-వైద్యుని నిర్లక్ష్యం వల్లే పాప తుంటి ఎముక విరిగింది
– పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపిన తల్లిదండ్రులు
-మంగళగిరిలో ఇదో అమానుషం
మంగళగిరి: పాప చేతుల పటుత్వం కోసం ఫిజియోథెరపీ సెంటర్ కు వెళితే వైద్యుని నిర్లక్ష్యంతో పాప తుంటి ఎముకే విరగ్గొట్టారని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. మంగళగిరి నగర పరిధిలోని బాపనయ్యనగర్ కు చెందిన కోలా కృష్ణమోహన్, భార్గవి దంపతుల కుమార్తె జాహ్నవి (7) గత కొంతకాలంగా చేతుల పటుత్వం లేక బాధపడుతోంది.
ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ చిన్నారి కుమార్తె జాహ్నవిని ఫిజియోథెరపీ చికిత్స నిమిత్తం గత రెండు రోజుల క్రితం నగరంలోని అభిరుచి హోటల్ పక్క రోడ్డులో ఉన్న ప్రణతి ఫిజియోథెరపీ సెంటర్ తీసుకువెళ్లారు. డాక్టర్ విజయభాస్కర్ చిన్నారి జాహ్నవికి ఫిజియోథెరపీ నిర్వహించారు. ఈ క్రమంలో మూడవ రోజు సోమవారం సాయంత్రం ఆరు గంటలకు చిన్నారి జాహ్నవిని తల్లిదండ్రులు ఫిజియోథెరపీ సెంటర్ కు తీసుకు వెళ్లగా పాప శరీరం మొత్తం ఫిజియోథెరపీ చేయాల్సి ఉందని డాక్టర్ విజయ్ భాస్కర్ తెలిపారు.
ఇందుకు వారు చేసేదేమీలేక అంగీకరించారు. అయితే ఏమి జరిగిందో తెలియదు కానీ చిన్నారి జాహ్నవి కి ఫిజియోథెరపీ చేస్తున్న క్రమంలో తొంటి ఎముక విరిగిపోయింది. దీంతో చిన్నారి జాహ్నవి అల్లాడిపోయింది. తమ కుమార్తె చేతుల పటుత్వ వైద్యం కోసమని వెళితే….తొంటి విరగ్గొట్టారని తల్లిదండ్రులు కృష్ణ మోహన్, భార్గవి దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు.
చిన్నారి జాహ్నవిని తల్లిదండ్రులు సమీపంలోని ఓ ఆర్థో సెంటర్ కు తీసుకువెళ్లి పిండికట్టు వేయించారు. ఫిజియోథెరపీ వైద్యుని నిర్లక్ష్యం వల్లనే తమ కుమార్తె జాహ్నవి తొంటి ఎముక విరిగిందని, ఈ ఘటనపై మంగళగిరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు.