుపత్రిలో అవినాష్ రెడ్డి తల్లి చికిత్స పొందుతుంటే, అదే ఆవరణలో కాపలా కాయడానికి మన పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు ఏమి పని ప్రశ్నించారు.