-ఈసీజీ, బిపి, బ్లడ్ టెస్ట్ చేసిన వైద్య బృందం
-జ్వరం తగ్గిందని వెల్లడించిన డాక్టర్ శ్రీనివాసరెడ్డి
-డిహైడ్రేషన్ అయినందున విశ్రాంతి తీసుకోవాలి: డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి
-భట్టి విక్రమార్కను పరామర్శించిన కేఎల్ఆర్, ప్రేంసాగర్ రావు, బల్మూరి
సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకి నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి పాదయాత్ర శిబిరం వద్ద బుధవారం సాయంత్రం వైద్యులు మరోసారి వైద్య పరీక్షలు చేశారు.సూర్యాపేట నుండి వచ్చిన డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి వైద్య బృందం ఈసీజీ, బిపి, బ్లడ్ టెస్ట్ చేశారు. మంగళవారం పాదయాత్ర చేస్తున్న సమయంలో వడదెబ్బకు గురై తీవ్ర జ్వరంతో బాధపడుతున్న భట్టి విక్రమార్కకు ఈ రోజు ఉదయం వైద్య పరీక్షలు చేశారు, సాయంత్రం కూడా మరోసారి వైద్యులు వైద్య పరీక్షలు చేశారు. వైద్యుల సూచన వరకు ఈరోజు కూడా జరగాల్సిన పాదయాత్రను రద్దు చేశారు.
ఆరోగ్యం నిలకడగా ఉంది
భట్టి విక్రమార్క ఆరోగ్యం నిలకడగా ఉందని.. డిహైడ్రేషన్, జ్వరం, నీరసంతో భట్టి విక్రమార్క ఇబ్బంది పడుతున్నట్లు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈసీజీ, బ్లడ్ టెస్ట్, బిపి పరీక్షలు చేయగా అన్ని నార్మల్ గా ఉన్నాయని చెప్పారు. జ్వరం కూడా కంట్రోల్ లో ఉందని అన్నారు. అయితే గత పది రోజుల నుంచి తీవ్రమైన ఎండలు ఉన్న నేపథ్యంలో పాదయాత్ర చేయడం వల్ల బాడీ పూర్తిగా డిహైడ్రేషన్ అయిందని, ఇందుకు విశ్రాంతి అవసరమని సూచించారు. గురువారం ఉదయం మరోసారి వైద్య పరీక్షలు చేస్తామని డాక్టర్ చెప్పారు.
ప్రముఖుల పరామర్శ
సిఎల్పీ నేత భట్టి విక్రమార్క అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కె.ఎల్. ఆర్, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరు వెంకట్, మాజీ ఎమ్మెల్యే వేదాస్ వెంకయ్య తదితర కాంగ్రెస్ నేతలు పాదయాత్ర శిబిరం వద్దకు వచ్చి పరామర్శించారు. బట్టి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.