– ఏడాదిలోగా మరో మూడు సి హెచ్ పీ ల ప్రారంభం: సింగరేణి సి ఎం డి ఎన్. బలరామ్
– కంపెనీ మెషనరీతో 2 లక్షలకు క్యూబిక్ మీటర్ల ఓబి తొలగించాలి
– కంపెనీ వ్యాప్త సి హెచ్ పీ ల, భారీ యంత్రాల సమీక్షలో సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్
హైదరాబాద్: బొగ్గు రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లు(సి హెచ్ పి) మరింత సమర్థంగా పనిచేయాలని, ప్రస్తుత 80 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా సామర్థ్యాన్ని 100 మిలియన్ టన్నులకు చేరే దిశగా కృషి జరపాలని సింగరేణి సీఎం డి ఎన్ .బలరాం ఆదేశించారు. శనివారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో జరిగిన సీ హెచ్ పీ లు మరియు భారీ యంత్రాల పనితీరు పై లోతుగా సమీక్ష జరిపారు.
సింగరేణి సంస్థ రానున్న కాలంలో 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోనుంది కనుక సీ హెచ్ పీ ల సామర్థ్యాన్ని కూడా క్రమంగా పెంచాల్సి ఉందన్నారు, ప్రస్తుతం సింగరేణి వ్యాప్తంగా 11 భారీ సీ హెచ్ పీ లు ఉన్నాయని, వీటికి అదనంగా మరో 2 సీ హెచ్ పీ లు, ఒక సైడింగ్ ఏడాదిలోగా అందుబాటులోకి రానున్నాయన్నారు.
5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో రామగుండం-2 ఏరియాలో జీడీకే-6 సీ హెచ్ పీ ని, ఈ ఏడాది ప్రారంభం కానున్న కొత్తగూడెం వీకే ఓపెన్ కాస్ట్ గనికి అనుబంధంగా 6 మిలియన్ టన్నుల సామర్థ్యంతో సీ హెచ్ పీ ని, మందమర్రి ఏరియాలో 2 మిలియన్ టన్నుల సామర్థ్యం గల కేకే-1 రైల్వే వార్ఫ్ లోడింగ్ సైడింగ్ ని నిర్మించనున్నామని, కనుక ఈ నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయించాలని అధికారుల్ని ఆదేశించారు.
సింగరేణి వ్యాప్తంగా ఉన్న కంపెనీ భారీ యంత్రాలతో ప్రస్తుతం రోజుకు 1.6 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ మాత్రమే తొలగిస్తున్నామని, యంత్రాలను పూర్తి పనిగంటలు వినియోగించి రోజుకు కనీసం 2.00 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం భారీ యంత్రాల వినియోగం 13 నుండి 14 గంటలు మాత్రమే ఉందని, దీనిని ఖచ్చితంగా 20 గంటలకు పెంచాలని అప్పుడే లక్ష్యాలు సాధించగలమన్నారు. సాయంత్రం పూట ఆయన సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం పనితీరు పైన మరియు సోలార్ విద్యుత్ ప్లాంట్ల పనితీరు ,కొత్త ప్లాంట్ల ఏర్పాటుపై సమీక్షించారు.
పై సమావేశంలో ఆయనతో పాటు డైరెక్టర్ (ఇ అండ్ ఎం మరియు ఆపరేషన్స్) డి.సత్యనారాయణ రావు, డైరెక్టర్ (పి పి అండ్ పర్సనల్) జి వెంకటేశ్వర్ రెడ్డి, జనరల్ మేనేజర్ ( కోఆర్డినేషన్) ఎస్ .డి.ఎం .సుభాని, జనరల్ మేనేజర్ (సిపిపి) మనోహర్, జిఎం (మార్కెటింగ్ ) రవి ప్రసాద్, జనరల్ మేనేజర్ ఫైనాన్స్ ఎం సుబ్బారావు , జిఎం మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ మల్లెల సుబ్బారావు, జి ఎం (ఓసిపీ లు) డి వి ఎస్ సూర్యనారాయణ రాజు, జి ఎం,( సి హెచ్ పి లు) ఎం. తిరుమల రావు పాల్గొన్నారు. కొత్తగూడెం కార్పొరేట్ నుంచి విభాగాల జనరల్ మేనేజర్లు, అన్ని ఏరియాల నుండి జనరల్ మేనేజర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్నారు.