-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనికి పూర్తిగా వ్యతిరేకం
-వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ఎస్.బి.అంజాద్ బాషా
వక్ఫ్ చట్టంలో ఇష్టారాజ్యంగా సవరణలు చేయడాన్ని వైఎస్‌ఆర్‌సీపీ పూర్తిగా ఖండిస్తుంది. వక్ఫ్ చట్టంలో ఎన్‌డీఏ ప్రభుత్వం చేయాలనుకున్న సవరణలు ఎవరూ ఆమోదించరు. ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా సవరణలకు సిద్దమవడం దారుణం. మైనార్టీల హక్కులు, మతస్వేచ్ఛను కాలరాసే ప్రయత్నాన్ని ఎన్‌డీఏ సర్కార్ చేస్తుంది. ఒక్కసారి వక్ఫ్‌కు దానం చేస్తే అది ఎప్పటికీ వక్ఫ్‌దే. ఈ చట్టాన్ని సవరించడం దుర్మార్గం. మైనార్టీల హక్కులు కాలరాయడమే ఇది అని అన్నారు.
ఎన్‌డీఏ ప్రభుత్వం మైనార్టీలను శత్రువులుగా చూస్తోంది. దేశంలో 9 లక్షల ఎకరాల ఆస్తులు వక్ఫ్ కింద ఉన్నాయి. ఈ సవరణల ద్వారా కాజేయాలనే ప్రయత్నం చేస్తుంది. వక్ఫ్ నిర్వచనాన్ని మార్చే ప్రయత్నం జరుగుతుంది, దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలి. వక్ఫ్ ట్రిబ్యునల్‌ను కాలరాసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వక్ఫ్ ఆస్తులు, భూములు ప్రభుత్వ పరం చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. ఎక్కడైనా వక్ఫ్ భూములు ఉంటే దానిపై బోర్డుకున్న అధికారాలు కూడా తొలగించే కార్యక్రమం జరుగుతుంది. ఈ కుట్రను ప్రతి ఒక్కరూ ఖండించాలి. కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది, మా పార్టీ దీనిని వ్యతిరేకించింది. తక్షణమే కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేశారు.